తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నయా జోష్​.. డబుల్ ఫన్​.. 2023లో క్రేజీ మూవీస్​! - మహేశ్​ బాబు అప్​ కమింగ్​ మూవీ

నిన్నటి వరకు 2022.. నేటి నుంచి 2023. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. కొత్త కలలను నిజం చేసేందుకు ముందుకు వస్తున్నాము. అలా మనకు కొత్త సినిమాల చూపించాలని సిసీ తారలు సైతం రెట్టింపు ఉత్సాహంతో కొత్త సినిమా షెడ్యూల్లతో బిజీ అయిపోయారు. ఓ సారి ఆ అప్డేట్స్ చూసేద్దమా..

upcoming-movies-to-be-relased-in-tollywood
upcoming-movies-to-be-relased-in-tollywood

By

Published : Jan 1, 2023, 6:43 AM IST

రేపటిపై ఆశే ముందుకు నడిపించేది..
సంతోషాల జీవితానికి దారిచూపేది..
గడిచిన వసంతం..ఓ జ్ఞాపకం..
విజయం ఆనందం పంచుండొచ్చు..
పరాజయం బాధ పెట్టుండొచ్చు..
ఇదంతా జీవన గమనంలో సర్వసాధారణం..
కానీ పాత ఏడాది నేర్పే పాఠం..
మాత్రం ఓ అద్భుత దీపం..
ఆ కాంతుల దారుల్లో..
నిన్ను నువ్వు మార్చుకుంటూ..
సరికొత్త ఆనందాల్ని ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ..
రేపటి రోజు ఇంకా బాగుంటుందిలే..
అనుకుంటూ సాగిపోతే 2023 నీదేనోయ్‌...
నీ కళ్లముందే ఉంటుందోయ్‌
సరికొత్త బంగారు లోకం...
తెలుగు చిత్రసీమ మనసులో మాట కూడా ఇదే..
2022లో ఎక్కువ సినిమాలు తీశాం..
ఎందరికో ఉపాధి దక్కింది..
గుర్తుండే ఘనమైన హిట్లు అందుకున్నాం...
ఫ్లాప్‌ల నుంచి పాఠాలు నేర్చేసుకుందాం..
2023లో విజయానందాల్ని రెట్టింపు చేసేద్దాం..
అంటూ ఉరిమే ఉత్సాహంతో.. మన తారలు కొత్త ఏడాదిలో ముందుకు సాగడానికి సిద్ధమవుతున్నారు. నూతన సంవత్సరంలో మరింత బిజీగా గడపబోతున్నారు. క్రేజీ చిత్రాలతో అభిమానులను అలరించడానికి విరామం లేకుండా శ్రమించనున్నారు.

బాలయ్య జోరు
కథానాయకుడు బాలకృష్ణ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమైంది. ఇదే సమయంలో మరోవైపు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న చిత్రాన్నీ పరుగులు పెట్టిస్తున్నారు. ఇటీవలే రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ సినిమా.. తాజాగా తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది.

బాల కృష్ణ

ఈ షెడ్యూల్‌లో భాగంగా హైదరాబాద్‌లో రాజీవన్‌ ఆధ్వర్యంలో వేసిన భారీ జైలు సెట్‌లో బాలయ్యపై ఓ మాసీవ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. ఈ సెట్‌లోనే చిత్ర బృందం నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిత్ర బృందం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. మాస్‌ యాక్షన్‌ కథతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో బాలకృష్ణ సరికొత్తగా కనిపించనున్నారు. శ్రీలీల, శరత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: సి.రామ్‌ప్రసాద్‌, నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్‌ పెద్ది.

