తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నా కోసమే ప్రత్యేకంగా పాత్రలు సృష్టిస్తున్నారు.. యశోదలో నా రోల్ అదే' - వరలక్ష్మీ శరత్ కుమార్ యశోద

వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్. వైవిధ్యభరిత పాత్రలతో అభిమానులను అలరిస్తున్నారు. రచయతలు తన కోసం ప్రత్యేకంగా పాత్రలు సృష్టిస్తున్నారని చెబుతున్నారామె. హైదరాబాద్​లో విలేకర్లతో మాట్లాడిన ఆమె.. అనేక ఆసక్తికర విషయాలు చెప్పారు. అవేంటంటే?

Varalaxmi Sarathkumar
Varalaxmi Sarathkumar

By

Published : Oct 30, 2022, 6:41 AM IST

"యశోద'లో కథే హీరో. మేమంతా అందులో పాత్రధారులమే. సినిమాలోని మహిళల పాత్రల్ని చాలామంది తమకు అన్వయించుకుంటున్నారు" అన్నారు నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌. వైవిధ్యభరిత పాత్రలతో అలరించే ఆమె.. 'యశోద'లో ఓ కీలక పాత్ర పోషించారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని హరి - హరీష్‌ సంయుక్తంగా తెరకెక్కించారు. ఇది నవంబరు 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

సమంతతో సమాంతరంగా సాగే పాత్రలో..
"ఇదొక సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా. నాది సెకండ్‌ లీడ్‌ అని చెప్పొచ్చు. సమంతతో పాటు నా పాత్ర కూడా సమాంతరంగా సాగుతుంటుంది. మా కథలు, పాత్రల మధ్య ఉన్న సంబంధం ఆసక్తికరంగా ఉంటుంది. నా పాత్ర కాస్త గ్రే షేడ్‌లో కనిపిస్తుంది. దర్శకులు కథ వినిపించాక దీన్నెలా ఆలోచించారు? ఇలాంటి పాత్రలు ఎలా రాశారు? అని ఆశ్చర్యపోతూ వారిని అడిగా".

అలాంటి మనుషులు ఉన్నారు అనిపిస్తుంది..
"ఈ కథలో సరోగసీ (అద్దె గర్భం) అన్నది ఒక టాపిక్‌ అంతే. అందులోని మంచీచెడుల గురించి చెప్పడం లేదు. ఇది పూర్తిగా కల్పిత కథ. కానీ.. ఇందులో చూపించిన మనుషులు సమాజంలో ఉన్నారనిపిస్తుంది. ఒక భిన్నమైన పాత్ర చేసేటప్పుడు నన్ను నేను ఛాలెంజ్‌ చేసుకుంటా.

సామ్‌తో సరదా సరదాగా..
"ఈ చిత్రం కోసం సమంత చాలా కష్టపడింది. యశోద పాత్రలో జీవించింది. సినిమాలో నాకు తనకు సీరియస్‌ సీన్స్‌ ఉన్నాయి. నేనేమో షూటింగ్‌ గ్యాప్‌ వస్తే జోక్‌ వేసేదాన్ని. 'షాట్‌ ముందే ఇలాంటి జోక్స్‌ ఎందుకు వేస్తావ్‌?' అని నవ్వేసేది. తనతో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉంటుంది".

తమిళ్‌లో చేయడానికి డేట్స్‌ లేవు..
"క్రాక్‌'లో జయమ్మ పాత్ర చేశాక నాకు మంచి వైవిధ్యభరితమైన పాత్రలు వస్తున్నాయి. రచయతలు నా కోసం ప్రత్యేకంగా పాత్రలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు నేను తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నా. తమిళ సినిమాలు చేయడానికి డేట్స్‌ లేవు. ప్రధాన పాత్రధారిగా 'శబరి' చేస్తున్నా. బాలకృష్ణ 'వీరసింహారెడ్డి'లో నటిస్తున్నా".

ABOUT THE AUTHOR

...view details