మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ నిర్మించిన చిత్రం నువ్వేనువ్వే. తరుణ్, శ్రియా జంటగా ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. సెంటిమెంటల్గానూ, కామెడీ పరంగానూ ప్రేక్షకుల మెప్పును పొందడమే కాకుండా.. అవార్డులు సైతం సొంతం చేసుకున్న చిత్రంగా 'నువ్వే నువ్వే' నిలిచింది. తరుణ్, శ్రియ నటన, ప్రకాష్ రాజ్ తండ్రి సెంటిమెంట్‌తో పాటు సునీల్ స్పాంటేనియస్ డైలాగ్స్ ఈ సినిమాకు హైలైట్స్‌గా నిలిచాయి.
అయితే సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ ఏఎంబీ మాల్ లో నువ్వే నువ్వే ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ తోపాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరై సందడి చేశారు. నువ్వే నువ్వే చిత్రీకరణ అనుభవాలను, ఆ సినిమా పంచిన అనుభూతులను గుర్తుచేసుకున్నారు. నువ్వే నువ్వే చిత్రాన్ని సిరివెన్నెలకు నివాళిగా అంకితమిస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. అయితే అందురూ మెచ్చిన ఈ సినిమాలో సునీల్ కామెడీ డైలాగ్స్‌తో అందరిని నవ్విస్తే.. ప్రకాష్ రాజ్ నాన్న పాత్రలో చెప్పే డైలాగ్స్ ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించాయి.. ఇలా త్రివిక్రమ్ పెన్ నుంచి జాలువారిన ఒక్కో డైలాగ్స్ ఇప్పటికి అందరి నోళ్లలో నానుతూనే ఉన్నాయి.