తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆస్కార్ గెలిచిన 'ఏనుగులు' మిస్సింగ్​.. తాగుబోతులను తరుముకుంటూ అడవిలోకి వెళ్లి!

ఆస్కార్ అవార్డు గెలిచిన డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్​ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'​లో నటించిన రెండు ఏనుగులు అదృశ్యమయ్యాయి. కొంతమంది తాగుబోతులను ఆ రెండు ఏనుగులు అడవిలోకి తరుముకుని పోయినట్లు వాటి సంరక్షకుడు బొమ్మన్ వెల్లడించారు.

two elephants-featured-in-the-elephant-whisperers-documentary-were-missing
two elephants-featured-in-the-elephant-whisperers-documentary-were-missing

By

Published : Mar 13, 2023, 5:07 PM IST

95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్​ పురస్కారం అందుకుంది తమిళ డాక్యుమెంటరీ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'. అందుకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్న వేళ.. ఆ డాక్యుమెంటరీలో నటించిన ఏనుగులు అదృశ్యమయ్యాయనే వార్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' డాక్యుమెంటరీలో రఘు, అమ్ము అనే రెండు ఏనుగులు అదృశ్యమయ్యాయి. ఈ విషయాన్ని ఆ ఏనుగుల సంరక్షకుడు బొమ్మన్.. అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. కొంతమంది వ్యక్తులను తరుముతూ ఆదివారం ఈ రెండు ఏనుగులు కృష్ణగిరి అరణ్యంలోకి వెళ్లిపోయాయని చెప్పారు. ఆ ఏనుగుల కోసం సంరక్షకుడు ప్రస్తుతం వెతుకడం మొదలుపెట్టారు.

"మద్యం మత్తులో ఉన్న కొంత మంది వ్యక్తులను తరుముకుంటూ ఏనుగులు అడవిలోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం నేను కృష్ణగిరి ఫారెస్ట్‌లో ఏనుగుల కోసం గాలిస్తున్నాను. అవి రెండూ కలిసే ఉన్నాయా.. విడిపోయి తిరుగుతున్నాయా అనే విషయంలో నాకు ఎలాంటి స్పష్టత లేదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వాటి ఆచూకీ కనుక్కోవడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ అవి నాకు కనిపించకపోతే ఫారెస్ట్ రేంజర్‌కు ఫిర్యాదు చేసి నేను నా సొంతూరికి వెళ్లిపోతాను" అని బొమ్మన్ వెల్లడించారు.

ఏనుగులతో బొమ్మన్​ దంపతులు

అనాథలైన రెండు ఏనుగు పిల్లల సంరక్షణకు అంకితమైన బొమ్మన్, బెల్లీ దంపతుల ప్రయాణమే ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ. కార్తికీ గొన్సాల్వేస్ దర్శకత్వం వహించారు. ఆ దంపతులకు ఏనుగులకు మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని డాక్యుమెంటరీలో అద్భుతంగా చూపించారు. అలాగే, ఈ దంపతులు చేసిన పనులు కాలక్రమేణా ప్రకృతికి ఎలా దోహదపడ్డాయో వర్ణించారు. ఇక ఈ డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడంతో బొమ్మన్ ఎంతో ఆనందపడుతున్నారు. గర్వంగా ఉందని చెబుతున్నారు. తన గురించి అంతర్జాతీయ స్థాయిలో అందరికీ తెలిసేలా చేసిన దర్శకురాలు కార్తికీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

"అసలు సినిమా ఎలా ఉంటుందో, దాన్ని ఎలా తీస్తారో నాకు తెలీదు. డాక్యుమెంటరీ తీయాలని వాళ్లు వచ్చారు. ఏనుగులతో మేం ప్రతిరోజూ ఏం చేస్తాం, ఎలా జీవిస్తాం వంటి దృశ్యాలను రోజువారీ చిత్రీకరించారు. కెమెరా ముందు నిలబడటం, కెమెరాను చూస్తూ మాట్లాడటం నాకు చాలా వింతగా అనిపించింది. ఎందుకంటే నేను కెమెరా ముందుకు రావడం ఇదే తొలిసారి. కార్తికీ మేడమ్‌కు, నా ఏనుగులకు కృతజ్ఞతలు. ఈ అవార్డు దేశం మొత్తాన్ని, మా అటవీశాఖ గర్వపడేలా చేసిందంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం, నేను ఒక పెద్ద ఏనుగును సంరక్షిస్తున్నాను. దాని పేరు కృష్ణ. ఏనుగుల సంరక్షణ బాధ్యతల నుంచి బెల్లీని ఏడాది క్రితం తొలగించారు. ఆమెకు ఇటీవలే వేరే ఉద్యోగం ఇచ్చారు" అని బొమ్మన్ చెప్పుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details