Tovino Thomas 2018 Movie :2018లో కేరళను అతలాకుతలం చేసిన వరదల నేపథ్యంలో దర్శకుడు జూడ్ ఆంటోనీ జోసఫ్ '2018' సినిమాను తెరకెక్కించారు. తొలుత మలయాళంలో విడుదలైన ఈ సినిమా ఆ తర్వాత తెలుగులోనూ వచ్చి సంచలనాలు సృష్టించింది. తాజాగా ఈ సినిమా.. ప్రతిష్టాత్మక ఆస్కార్ 2024 బరిలోకి భారత్ నుంచి అధికారికంగా ఎంపికైంది. అక్కడ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ఈ చిత్రం పోటీ పడనుంది. ఈ నేపథ్యంలో మూవీ హీరో టొవినో థామస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి కొన్ని ఆసక్తిక విషయాలు చెప్పుకొచ్చారు. ఆ విశేషాలు మీ కోసం..
ప్రశ్న:'ది కేరళ స్టోరీ'ని కాకుండా '2018' సినిమాను ఎంపిక చేశారన్న అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతోంది. దీని గురించి మీరేం అంటారు?
టొవినో: ఈ విషయంలో నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. '2018' సినిమా భారత్ నుంచి 'ఆస్కార్'కు అధికారిక ఎంపికైంది కాబట్టి దీని గురించి ఎవరికీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. '2018' ఎంట్రీ దక్కించుకుందంటేనే అది మంచి సినిమా అని అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాని ఆస్కార్‌కు పంపాలనే కమిటీ నిర్ణయమే ప్రశ్నలన్నింటికీ సమాధానం.
ప్రశ్న: కేరళ రాష్ట్రం గురించి తప్పుగా చూపించేందుకే 'ది కేరళ స్టోరీ' సినిమాను రూపొందించారంటూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మీరు కూడా అదే అనుకున్నారా?
టొవినో:నేను సమాధానం చెప్పగలను. కానీ.. ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు.
ప్రశ్న:జాతీయ స్థాయిలో మలయాళ చిత్ర పరిశ్రమ సంచనాలు సృష్టిస్తోంది. ఈ ఇండస్ట్రీలో భాగమైనందుకు మీరు ఎలా ఫీలవుతున్నారు?
టొవినో : ఎక్కువ మందికి దగ్గరయ్యే అవకాశాన్ని '2018' చిత్రం నాకు ఇచ్చింది. 'మిన్నల్ మురళి', 'తళ్లుమాల' లాంటి నా గత చిత్రాలను చూసిన వారంతా కూడా కచ్చితంగా '2018'ని చూశారని అన కుంటున్నాను. భవిష్యత్తులో మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు నా సినిమాలు రీచ్ అయ్యేలా చూస్తాను. వారి ప్రేమాభిమానాల కోసం కష్టపడి పనిచేస్తాను.
ప్రశ్న: మీరు ఎంచుకున్న పాత్రల కోసం ఎలా సన్నద్ధమవుతారు?
టొవినో: వ్యక్తిగతంగా నేను చాలా బద్ధకస్తుణ్ని. ఇంట్లో ఏ చిన్న పని కూడా చేయను. అయితే సినిమాల విషయంలో మాత్రం ఎంతైనా కష్టపడతాను. కానీ కొన్ని సినిమాలకు మాత్రమే శారీరకంగా బాగా శ్రమించాల్సి ఉంటుంది. కొన్ని చిత్రాల్లోని రోల్స్ కోసం మానసికంగా దృఢంగా ఉండాలి. 'మిన్నల్ మురళి', '2018' విషయానికొస్తే.. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలని పనిచేశా. నిర్విరామంగా చిత్రీకరణలో పాల్గొన్నప్పుడు బాగా అలసిపోతా. కానీ, ఆయా సినిమాల దర్శకులు, సాంకేతిక నిపుణుల కష్టాన్ని చూసి స్ఫూర్తి పొందుతా. ఓ లక్ష్యం కోసం సమృష్టిగా పనిచేస్తున్నప్పుడు విశ్రాంతి తీసుకోకూడదనుకుంటా. నేను మంచి టీమ్ ప్లేయర్ అనేది నా అభిప్రాయం.
2018 Movie Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. టొవినో థామస్, కుంచకో బొబన్ లాంటి మలయాళ స్టార్స్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన సినిమా '2018'. దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఈ సినిమాను.. ఆద్యంతం భావోద్వేగ భరితంగా తీర్చిదిద్దారు. ఇక ఈ సినిమా మలయాళంతో పాటు, ఇతర భాషల్లోనూ రిలీజై పాజిటివ్ టాక్ అందుకుంది. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డుకెక్కింది. అయితే ఈ సినిమా విడుదలైన మే 5నే 'ది కేరళ స్టోరీ' కూడా థియేటర్లలో విడుదలైంది. ఇలా కేరళ రాష్ట్రంతో ముడిపడి ఉన్న రెండు సినిమాలు ఒకే రోజు ఆడియెన్స్ ముందుకు రావడం గమనార్హం.
Oscar Race 2024 Indian Movie : ఆస్కార్ బరిలో '2018'.. అవార్డు గెలవనుందా?
2018 Official Oscar Entry : 'కలలో కూడా ఊహించలేదు.. కానీ'.. ఆస్కార్‌కు అధికారిక ఎంట్రీపై '2018' దర్శకుడు