తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

చూసేందుకు 'భయమే' కానీ వినోదమే.. టాలీవుడ్​లో కొత్త హంగులతో హారర్​​ చిత్రాలు! - హార్రర్​ మూవీస్​ తెలుగులో

సాధారణంగా కొన్ని చిత్రాలకు కేవలం తనివితీరా భయపడేందుకే వెళ్తారు. మనిషిలో అంతర్లీనంగా ఉండే భయాన్ని సంతృప్తి పరచేందుకే ఇదంతా. అయితే ఇప్పుడు తెరపై అంతగా కనిపించడం లేదు కానీ, ఓ ఆరేడేళ్లు వెనక్కి వెళ్తే హారర్‌ చిత్రాల జోరు తెలుగు నాట బాగా కనిపించింది. దీంతో ఓ దశలో ఆ జానర్‌పై ప్రేక్షకుల ఆసక్తి తగ్గింది. అయితే ఇప్పుడిలాంటి భయపెట్టే కథలు కొత్తదనం అద్దుకొని మిస్టీక్‌ థ్రిల్లర్స్‌, సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్స్‌ రూపాల్లో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. మరి ఆ చిత్రాలేంటి?

upcoming horror movies in industry
upcoming horror movies in industry

By

Published : Nov 26, 2022, 6:47 AM IST

Updated : Nov 26, 2022, 7:17 AM IST

Tollywood Horror Movies: విభిన్న భావోద్వేగాల సమాహారం సినిమా. కాసేపు హాయిగా నవ్వుకోవాలని కొందరు.. థ్రిల్‌ను ఆస్వాదించాలని మరికొందరు.. మదిని బరువెక్కించే భావోద్వేగభరిత కథల్లో మునిగితేలాలని ఇంకొందరు.. ఓ సినిమా చూసేందుకు ఎవరి కారణాలు వాళ్లవి. అయితే కొన్ని చిత్రాలకు కేవలం తనివితీరా భయపడేందుకే వెళ్తారు. మనిషిలో అంతర్లీనంగా ఉండే భయాన్ని సంతృప్తి పరచేందుకే ఇదంతా.

ఇప్పుడు తెరపై అంతగా కనిపించడం లేదు కానీ, ఓ ఆరేడేళ్లు వెనక్కి వెళ్తే హారర్‌ చిత్రాల జోరు తెలుగు నాట బాగా కనిపించింది. 'కాంచన', 'వైషాలి', 'ప్రేమకథా చిత్రమ్‌', 'గీతాంజలి' చిత్ర విజయాల స్ఫూర్తితో అప్పట్లో లెక్కకు మిక్కిలిగా రకరకాల హారర్‌ సినిమాలు వెండితెరపైకి వరుస కట్టాయి. దీంతో ఓ దశలో ఆ జానర్‌పై ప్రేక్షకుల ఆసక్తి తగ్గింది. అయితే ఇప్పుడిలాంటి భయపెట్టే కథలు కొత్తదనం అద్దుకొని మిస్టీక్‌ థ్రిల్లర్స్‌, సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్స్‌ రూపాల్లో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.

హారర్​కు సిద్ధమంటున్న కథనాయకులు..
ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు కథానాయకుడు ప్రభాస్‌. ఇప్పటికే 'ఆదిపురుష్‌' చిత్రాన్ని పూర్తి చేసిన ఆయన.. ఇప్పుడు 'సలార్‌', 'ప్రాజెక్ట్‌ కె' చిత్రాలతో సెట్స్‌పై తీరిక లేకుండా గడుపుతున్నారు. వీటితో పాటు ఆయన మారుతి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. హారర్‌ అంశాలతో నిండిన ఓ వినూత్నమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ సినిమా కోసం లుక్‌ టెస్ట్‌ కూడా పూర్తయింది. ఇందులో ముగ్గురు కథానాయికలకు అవకాశముంది. వీటిలో రెండు పాత్రల కోసం నిధి అగర్వాల్‌, మాళవికా మోహనన్‌ పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇటు ప్రేమకథలతోనూ.. అటు యాక్షన్‌ కథలతోనూ ప్రేక్షకుల్ని మెప్పించిన కథానాయకుడు సాయి తేజ్‌. ఇప్పుడాయన భయపెడుతూ.. వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం ఆయన నటిస్తున్న 15వ చిత్రం సెట్స్‌పై ముస్తాబవుతోంది. దీన్ని కార్తిక్‌ దండు తెరకెక్కిస్తున్నారు. సుకుమార్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో నిండిన థ్రిల్లర్‌ చిత్రమిది. ఇందులో ప్రేక్షకుల్ని భయపెట్టి.. ఉత్కంఠతకు గురిచేసే అంశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

వైవిధ్యభరితమైన కథలకు చిరునామాగా నిలిచే హీరో సందీప్‌ కిషన్‌.'నిను వీడని నీడను నేనే' అంటూ గతంలో ఓ హారర్‌ కథతో ప్రేక్షకుల్ని మెప్పించిన ఆయన.. ఇప్పుడు 'ఊరు పేరు భైరవకోన'తో మరోసారి భయపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. వి.ఐ ఆనంద్‌ తెరకెక్కిస్తున్న సూపర్‌ నేచురల్‌ ఫాంటసీ థ్రిల్లర్‌ ఇది. గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యముంది. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ కథానాయికలు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాయికలూ సై..
అందచందాలతో అలరించే కథానాయికలూ.. ఇప్పుడు ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది నటి కాజల్‌. వాటిలో 'ఘోస్టీ' ఒకటి కాగా.. మరొకటి 'కరుంగాప్పియమ్‌'. ఈ రెండూ హారర్‌ నేపథ్యంలో సాగే చిత్రాలే. వినోదం నిండిన ఓ ఆసక్తికర హారర్‌ కథాంశంతో కల్యాణ్‌ తెరకెక్కించిన చిత్రం 'ఘోస్టీ'. ఇందులో పోలీస్‌గా సందడి చేయనుంది కాజల్‌.

ఇక దర్శకుడు డీకే తెరకెక్కించిన మరో తమిళ చిత్రం 'కరుంగాప్పియమ్‌'. ఇందులో కాజల్‌ అగర్వాల్‌తో పాటు రెజీనా, జనని, నోయిరికా, రజియా విల్సన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలో కొన్ని అతీంద్రియ శక్తులున్న యువతిగా కాజల్‌ కనువిందు చేయనున్నట్లు తెలిసింది. రజనీకాంత్‌ - పి.వాసుల కలయికలో రూపొందిన కామెడీ హారర్‌ చిత్రం 'చంద్రముఖి'.

ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా రాఘవ లారెన్స్‌ ప్రధాన పాత్రలో 'చంద్రముఖి2' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నాయికగా కాజల్‌ పేరునే పరిశీలిస్తున్నట్లు సమాచారం. 'మాయ', 'ఐరా', 'డోరా' వంటి హారర్‌ కథా చిత్రాలతో ప్రేక్షకుల్ని భయపెట్టిన అందాల నాయిక నయనతార. ఇప్పుడు ‘కనెక్ట్‌’తో మరోసారి అదే రీతిలో భయపెడుతూ.. థ్రిల్‌ పంచేందుకు సిద్ధమవుతోంది. అశ్విన్‌ శరవణన్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ హారర్‌ కథా చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Last Updated : Nov 26, 2022, 7:17 AM IST

ABOUT THE AUTHOR

...view details