అదే జోష్‌తో..
లాస్ట్‌ పంచ్‌ మనదైతే ఆ కిక్కే వేరప్పా.. అనే తన డైలాగ్‌కి తగ్గట్టుగానే ఈ యేడాది ఆఖరి రోజు తన సినిమా 'ఖుషి'తో మరోసారి థియేటర్ల దగ్గర సందడిని సృష్టించారు పవన్‌కల్యాణ్‌. 21 యేళ్ల తర్వాత మరోమారు విడుదలైన ఆ సినిమాతో థియేటర్లు కిక్కిరిసిపోయాయి. ఆ జోష్‌ కొత్త యేడాదిలోనూ కొనసాగించనున్నారాయన. రాజకీయ వ్యవహారాలతో ఎంత బిజీగా గడుపుతున్నప్పటికీ, కొత్త సినిమాల విషయంలోనూ అదే జోరు ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం 'హరి హర వీర మల్లు' చిత్రీకరణలో పాల్గొంటున్న ఆయన, ఈమధ్యే రెండు కొత్త చిత్రాలకి అంగీకారం తెలిపారు.

పవన్​ కల్యాణ్​

హరీష్‌శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' తోపాటు, యువ దర్శకుడు సుజీత్‌ దర్శకత్వంలో రూపొందనున్న మరోచిత్రం. ఇవి కాకుండా ఆయన 'వినోదాయ సిద్ధం' రీమేక్‌లోనూ నటించాల్సి ఉంది. అటు రాజకీయాలతోనూ, ఇటు సినిమాలతోనే ఈ యేడాది ఆయన మరింత బిజీగా గడపనున్నారు. వేడుకలకి చాలా వరకు దూరంగా ఉండే పవన్‌కల్యాణ్‌ ఈ ఏడాది కూడా అంతే!

విరామం లేకుండా..
ప్రభాస్‌ తన స్నేహితులతో కలిసి ఇటీవలే విదేశాలకి పయనమై వెళ్లారు. కొత్త ఏడాది సంబరాలు అక్కడే. తిరిగి రాగానే చిత్రీకరణలతో బిజీ అవ్వనున్నారు. ఇప్పటికే ఖరారైన 'ఆదిపురుష్‌'తోపాటు, 'సలార్‌' కూడా ఈ యేడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమా, 'సలార్‌', 'ప్రాజెక్ట్‌ కె'... ఇలా మూడు చిత్రాల్లోనూ నటిస్తున్నారు. మరికొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఏ రకంగా చూసినా ఈ సంవత్సరం ప్రభాస్‌కి విరామం లేదు.

ప్రభాస్​

ఎన్నెన్నో ఆకర్షణలు
మహేష్‌బాబు ఈ ఏడాది బిజీ బిజీగా గడపనున్నారు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్‌లో గడుపుతున్న ఆయన... రాగానే త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా కోసం రంగంలోకి దిగనున్నారు. అది పూర్తయ్యేలోపే రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా పనులు షురూ అవుతాయి. గ్లోబ్‌ ట్రాటింగ్‌ సినిమాగా రూపొందనున్న ఆ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ ఏడాదిలో వినిపించనున్నాయి. 2022లో మహేష్‌ నటించిన 'సర్కారు వారి పాట'కి మిశ్రమ స్పందన లభించింది. వ్యక్తిగతంగా కూడా ఆయన్ని విషాదాలు వెంటాడాయి. 2023 మాత్రం కెరీర్‌ పరంగా ఆయనకి చాలా కీలకం కానుంది.

మహేశ్​ బాబు

దీటైన ప్రయాణం
కుటుంబంతో కలిసి అమెరికాలో గడుపుతున్నారు ఎన్టీఆర్‌. అక్కడే ఆయన కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత నుంచి విరామంలోనే ఉన్న ఆయన, కొత్త యేడాదిలో కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కోసం రంగంలోకి దిగనున్నారు. ఎన్టీఆర్‌ 30వ చిత్రమిది. ఆ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించనున్న సినిమా షురూ కానుంది. మరికొన్ని ప్రాజెక్టులు ఆయన కోసం సిద్ధమవుతున్నాయి. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’తో ఘన విజయాన్ని అందుకున్న ఆయన అందుకు దీటైన సినిమాలతో ప్రయాణం చేయనున్నట్టు స్పష్టమవుతోంది.

