బాలీవుడ్‌కు గతేడాది అంతగా కలిసి రాలేదు. భారీ బడ్జెట్ చిత్రాలు తీవ్రంగా నిరాశపర్చడం, పలు చిత్రాలను వివాదాలు చుట్టుముట్టడం, విడుదలకు ముందే బాయ్‌కాట్ ట్రెండ్‌తో ప్రభావం పడటం తదితర కారణాలతో హిందీ చిత్రసీమ భారీ నష్టాల్ని మూటగట్టుకుంది. మరోవైపు దక్షిణాది చిత్రాలు హిందీ మార్కెట్లో సంచలనం సృష్టించగా, వాటి ముందు బాలీవుడ్ వెలవెలబోయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాబోయే చిత్రాలపై బాలీవుడ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. వాటిలో దాదాపు 15 చిత్రాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అవి విజయం సాధిస్తే బాలీవుడ్ మళ్లీ కళకళలాడటం ఖాయం. ఆ చిత్రాల విశేషాలివీ..
మూడు చిత్రాలతో షారుక్
షారుక్ ఖాన్ నుంచి 2023లో మూడు చిత్రాలు రానున్నాయి. 2018లో 'జీరో' ఘోర పరాజయం తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఆయన హీరోగా నటించిన చిత్రం 'పఠాన్'. దీపికా పదుకొణె కథానాయికగా నటించిన ఈ చిత్రం జనవరి 25న విడుదలవుతోంది. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించారు. అయితే ఇటీవల విడుదల చేసిన 'బేషరమ్ రంగ్..' పాటలో దీపికా వస్త్రధారణ, అందాల ఆరబోతపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
సెన్సార్ బోర్డు కూడా కొన్ని సన్నివేశాలను తొలగించాలని స్పష్టం చేసింది. ఈ అడ్డంకులను దాటుకుని 'పఠాన్' విజయ ఢంకా మోగిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో 'జవాన్' చిత్రం చేస్తున్నారు షారుక్. నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రధారులు. జూన్ 2న విడుదల చేయనున్నారు. అగ్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీతో షారుక్ చేస్తున్న తొలి చిత్రం 'డంకీ'. ఈ చిత్రాన్ని డిసెంబరు 22న విడుదల చేయనున్నారు.
ప్రభాస్ మేజిక్ ఫలిస్తుందా?
పాన్ ఇండియా హీరోగా సత్తా చాటుతున్న ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ లంకేశ్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నారు. అయితే ఇటీవల విడుదల చేసిన టీజర్‌లో విజువల్ ఎఫెక్ట్స్ నాణ్యత, ప్రధాన పాత్రధారుల ఆహార్యం ఏమాత్రం బాగోలేవంటూ వీక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో వాటిని సరిదిద్దడంపై చిత్రబృందం దృష్టిపెట్టింది. ఈ సినిమాను జూన్ 16న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభాస్ చిత్రంతోనైనా బాలీవుడ్‌కు భారీ విజయం దక్కుతుందేమో చూడాలి.
యానిమల్‌గా రణ్‌బీర్
'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, రణ్‌బీర్ కపూర్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం 'యానిమల్'. నూతన సంవత్సర కానుకగా విడుదల చేసిన రణ్‌బీర్ ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన వచ్చింది. రష్మిక కథానాయిక. ఆగస్టు 11న విడుదల చేయనున్నారు. శ్రద్ధా కపూర్‌తో కలసి రణ్‌బీర్ నటిస్తున్న 'తూ ఝూటీ మై మక్కార్' హోలీ కానుకగా మార్చి 8న విడుదలవుతోంది. లవ్ రంజన్ దీన్ని తెరకెక్కిస్తున్నారు.