Vanitha VijayKumar Bigg Boss : తమిళ నటి వనిత విజయ్‌కుమార్ సోషల్ మీడియా వేదికగా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారంటూ ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె మొఖంపై గాయాలతో ఉన్న ఓ ఫొటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. అయితే తమిళ 'బిగ్‌బాస్ సీజన్ 7'లో పాల్గొన్న ఓ కంటెస్టెంట్‌కు సంబంధించిన మద్దతుదారుడే ఈ దాడికి పాల్పడి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
"నిన్న రాత్రి నా సోదరి నివాసం నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఓ వ్యక్తి నాపై దాడి చేశారు. నా ముఖంపై తీవ్రగాయం చేసి వెళ్లిపోయారు. దీన్ని చూసి పోలీసులకు కంప్లైంట్ చేయాలని నా సోదరి చెప్పింది. అయితే నాకు మాత్రం ఈ విషయంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. అందుకే అలాంటి ప్రయత్నాలు నేను చేయలేదు. ఫస్ట్ ఎయిడ్ తర్వాత.. నాపై దాడి చేసిన వ్యక్తి గురించి ఆలోచించాను. అతడి మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ప్రస్తుత బిగ్‌బాస్ కంటెస్టెంట్ ప్రదీప్ ఆంటోనీ మద్దతుదారుడే ఈ దాడికి పాల్పడి ఉంటారని నాకు అనిపిస్తోంది" అంటూ ఆమె పోస్ట్ పెట్టారు.