బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'పఠాన్'. . భారీ యాక్షన్ హంగామాతో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. విషయాన్ని చెప్పారు. ఈ మూవీలో ప్రేక్షకులకు ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుందని చెప్పారు. హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్‌కు ఈ చిత్రానికి ఓ కనెక్షన్ ఉందని వెల్లడించారు.
"షారుక్ ఖాన్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌తో ఓ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ తీయాలంటే దానికి తగ్గ విజన్ ఉన్న టీమ్ మనకు అవసరం పడుతుంది. సరిగ్గా అలాంటి ఓ ఫస్ట్ క్లాస్ టీమ్ మాకు దొరికింది. ఇందులో హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ కోసం పని చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ కాసీ ఓ నీల్ మాతో పని చేయడం సంతోషంగా ఉంది. అతడు తనకున్న పూర్తి అనుభవం, ప్రతిభతో 'పఠాన్' కోసం హాలీవుడ్ స్ట్లైల్లో ఓ అద్భుతమైన యాక్షన్ సన్నివేశాన్ని రూపొందించాడు. అది చూస్తే కచ్చితంగా మైండ్ బ్లాక్ అవుతుంది. ఆశ్చర్యపోవాల్సిందే. అదేంటో ఇప్పుడే చెప్పను. సినిమా విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే." అని పేర్కొన్నారు.
కాగా, కాసీ బెస్ట్ యాక్షన్ డైరెక్టర్‌గా ప్రతిష్టాత్మక ఎమ్మి అవార్డుకు కూడా నామినేట్ అయ్యారు. 'జాక్ రీచర్', 'మిషన్ ఇంపాజిబుల్', 'టాప్ గన్ మార్వెరిక్' చిత్రాల్లో స్టార్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ చేసే భయంకరమైన కళ్లు చెదిరే విన్యాసాల వెనక కాసీ పాత్ర ఎంతో ఉంది. ఇంకా 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్', 'కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్, 'మిషన్ ఇంపాజిబుల్, ఘోస్ట్ ప్రోటోకాల్ వంటి సినిమాలకు గానూ కాసీ ఏడు సార్లు గిల్డ్ అవార్డుకు, టారస్ వరల్డ్ స్టంట్ అవార్డ్‌కు మూడుసార్లు నామినేట్ అయ్యారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో ఎక్స్ యాక్షన్ స్పెషలిస్ట్ విభాగంలో సభ్యుడుగానూ కొనసాగుతున్నారు.
'పఠాన్' విషయానికొస్తే.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. టీజర్లో షారుక్ అదరగొట్టేశాడు అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జాన్ అబ్రహం కీలక పాత్రలో నటిస్తున్నాడు. 'పఠాన్' గురించి నీకు ఏం తెలుసు? అనే సంభాషణతో మొదలైన టీజర్ భారీ పోరాట సన్నివేశాలతో ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. 'మూడేళ్ల నుంచి అతడి జాడ లేదు. చివరి మిషన్‌లో అతడు పట్టుబడ్డాడు. అతడిని వేధించారని విన్నా. పఠాన్ ఇంకా బతికే ఉన్నాడో లేడో తెలియదు' అనే సంభాషణలతో షారుక్ పాత్రను పరిచయం చేయడం నోటి నిండా రక్తంతో 'బతికే ఉన్నా' అంటూ పఠాన్ చెప్పడం అభిమానుల్ని బాగా అలరిస్తున్నాయి. ఇంతకీ పఠాన్ ఎవరు? అతణ్ని ఎందుకు అరెస్ట్ చేశారు? లాంటి ప్రశ్నలకు సినిమా చూస్తేనే సమాధానం దొరుకుతుంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా హిందీ, తమిల్, తెలుగు భాషల్లో వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇదీ చూడండి:సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నరేశ్-పవిత్రా లోకేశ్.. ఆ ఛానళ్లపై ఫిర్యాదు