Varun Lavanya Wedding :ఇటలీలోనీ టస్కానీ వేదికగా టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి వివాహ వేడుకలు గ్రాండ్గా జరుగుతున్నాయి. ఇప్పటికే కాక్‌టెయిల్ పార్టీ ఘనంగా జరగ్గా.. మరికొద్ది గంటల్లో సంగీత్, హల్దీ వేడుకలు కూడా మొదలుకానున్నాయి. అయితే అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుండగా.. పలువురు సినీ ప్రముఖులు, వరుణ్ లావణ్య బంధువులు ఇటలీకి పయనమవుతున్నారు.
ఇప్పటికే మెగా, అల్లు ఫ్యామిలీలతో పాటు కామినేని ఫ్యామిలీ వివాహ వేదికకు చేరుకుంది. టాలీవుడ్ హీరో నితిన్ కూడా తన కుటుంబంతో అక్కడ సందడి చేస్తున్నారు. తాజాగా ఈ వివాహానికి సమంత, రష్మిక మందన్న, నాగ చైతన్య పయనమయ్యారు. మంగళవారం ఈ ముగ్గురూ వేర్వేరు సమయాల్లో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
మరోవైపు బుధవారం (నవంబర్ 1) మధ్యాహ్నం 2.48 గంటలకు వరుణ్- లావణ్య పెళ్లి బంధంతో ఒక్కటవనున్నారు. ఆ తర్వాత రాత్రికి అక్కడే ఓ వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంతి. ఇక ఈ వేడుకకు సుమారు 120 మందికిపైగా అతిథులు హాజరు కానున్నారని సమాచారం. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్లో మరో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. పెళ్లికి హాజరుకాలేని సెలబ్రిటీలు ఈ ఫంక్షన్కు రానున్నట్లు సమాచారం.