Trivikram Old Video Viral : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్రవేసిన ఆయన.. తన చిత్రాలతో అటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను.. ఇటు మాస్ ప్రేక్షకులను బాగా మెప్పించగలరు. అలాగే ఆయన ఆత్మీయమైన మాటలు చాలా మందిని ఆలోచింపజేసేలా చేస్తాయి. ఆయన స్టేజ్ ఎక్కి మాట్లాడే బలమైన, బరువైన మాటల కూడా నెట్టింట్లో ఎప్పుడూ ట్రెండింగ్ అవుతునే ఉంటాయి.
అయితే తాజాగా ఆయన ఆయనకు సంబంధించిన చాలా ఏళ్ల క్రితం నాటి ఓ పాత వీడియో నెట్టింట్లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం అది తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో మాటల మాంత్రికుడు ఓ సూపర్ హిట్ సినిమా స్క్రీన్ ప్లేను కొంతమందికి క్షుణ్ణంగా వివరిస్తూ కనిపించారు. అది సూపర్ హిట్ బాలీవుడ్ మూవీ.. ఆమిర్ ఖాన్ నటించిన 'రంగ్ దే బసంతి'. ఈ మూవీ స్క్రీన్ ప్లే గురించే మాటల మాంత్రికుడు తనదైన స్టైల్లో వివరిస్తూ ఉన్నారు.
ఓ గదిలో చాలా మంది కూర్చొని ఉండగా.. వారందరికీ బోర్డుపై మూవీ స్క్రీన్ ప్లేను రాసి... సినిమాలో ఏ సన్నివేశం ఎందుకు పెట్టారు? ఏ డైలాగ్ ఎందుకు వాడారు? కథను ఎలా ముందుకు నడిపించారు? వంటి విషయాలను క్లారిటీగా చెబుతూ కనిపించారు. దాదాపు 9 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లు, సినీ ప్రియుల దృష్టిని బాగా ఆకర్తిస్తోంది. పైగా ఈ వీడియోలో త్రివిక్రమ్ చాలా సింపుల్‌గా ఉన్నారు. తెల్ల చొక్కా ధరించి కాస్త లైట్ గడ్డంతో కనిపించారు.