RRR: 'శుభకృత్' అంటే మేలు చేయునది... అని అర్థం. రెండేళ్ల నుంచి ఎన్నో సమస్యలు, ఆటుపోట్లు, కష్టనష్టాలు ఎదుర్కొన్న పరిశ్రమ 'ఆర్‌ఆర్‌ఆర్' ఇచ్చిన కొత్త జోరుతో కొత్త తెలుగు సంవత్సరాదిలోకి అడుగు పెడుతోంది. ఈ చిత్రం పొందిన ఆదరణ, ఆదాయం రెండూ.. పరిశ్రమకు మేలు చేస్తాయని పలువురు భావిస్తున్నారు. ''అబ్బో వాళ్లవి ఊర మాస్ కథలు.. బడ్జెట్‌లు మరీ తక్కువ.. సాంకేతిక హంగులు పెద్దగా కనిపించవు.. అదెక్కడి మెలోడ్రామా..'' - ఐదేళ్ల క్రితం వరకు టాలీవుడ్ సినిమాల మాటెత్తితే ఉత్తరాది సినీప్రియుల నుంచి ఇలాంటి మాటలే ఎక్కువ వినిపించేవి. ఇప్పుడా చరిత్ర తిరగబడింది. 'బాహుబలి', 'కేజీఎఫ్', చిత్రాలతో భారతీయ చలన చిత్ర చరిత్రలో ఓ కొత్త శకం ఆరంభమైంది. సాంకేతిక హంగుల మాటెత్తినా.. కొత్తదనం నిండిన కథల ఊసెత్తినా.. 'బాహుబలి', 'పుష్ప', 'ఆర్‌ఆర్‌ఆర్' లాంటి చిత్రాలనే తొలుత ప్రస్తావిస్తున్నారు. ఖాన్ త్రయం సినిమాల ముచ్చట్లు తగ్గిపోయాయి. ప్రభాస్, యశ్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్.. ఇలా దక్షిణాది హీరోల చిత్రాల ఆరాలు ఎక్కువయ్యాయి. అందుకే ఇప్పుడు తెలుగు చిత్రసీమ, దక్షిణాది సినిమాలు భారతీయ సినీ పరిశ్రమకు పర్యాయపదంలా మారిపోయాయి.
మ్యాజిక్ రిపీట్ చేసిన జక్కన్న: 'బాహుబలి' చిత్రాలతో తెలుగు చిత్రసీమ ఖ్యాతిని అమాంతం ఆకాశమంత స్థాయికి తీసుకెళ్లారు దర్శకుడు రాజమౌళి. దాదాపు రూ.1800కోట్ల వసూళ్లు సాధించి తెలుగు సినిమా సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ఇప్పుడు 'ఆర్‌ఆర్‌ఆర్'తో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తున్నారు జక్కన్న. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలి వారంలో రూ.710కోట్ల వసూళ్లు సాధించి సత్తా చాటిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడీ వసూళ్లు బాలీవుడ్ విశ్లేషకుల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. కొవిడ్ ఉద్ధృతి తర్వాత భారత దేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రమిదేనని బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇది టాలీవుడ్ సత్తాని మరోసారి బాలీవుడ్‌కు రుచి చూపించింది. నిజానికి నాలుగు నెలల కాలంలో బాలీవుడ్ నుంచి 'సూర్యవంశీ', '83', 'గంగూబాయి కాఠియావాడి', 'బచ్చన్ పాండే' వంటి పెద్ద చిత్రాలొచ్చినా.. ఏవీ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. ఇటీవల విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' ఒక్కటే మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇదే సమయంలో తెలుగు నుంచి వచ్చిన 'పుష్ప: ది రైజ్', 'రాధేశ్యామ్' వంటి చిత్రాలకు ఉత్తరాదిలోనూ మంచి వసూళ్లు దక్కడం విశేషం. ఇప్పుడా జైత్రయాత్రను 'ఆర్‌ఆర్‌ఆర్' కొనసాగిస్తోంది. ఇప్పటికే అక్కడ తొలివారం రూ.132.59 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా.. లాంగ్ రన్‌లో ఇంకెన్ని కోట్లు కొల్లగొడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హిందీలో 'అటాక్' మినహా 'ఆర్‌ఆర్‌ఆర్'కు పోటీగా మరే చిత్రమూ లేదు. ఈనెల 13న 'బీస్ట్', 14న 'కేజీఎఫ్2' పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అప్పటి వరకు 'ఆర్‌ఆర్‌ఆర్' జోరు కొనసాగే అవకాశముందని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.