Allari Naresh ugram movie review : 'నాంది'.. అల్లరి నరేశ్సినీ కెరీర్‌కు ఓ మలుపు తిప్పిన సినిమా. నటుడిగా నరేశ్‌కు కొత్త ఆరంభాన్నిచ్చింది. అప్పటి వరకు అల్లరి పాత్రలతో నవ్వులు పంచుతూ వచ్చిన ఆయన.. నాంది తర్వాత ఒక్కసారిగా ట్రాక్ మార్చుకున్నారు. సీరియస్ కథలతో ప్రయాణించడం మొదలు పెట్టారు. తనకు 'నాంది' లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడలతో కలిసి మరోసారి 'ఉగ్రం' అంటూ మరో సీరియస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇందులో ఆయన పోలీస్‌గా సరికొత్త యాక్షన్ అవతారంలో కనిపిస్తుండటం.. ప్రచార చిత్రాల్లో ఆద్యంతం ఆసక్తిరేకెత్తించేలా ఉండటం వల్ల ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచింది? నరేశ్- విజయ్ కాంబినేషన్ మరోసార హిట్టైందా? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
స్టోరీ ఇదే..
Ugram Movie 2023 Story : సీఐ శివకుమార్ (అల్లరి నరేశ్) ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి. అపర్ణ (మిర్నా మేనన్)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె తండ్రి నరసింహారెడ్డి పటేల్ (శరత్ లోహితస్వా)ను ఎదిరించి పెళ్లి చేసుకుంటాడు. 5 సంవత్సరాల పాటు వారి దాంపత్య జీవితం సాఫీగా సాగితుంది. ఈ క్రమంలోనే వారి ప్రేమకు గుర్తుగా ఓ పాప (ఊహా రెడ్డి) కూడా పుడుతుంది. కానీ, ఓ కారు ప్రమాదం శివకుమార్ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. ఆ ప్రమాదంలో శివ తలకు తీవ్ర గాయమవడం కారణంగా జ్ఞాపకశక్తిని కోల్పోతాడు.
మరోవైపు, ఆ ప్రమాదంలోనే శివ భార్య, పాప కనిపించకుండా పోతారు. కాగా, వాళ్లను వెతికి పట్టుకునేందుకు శివ చేసిన ప్రయాణం ఎలా సాగింది? ఈ క్రమంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? తన భార్య, బిడ్డతో పాటు నగరంలో కనిపించకుండా పోయిన అనేక మంది ఆచూకీని శివకుమార్ఎలా కనుగొన్నాడు? అసలు వాళ్లందరినీ కిడ్నాప్ చేసింది ఎవరు? అన్న అంశాలపై మిగతా కథంతా సాగుతుంది.
సినిమా ఎలా సాగిందంటే..
Ugram Movie 2023 review : మిస్సింగ్ కేసుల చుట్టూ నడిచే ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ ఈ సినిమా. ఆ మిస్సింగ్ కేసుల వెనుక ఓ పెద్ద నెట్‌వర్క్ ఉంటుంది. దాన్ని కథానాయకుడు ఎలా ఛేదించాడు? కనిపించకుండా పోయిన తన భార్య, బిడ్డతో పాటు మిగిలిన వాళ్లందరినీ ఎలా కాపాడాడన్నది ఈ సినిమా కథాంశం. శివకుమార్ కారు ప్రమాదానికి గురయ్యే సన్నివేశంతో సినిమాని ప్రారంభించిన తీరు ఆసక్తిరేకెత్తిస్తుంది. అతడి తలకు తీవ్ర గాయమవ్వడం వల్ల జ్ఞాపకశక్తిని కోల్పోవడం.. కనిపించకుండా పోయిన భార్య, కూతుర్ని ఆస్పత్రిలో చేర్పించాననుకోని గందరగోళానికి గురవ్వడం.. ఇలా తొలి పది నిమిషాలు సినిమా థ్రిల్లింగ్‌గా సాగుతుంది. ఆ తర్వాత దర్శకుడు ఎప్పుడైతే శివ గతాన్ని పరిచయం చేస్తాడో.. అక్కడి నుంచి స్టోరీ గాడి తప్పుతుంది.
నిజానికి ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్లలో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లా లవ్ ట్రాక్‌లు, పాటలు ఇరికించకూడదు. అవి కథకు స్పీడ్ బ్రేకర్లలా అడ్డు తగులుతుంటాయి. కానీ, ఇందులో శివ, అపర్ణల మధ్య సాగే లవ్ స్టోరీ కూడా అలాగే స్పీడ్ బ్రేకర్‌లా అడ్డు తగిలినట్లు అనిపిస్తుంది. మధ్యలో హాస్టల్ అమ్మాయిల్ని కాపాడేందుకు శివ ఒక గంజాయి బ్యాచ్‌ను చితక్కొట్టి జైలులో వేసే ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఆ ఎపిసోడే కథను మలుపు తిప్పుతుంది. శివపై పగతో ఆ రౌడీ మూక అతని ఇంటికెళ్లి అపర్ణతో అసభ్యంగా ప్రవర్తించడం.. వాళ్లను శివ వెంటాడి ఎన్‌కౌంటర్ చేయడం హైలైట్‌గా నిలుస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ సెంకండ్ హాఫ్‌పై ఆసక్తిరేకెత్తించేలా ఉంటుంది.
ఫస్ట్ హాఫ్ మొత్తం శివకుమార్ కుటుంబం చుట్టూ కథ సాగితుంది. ద్వితీయార్ధంలో అతని భార్య, కుమార్తె ఎలా కనిపించకుండా పోయారు? ఆ సమస్యను అతడెలా ఛేదించాడు? అన్న కోణంలో సినిమా ముందుకెళ్తుంది. నిజానికి ఇలాంటి కథల్లో మిస్సింగ్‌లు జరుగుతున్న తీరు.. దాని వెనుక ఉండే నెట్‌వర్క్, దాన్ని హీరో ఛేదించే విధానం ఎంత ఆసక్తికరంగా ఉంటే.. సినీ అభిమానులు ఆ కథతో అంత బాగా కనెక్ట్ అవుతారు. కానీ, ఈ సినిమాలో వీటి చుట్టూ అల్లుకున్న సన్నివేశాలేవీ ఆసక్తిరేకెత్తించవు.