Upcoming Movies 2023 This Week :మరికొద్ది రోజుల్లో 2023 పూర్తికానుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. అయితే ఈఏడాది చివరి నెలలో సినిమాలు వరుసగా సందడి చేస్తున్నాయి. క్రిస్మస్ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అలాగే ఓటీటీలో పలు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి.
స్నేహితులు శత్రువులుగా!
ఎప్పుడెప్పుడా అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రాల్లో ప్రభాస్ సలార్ ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ చిత్రం తొలి భాగం సలార్: పార్ట్-1 సీజ్ ఫైర్ డిసెంబరు 22న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. కేజీయఫ్‌తో భారతీయ సినీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ నీల్ ఈసారి ప్రభాస్ కటౌట్‌కు సరిపోయే కథతో వస్తున్నారు. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్ సలార్‌ను నిర్మించింది.
భావోద్వేగాల ప్రయాణం డంకీ!
సామాజిక అంశాలే ఇతివృత్తంగా మనసుకు హత్తుకునేలా చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి. ఆయన దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం డంకీ. ఇందులో షారుక్‌కు జోడీగా తాప్సీ నటిస్తోంది. క్రిస్మస్ కానుకగా 2023 డిసెంబరు 21న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది షారుక్ ఖాన్ పఠాన్, జవాన్ చిత్రాలతో బాక్సాఫీస్ ఘన విజయాలను నమోదు చేశారు. డంకీతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.