జూనియర్​ ఎన్టీఆర్​

'భారతీయుడు 2' సన్నాహాలు
'భారతీయుడు2'ను చకచకా పూర్తి చేసే పనిలో ఉన్నారు దర్శకుడు శంకర్‌. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జైంట్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. ఇటీవలే చెన్నైలో ఓ కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్‌ ప్రారంభించేందుకు శంకర్‌ సమాయమత్తమవుతున్నారు.

కమల్​హాసన్​

ఈ షెడ్యూల్‌ జనవరి తొలి వారంలో తిరుపతిలో మొదలు కానుందని సమాచారం. ఇందులో భాగంగా కమల్‌తో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలిసింది. మార్చి నెలాఖరు నాటికి చిత్రీకరణ ముగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 'భారతీయుడు'కు సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో కాజల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌, ప్రియా భవానీ శంకర్‌ తదితరులు నటిస్తున్నారు.

జోరు కొనసాగిస్తా..
కొత్త ఏడాదిలో కొత్త సినిమాల విడుదలలతోపాటు..కొత్త సినిమాల ప్రకటనలు కూడా ఉంటాయని చెప్పుకొచ్చింది రష్మిక. 2023 కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చిందామె. తన స్నేహితులతో కలిసి కొత్త యేడాది వేడుకల్లో పాల్గొంటోంది. ఆమె నటించిన 'వారసుడు'తోపాటు, హిందీ చిత్రం 'మిషన్‌ మజ్ను' జనవరిలో వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 'పుష్ప2' చిత్రీకరణలోనూ పాల్గొంటానని, అది ఈ యేడాదే విడుదలవుతుందని చెప్పుకొచ్చింది రష్మిక.

రష్మిక మందన్న

వీటితోపాటు.. కొత్త సినిమాలకి సంబంధించిన విశేషాల్నీ చెబుతానంటూ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. స్నేహితులతో కలిసి కొత్త ఏడాది సంబరాలు చేసుకుంటున్నానని, ఎక్కడనేది మాత్రం రహస్యం అంటూ సెలవిచ్చింది రష్మిక. దక్షిణాదితోపాటు హిందీలోనూ అవకాశాల్ని అందుకుంటున్న రష్మిక 2023లో తన జోరు కొనసాగించనుంది.

రెట్టించిన ఉత్సాహంతో..
మహేష్‌బాబుతో కలిసి నటించనున్న కొత్త సినిమాతో 2023ని ఆరంభించబోతోంది పూజాహెగ్డే. ఈ ఏడాది కొత్త ప్రాజెక్టుల విషయంలోనూ ఆమె పేరు గట్టిగా వినిపించే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా తెలుగు సినిమాపై తనదైన ప్రభావం చూపిస్తున్న కథానాయిక ఈమె. కొత్త ఉడాది, కొత్త లక్ష్యాల గురించి ఆమెకి కొన్ని నిర్దుష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. "బోలెడన్ని పనుల్ని చక్కబెట్టాలని నిర్ణయించుకుంటాం. తీరా అవి నెరవేరకపోతే నిరుత్సాహానికి గురవుతాం.

పూజా హెగ్డే

అలా కాకుండా ఒకొక్క లక్ష్యాన్నే నిర్దేశించుకోవడం మేలు కదా. అప్పుడు దృష్టంతా దానిపైనే ఉంటుంది. అలా ఒకొక్క ఏడాది ఒక్కో కొత్త అడుగు వేయాలనేది నా ఆలోచన. ఉత్సాహమే ఊపిరిగా ముందుకెళ్లాలనుకుంటున్నా. ప్రతి ఏడాదీ ఓ కొత్త దేశాన్ని చుట్టిరావాలనుకున్నా. అది ఆచరణలో పెడుతున్నా. చిన్న చిన్న లక్ష్యాల్నే నిర్దేశించుకుంటూ, వాటిని నెరవేర్చుకుంటూ రెట్టించిన ఉత్సాహంతో ప్రయాణం చేస్తున్నా" అని చెప్పింది పూజ.

ABOUT THE AUTHOR

...view details