"మనిషి తన దైనందిన జీవితంలో అన్నవస్త్రాలతో పాటు వినోదాన్నీ ఓ సాధనంగా ఎంచుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఎలాంటి సినిమాలు అందించాలి అన్నది పరిశ్రమ పెద్దలు ఆలోచించాలి" అన్నారు కథానాయకుడు బాలకృష్ణ. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన 'ఊర్వశివో రాక్షసివో' చిత్ర విడుదల ముందస్తు వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ప్రేమకథా చిత్రమిది. రాకేష్ శశి తెరకెక్కించారు. ధీరజ్ మొగిలినేని, విజయ్.ఎమ్ సంయుక్తంగా నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పకులు. నవంబరు 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. "ట్రైలర్ బాగుంది. సినిమా కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. నాకూ ఇలాంటి చిత్రాల్లో నటించాలని ఉంటుంది. కాకపోతే నా పరిమితులు నాకున్నాయి. నా అభిమానులు, ప్రేక్షకులకు నచ్చనిది వాళ్లపై బలవంతంగా రుద్దాలని అనుకోను. ఈ సినిమా విజయవంతమవుతుందని నమ్ముతున్నా" అన్నారు.
"మా నాన్నతో రెండు సినిమాలు చేశా. 'కొత్తజంట', 'శ్రీరస్తు శుభమస్తు'. రెండూ పెద్ద హిట్టయ్యాయి. ఈ మూడో చిత్రమూ అదే తరహాలో విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఇందులో అను ఇమ్మాన్యుయేల్‌లోని నటిని అందరూ చూస్తారు. దర్శకుడు రాకేష్ పైకి నెమ్మదిస్తుడిలా కనిపిస్తాడు కానీ, పెద్ద పని రాక్షసుడు" అన్నారు హీరో అల్లు శిరీష్.