విభిన్నమైన రూపాల్లో కనిపిస్తూ సందడి చేసే గణనాథులు.. పచ్చతోరణాలు, రంగు రంగుల విద్యుత్ దీపాలతో తళుక్కుమనే వినాయక మండపాలు.. ఆ వేదికల వద్ద బంధుమిత్రులు, సన్నిహితులతో కలిసి చేసే అల్లర్లు.. సాయంత్రం వేళ అక్కడ జరిగే డ్యాన్సులు, పాటల వేడుకలు.. వినాయక చవితి పండగ పేరెత్తగానే గుర్తొచ్చే జ్ఞాపకాలెన్నో. అవన్నీ నిజాలై సాక్ష్యాత్కరించే వేడుక రోజులు వచ్చేశాయి. 'బోలో గణేష్ మహరాజ్‌కీ.. జై' అంటూ ఊరూ వాడా గణనాథుడి నామస్మరణతో మారుమోగిపోయే ఘడియలు నడిచొచ్చాయి. ఇందుకు సినీ తారల లోగిళ్లూ మినహాయింపు కాదు. బొజ్జ గణపయ్య పండగతో వారికీ ప్రత్యేక జ్ఞాపకాలుఉన్నాయి. ఆ అపురూప జ్ఞాపకాల్ని కొందరు తారలు ఇలా పంచుకున్నారు.
గల్లీ గల్లీ తిరిగా..
"వినాయక చవితి పండగతో నాకు బోలెడన్ని జ్ఞాపకాలున్నాయి. గణేష్ మండపాల్ని చూడటం కోసం బైక్‌పై హైదరాబాద్‌లో గల్లీ గల్లీ తిరిగిన రోజులు గుర్తొస్తాయి. మా ఇంట్లో వినాయక పూజ అమ్మ చేతుల మీదుగానే జరిగేది. ఆ పూజ పూర్తి కాగానే గణేష్ మండపాల సందర్శనకు మా మామయ్యలతో కలిసి బైక్‌పై వెళ్లే వాడ్ని. ఖైరతాబాద్ పెద్ద వినాయకుడి నుంచి వీధుల్లో పెట్టిన చిన్న చిన్న గణపతుల వరకు అన్ని ప్రతిమల్ని చూసొచ్చే వాళ్లం. ఇక సాయంత్రం అయ్యిందంటే కాలనీల్లో మండపాల దగ్గర చేసే డ్యాన్సులు, పాటల వేడుకల్ని చూసేందుకు వెళ్లే వాళ్లం. నిజానికి నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు ప్రసాదాల కోసమే గణనాథుని మండపాల దగ్గరకు వెళ్లే వాడ్ని. కొంచెం పెద్దయ్యాక విగ్రహాల్ని చూడటం కోసం వెళ్తుండేవాడ్ని. ఇక ఇప్పుడు పండగని పిల్లలతో కలిసి ఇంట్లోనే చక్కగా జరుపుకొంటున్నాం".
- ఎన్టీఆర్
పూజలో ఆ పుస్తకాలు
"మా ఇంట్లో వినాయక చవితికి చాలా సందడిగా ఉంటుంది. చిన్నప్పుడు నేనే స్వయంగా అమీర్‌పేటకు వెళ్లి మట్టి గణపతిని, పూజా సామగ్రిని తీసుకొచ్చేవాడ్ని. ఈ పండగ రోజు ‘విఘ్నాలు తొలగించు స్వామి’ అంటూ అందరూ వినాయకుడ్ని వేడుకుంటారు కదా. అందుకే నేను నాకు కష్టమైన సబ్జెక్ట్ పుస్తకాలన్నీ తీసుకొచ్చి పూజలో పెట్టే వాడ్ని. నాన్న ఆ పుస్తకాలపై స్వస్తిక్, ఓం అని రాసిస్తే.. నేను మళ్లీ వాటిని పసుపుతో స్వయంగా దిద్దుకునే వాడ్ని. ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుందేమోనని ఆశన్నమాట".
- నాని