Varuntej Gani movie: "వ్యక్తిగతంగా యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. నేను నటుడైందీ ఆ తరహా చిత్రాలు చేయడానికే! ‘గని’ చేయడానికి అదీ ఓ కారణమే" అన్నారు వరుణ్‌తేజ్. ఎప్పటిప్పుడు కొత్త రకమైన కథలతో ప్రయాణం చేసే కథానాయకుడిగా పేరున్న వరుణ్... ఇటీవల బాక్సింగ్ నేపథ్యమున్న కథతో చేసిన చిత్రమే ‘గని’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్ చిత్ర సంగతులను తెలిపారు.. ఆ విషయాలివీ...
బాక్సింగ్ నేపథ్యం ఆలోచన మీదే అని దర్శకనిర్మాతలు చెప్పారు. దానిపై అంత మక్కువ ఎందుకు?
హాలీవుడ్ సినిమాలు బాగా చూస్తుంటా. అక్కడ బేస్ బాల్, బాస్కెట్ బాల్ నేపథ్యంలో సినిమాలొస్తుంటాయి. హిందీలోనూ స్పోర్ట్స్ డ్రామాలు చాలా బాగుంటాయి. బాబాయ్ ఇదివరకు ‘తమ్ముడు’ సినిమా చేశారు. శ్రీహరి నటించిన ‘భద్రాచలం’ చాలాసార్లు టీవీల్లో చూశా. ఇవన్నీ నాకు బాగా నచ్చుతుంటాయి. ఈ సమయంలో మన ప్రేక్షకులకూ కొత్తగా ఉంటుందనేది నా ఆలోచన. దర్శకుడు కిరణ్‌కి, నిర్మాతలకీ నా ఆలోచన నచ్చి ‘గని’ కథని సిద్ధం చేశారు.
‘గని’ ఎలా ఉండనుంది? పాన్ ఇండియా లక్ష్యంగా చేశారా?
సునీల్‌శెట్టి, ఉపేంద్ర, సయీ మంజ్రేకర్... తదితర తారాగణాన్ని చూసి చాలా మంది ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు అనుకోవచ్చు. పాత్రలు అలాంటి నటుల్ని కోరుకున్నాయి తప్ప, ఇది పాన్ ఇండియా మార్కెట్ లక్ష్యంగా చేసిన సినిమా కాదు. రాకీ సిరీస్‌లో 8 భాగాలు ఉంటాయి. ఆ సిరీస్‌ని దర్శకుడు చూశాడో లేదో తెలియదు కానీ, ఒక బాక్సర్ జీవితంలో వచ్చే సమస్యలు, భావోద్వేగాలన్నీ అందులో కనిపిస్తాయి. అలాంటివన్నీ ఉన్న మరో మంచి కథ ‘గని’. విడుదల తేదీని ముందే అనుకుని రంగంలోకి దిగాం. కరోనాతో ప్రణాళికలన్నీ తారుమయ్యాయి. ఎప్పుడూ అసహనమైతే కలగలేదు కానీ, సినిమా చేశాం కదా, అందరికీ చూపిస్తే ఓ పనైపోతుందనిపించేది.
సీనియర్ నటులతో కలిసి పనిచేశారు. ఆ అనుభవం ఎలాంటిది?
ఉపేంద్ర తన సినిమాల్లో రెబల్‌గా కనిపిస్తుంటారు. వ్యక్తిగతంగా ఆయన చాలా సున్నితం. సెట్లో అందరితో చాలా మర్యాదగా మాట్లాడుతుంటారు. సునీల్‌శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర... ఇలా అందరూ మంచి పాత్రల్లో కనిపిస్తారు. ‘మిస్టర్’ సినిమా సమయంలో సహ దర్శకుడిగా నాకు కిరణ్ కొర్రపాటి పరిచయం అయ్యాడు. అప్పట్నుంచి మా ఇద్దరి ఆలోచనలు ఒకలాగే అనిపించేవి. తను ఈ కథని మలిచిన తీరు చాలా బాగుంటుంది. సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాని అర్థం చేసుకున్న విధానం మాకు మేలు చేసింది. తనకున్న పది సినిమాల్లో ఒకటని కాకుండా, ప్రత్యేకంగా పరిశోధన చేసి బాణీలు సమకూర్చాడు.