Upcoming Telugu Movies: సంక్రాంతి.. వేసవి.. దసరా.. దీపావళి.. అంటూ పక్కా ప్రణాళికలతో సాగుతుంటుంది సినీ క్యాలెండర్. అగ్రతారలు పండగ రోజులపై గురిపెడితే.. కుర్రహీరోలు మిగిలిన రోజుల్ని పంచుకుంటుంటారు. ఒకరి తర్వాత ఒకరిగా వినోదాల విందు భోజనం వడ్డిస్తుంటారు. అయితే కొవిడ్ దెబ్బకు రెండేళ్ల పాటు ఈ సినీ క్యాలెండర్ తారుమారయ్యింది. ఏ చిత్రం ఎప్పుడు వస్తుందో తెలియని సందిగ్ధం. చిత్రీకరణలు పూర్తయినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? రారా? అన్న భయాలతో తారలంతా పదే పదే వాయిదాల బాట పట్టారు. అయితే ఇప్పుడా పరిస్థితులన్నీ కుదుట పడ్డాయి. ఆరంభంలో కొవిడ్ భయపెట్టినా.. ఆ తర్వాత నుంచి సినీ క్యాలెండర్ మునుపటిలా పక్కా ప్రణాళికతో కొనసాగింది. ఇప్పుడు బాక్సాఫీస్ ముందు వానా కాలం వినోదాల జల్లు కురుస్తోంది. ఆగస్టు నుంచి సెప్టెంబరు వరకు బెర్తులన్నీ దాదాపు ఖరారైపోయాయి. దసరా సీజను నిండింది. కానీ, ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న పలు సినిమాలు.. ఇంత వరకు విడుదల కబురు వినిపించలేదు.
Nagashourya New Movie: గతేడాది ఆఖర్లో 'వరుడు కావలెను' చిత్రంతో విజయాన్ని అందుకున్నారు కథానాయకుడు నాగశౌర్య. ఆ వెంటనే 'లక్ష్య'తో ప్రేక్షకుల ముందుకురాగా.. అది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఆయన నటించిన కొత్త చిత్రం 'కృష్ణ వ్రిందా విహారి'. అనిష్ ఆర్.కృష్ణ తెరకెక్కించారు. ఏడాది ఆరంభంలోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను.. వేసవి బరిలో నిలిపేందుకు ప్రయత్నించారు నిర్మాతలు. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. జూన్ నెలాఖరులో విడుదల కానున్నట్లు అప్పట్లో ప్రచారం వినిపించినా.. అది సాధ్యపడలేదు. ఇప్పటికే ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు బెర్తులన్నీ ఖరారైన నేపథ్యంలో.. ఈ సినిమా ఎప్పుడొస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Nikhil Karthikeya Movie: కొవిడ్ పరిస్థితుల వల్ల రెండున్నరేళ్లుగా ఒక్క చిత్రాన్నీ విడుదల చేయలేకపోయారు కథానాయకుడు నిఖిల్. ఈ విరామంలో ఆయన రెండు సినిమాలు పూర్తి చేశారు. వాటిలో ఒకటి 'కార్తికేయ 2' కాగా.. మరొకటి '18 పేజెస్'. ఈ రెండింటిలోనూ నిఖిల్, అనుపమ జంటగా నటించడం విశేషం. వీటిలో 'కార్తికేయ 2' వచ్చే నెల 12న రానుండగా.. '18 పేజెస్' విడుదలపై ఇంత వరకు స్పష్టత రాలేదు. పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన చిత్రమిది. దీన్ని సెప్టెంబరులో విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.
Sharwanand New Movie: ఏడాది ఆరంభంలో 'ఆడవాళ్లు మీకు జోహార్లు'తో బాక్సాఫీస్ ముందు సందడి చేశారు శర్వానంద్. అయితే ఇది ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇప్పుడాయన నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న మరో సినిమా 'ఒకే ఒక జీవితం'. శ్రీకార్తీక్ తెరకెక్కించారు. సైన్స్ ఫిక్షన్ అంశాలతో ముడిపడిన ఈ కుటుంబ కథా చిత్రం.. వేసవిలోనే విడుదల కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించినా.. అది సాధ్యపడలేదు. మరెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నది తేలాల్సి ఉంది.