Vijay 67 heroine : 'విక్రమ్' వంటి విజయవంతమైన చిత్రమిచ్చి హుషారుగా ఉన్న లోకేష్ కనకరాజ్ తన తర్వాతి ప్రాజెక్టు కోసం సన్నద్ధమవుతున్నాడు. 'విజయ్ 67'గా అభిమానులు పిలుచుకొనే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తిచేస్తున్న లోకేష్ నటీనటుల ఎంపికపైనా దృష్టి పెట్టాడు. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, సమంత, అర్జున్ సర్జా, పృధ్వీరాజ్ సుకుమారన్ తదితరులను సంప్రదించి సినిమాలో కీలక పాత్రల గురించి వివరించినట్లు తెలిసింది. ఇందులో విజయ్‌కు కథానాయికగా త్రిషను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విజయ్-త్రిషది విజయవంతమైన జోడీ. పద్నాలుగేళ్ల తర్వాత తమ అభిమాన తారలు కలిసి నటిస్తున్నారని వార్తలు రాగానే అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా ఉన్నాయి. అక్టోబరులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని చిత్రబృందం యోచిస్తోంది.
వీళ్లందర్నీ మిస్ అవుతా!
Maria actress Prince movie : తమిళ కథానాయకుడు శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం 'ప్రిన్స్'. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న దీన్ని తెలుగు దర్శకుడు అనుదీప్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ఉక్రెయన్ నటి మరియా కథానాయిక. ఇప్పుడు ఈమె పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తైంది. ఈ సందర్భంగా ఈ ఉక్రెయిన్ ముద్దుగుమ్మ మాట్లాడుతూ "ఈ ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. మంచి సృజనాత్మక బృందంతో కలిసి పనిచేయడం మరిచిపోలేని అనుభూతి. అందరూ నాతో స్నేహితుల్లా కలిసిపోయారు. ఇప్పుడు వీళ్లందర్నీ మిస్ అవుతాను. సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా" అని చెప్పుకొచ్చింది.
జాతిరత్నాలు తర్వాత అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు పెరిగాయి. ఈ దీపావళికి విడుదల చేయడానికి చిత్రబృందం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.