tollywood stars about their new project : సినిమా పట్టాలెక్కింది మొదలుకుని.. విడుదలయ్యే వరకు చిత్రసీమలో ప్రతి వ్యవహారం గొలుసుకట్టులా సాగుతుంటుంది. వీటిలో ఏ దశలోనైనా సరే.. ఒక్క చిత్రం అటు ఇటు అయినా మిగతా ప్రాజెక్ట్‌లపైన ఆ ప్రభావం గట్టిగా పడుతుంది. కొన్నిసార్లు పట్టాలెక్కించిన చిత్రాల్ని కూడా పక్కకు పెట్టెయ్యాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినీ ప్రణాళికలో ఇలాంటి మార్పులే కనిపిస్తున్నాయి. 'లైగర్' విడుదలకు ముందే పూరి జగన్నాథ్‌తో రెండో సినిమాగా 'జనగణమన'ను పట్టాలెక్కించారు విజయ్. కానీ, ఇటీవల విడుదలైన 'లైగర్' దారుణ ఫలితాన్ని అందుకోవడంతో.. 'జనగణమన'ను ప్రస్తుతానికి పూర్తిగా పక్కకు పెట్టినట్లు సమాచారం.
దీంతో ఇప్పుడు విజయ్ తర్వాతి చిత్రం కోసం కథా చర్చలు మళ్లీ షురూ అయినట్లు తెలిసింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' చిత్రం చేస్తున్నారు. ఇది ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే సుకుమార్ 'పుష్ప2' పూర్తి చేశాక కానీ విజయ్‌తో రంగంలోకి దిగే పరిస్థితి లేదు. దీనికి మరింత సమయం పట్టే అవకాశముంది. కాబట్టి ఈ గ్యాప్‌లో విజయ్ దేవరకొండతో దిల్‌రాజు ఓ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పుడీ ప్రాజెక్ట్ కోసం మోహనకృష్ణ ఇంద్రగంటి, గౌతమ్ తిన్ననూరి వంటి దర్శకుల పేర్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. మరి వీరిలో ఎవరితో ప్రాజెక్ట్ సెట్టవుతుందో వేచి చూడాలి.
చిరు పునరాలోచన..
మునుపెన్నడూ లేనంత వేగంగా వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు చిరంజీవి. ప్రస్తుతం ఆయన నటించిన 'గాడ్ ఫాదర్' విడుదలకు సిద్ధమవుతుండగా.. 'భోళా శంకర్', బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా సెట్స్‌పై ముస్తాబవుతున్నాయి. వీటి తర్వాత యువ దర్శకుడు వెంకీ కుడుములతో ఓ చిత్రం చేయనున్నట్లు చిరు ఇది వరకే ప్రకటించారు. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్‌ను పక్కకు పెట్టారని సమాచారం. 'ఆచార్య' ఇచ్చిన చేదు ఫలితంతో చిరు కథల ఎంపికలో పునరాలోచనలో పడ్డారని, ప్రస్తుతం చేతిలో ఉన్న మూడు చిత్రాలు పూర్తి చేశాకే తదుపరి సినిమాపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇప్పటికైతే చిరు కోసం కథలు సిద్ధం చేసి పెట్టుకున్న దర్శకుల జాబితా చాలా పెద్దదే ఉంది. చిరంజీవి కూడా ఇప్పటికే తాను ఓ అరడజను కథలు ఓకే చేసి పెట్టుకున్నట్లు గతంలో ప్రకటించారు. మరి వీటిని తెరకెక్కించనున్న ఆ దర్శకులెవరు? ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తాయి? అన్నది తేలాల్సి ఉంది.