ముగింపులో అగ్రతారల మెరుపులు కనిపిస్తే ఆ ఉత్సాహం మరోస్థాయిలో ఉంటుంది. 'అఖండ', 'పుష్ప', 'శ్యామ్ సింగరాయ్' చిత్రాలతో గతేడాది తెలుగు చిత్రసీమకు మెరుపు లాంటి ముగింపే దక్కింది. ఈసారి ఆ స్థాయిలో పెద్ద చిత్రాల సందడి కనిపించకున్నా.. వినోదాలకు ఏ లోటు లేదంటున్నారు యువ కథానాయకులు. ఎందుకంటే ఈ ఏడాదికి శుభం కార్డు వేయనుంది వీళ్లే.
ఇటీవలే 'మేజర్'గా పాన్ ఇండియా స్థాయిలో మెరుపులు మెరిపించారు కథానాయకుడు అడివి శేష్. ఇప్పుడాయన 'హిట్2'తో థ్రిల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. హీరో నాని సమర్పణలో రూపొందిన చిత్రమిది. విజయవంతమైన 'హిట్' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. తొలి భాగాన్ని తెరకెక్కించిన శేలేష్ కొలను ఈ రెండో భాగానికీ దర్శకత్వం వహించారు. ప్రచార చిత్రాలతోనే ఆసక్తిరేకెత్తిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాపై ఇటు ప్రేక్షకుల్లోనూ.. అటు ట్రేడ్ వర్గాల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి.
మరి ఈ చిత్రంతో శేష్ తన జైత్ర యాత్ర కొనసాగిస్తారా? లేదా? తెలియాలంటే డిసెంబరు 2వరకు వేచి చూడక తప్పదు. ఇదే తేదీకి 'మట్టి కుస్తీ'తో బాక్సాఫీస్ బరిలో సందడి చేయనున్నారు విష్ణు విశాల్. ఆయన రెజ్లర్‌గా నటించిన క్రీడా నేపథ్య చిత్రమిది. చెల్లా అయ్యావు తెరకెక్కించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఏక కాలంలో విడుదల కానుంది. ఈ చిత్ర నిర్మాణంలో హీరో రవితేజ కూడా భాగస్వామిగా ఉండటంతో దీనిపైనా ప్రేక్షకుల్లో చక్కటి అంచనాలే నెలకొని ఉన్నాయి.
మాస్‌గా రవితేజ.. క్లాస్‌గా నిఖిల్!
మాస్ యాక్షన్ చిత్రాలకు చిరునామా రవితేజ. ఇప్పుడాయన 'ధమాకా'తో సరికొత్త మాస్ యాక్షన్ హంగామా రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు. త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రమిది. 'ఖిలాడి', 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాలతో ఈ ఏడాది వరుస పరాజయాలు అందుకున్నారు రవితేజ. అందుకే ఆయన ఈ సినిమాతో విజయం దక్కించుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో డిసెంబరు 23న విడుదల కానుంది. ఇదే తేదీకి '18 పేజిస్' రూపంలో ఓ అందమైన ప్రేమకథను ప్రేక్షకులకు చూపించనున్నారు యువ కథానాయకుడు నిఖిల్. పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కించిన చిత్రమిది. సుకుమార్ రైటింగ్స్, జీఏ2 పిక్చర్స్ పతాకాలపై నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. 'కార్తికేయ2' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.