Oscar Race RRR Jr.NTR: దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్ నటన.. భారతీయ ప్రేక్షకులతోపాటు హాలీవుడ్ సినిమా ప్రముఖులను సైతం మెప్పించింది. ముఖ్యంగా పెద్ద పులితో ఎన్టీఆర్ ఫైట్ చేసే సీన్, ఇంటర్వెల్ సీన్ అద్భుతమని చెప్పొచ్చు. భావోద్వేగభరిత సన్నివేశాల్లోనూ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ఆయన నటనకు ఆస్కార్ వచ్చే అవకాశం ఉందని హాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రతి ఏడాది ఆస్కార్స్ ప్రకటించడానికి ముందు ఎవరెవరికి రావచ్చు? అంటూ 'ప్రెడిక్షన్స్' చెప్పడం సహజంగా జరుగుతుండేది. ఉత్తమ నటుడిగా ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఎవరెవరు ఉన్నారో చెబుతూ... 'వెరైటీ' సంస్థ ఒక లిస్టు వెల్లడించింది. అందులో పోటీ ఇచ్చే హీరోల జాబితాలో ఎన్టీఆర్ పేరు కూడా ఉంది. అయితే... ఎన్టీఆర్ పేరు టాప్ 40లో లేదు. అయితేనేం? ఆయన పేరు లిస్టులో ఉండటం వల్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. నెట్టింట తెగ హంగామా చేస్తున్నారు.
ఆస్కార్స్ లిస్టులో 'ఆర్ఆర్ఆర్' పేరు వినిపించడం ఇది తొలిసారి కాదు.. ఇంతకు ముందు 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'కు ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' కేటగిరీలో పురస్కారం వచ్చే అవకాశం ఉందని ఒక ఆంగ్ల మీడియా సంస్థ పేర్కొంది. డానీ బోయెల్ దర్శకత్వం వహించిన 'స్లమ్ డాగ్ మిలియనీర్'కు ఎనిమిది ఆస్కార్స్ వచ్చినప్పుడు రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'కు ఎందుకు రాకూడదు? అని సూటిగా ప్రశ్నించింది.