దశాబ్ద కాలంలో ఎప్పుడూ రానన్ని సినిమాలు గతేడాది తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అనువాదాలతో కలుపుకుని 287 చిత్రాలు విడుదలయ్యాయి. అందులో విజయాలు తక్కువే కానీ..ప్రేక్షకుడు మాత్రం వినోదాల జల్లులో తడిసి ముద్దయ్యాడు. ఎప్పట్నుంచో ఎదురు చూసిన చిత్రాలు 2022లో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. పాన్ ఇండియా చిత్రాల జోరుతో దేశం మొత్తం తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంది. 'ఆర్ఆర్ఆర్' ప్రపంచ స్థాయిలో చర్చని లేవనెత్తింది. సంఖ్య పరంగా..సాంకేతికత పరంగా 2023 కూడా అందుకు దీటుగానే కనిపిస్తోంది.
అగ్ర తారల చిత్రాలు ఈ ఏడాది కూడా వరుస కట్టనున్నాయి. అందులో అంచనాల్ని రేకెత్తించే కలయికల్లో సినిమాలున్నాయి.. పాన్ ఇండియా ఆకర్షణలూ ఉన్నాయి. మరోవైపు పొరుగు పరిశ్రమల నుంచీ చిత్రాలు పోటెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా భయాలు కూడా తగ్గాయి కాబట్టి..సినిమా నిర్మాణాలు మరింతగా ఊపందుకుని..చిత్రసీమలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రభాస్‌తో 'సలార్' నిర్మిస్తున్న హోంబళే ఫిలింస్ రానున్న ఐదేళ్ల కాలంలో రూ.3వేల కోట్లు పెట్టుబడులు సినిమా రంగంపై పెట్టనున్నట్టు తెలిపింది. అలాంటి ప్రణాళికలతోనే ఉన్నాయి మరిన్ని నిర్మాణ సంస్థలు. 2023 తెలుగు చిత్రసీమకి మరింత కీలకం కానుంది.
ఒకొక్కటి కాదు.. :అగ్ర కథానాయకుల్లో చాలా మంది ఈమధ్య ఏడాదికొక సినిమాతో సరిపెట్టుకుంటున్నారు. 2023లో మాత్రం ఏడాదికి రెండు సినిమాలతో అలరించనున్న కథానాయకుల జాబితా చాలానే కనిపిస్తోంది. అందులో ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ తదితర కథానాయకులు ఉన్నారు. పవన్‌కల్యాణ్ నుంచి కూడా ఈ సంవత్సరం రెండు సినిమాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సంక్రాంతికి 'వీరసింహారెడ్డి'తో సందడి చేయనున్న బాలకృష్ణ, ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాని పట్టాలెక్కించారు. ఆ చిత్రం కూడా ఈ ఏడాదే విడుదల కానుంది. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' తర్వాత 'భోళాశంకర్' సినిమాతో సందడి చేయనున్నారు. ఆ సినిమా కూడా ఇప్పటికే సింహభాగం చిత్రీకరణని పూర్తి చేసుకుంది. మహేష్‌బాబు - త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న సినిమాకి కూడా విడుదల తేదీ ఖరారయ్యింది. 'ధమాకా'తో విజయాన్ని అందుకున్న రవితేజ, ఈ ఏడాది 'వాల్తేరు వీరయ్య'తోపాటు 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రాలతో సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆరంభం నుంచే..
దేశంలో బలమైన చిత్ర పరిశ్రమల్లో తెలుగు సినిమా ఒకటి. 2020లో మినహా గత దశాబ్దకాలంలో ఏటా 200కిపైగానే సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. బాగుందంటే పొరుగు భాషల నుంచి వచ్చే సినిమాల్నీ ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే ఇతర పరిశ్రమలు సైతం తెలుగు ప్రేక్షకాభిరుచిని మెచ్చి ఇక్కడ విడుదల చేస్తుంటాయి. దాంతో ప్రతీ శుక్రవారం మన బాక్సాఫీస్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తుంటుంది.