రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్' నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ క్రమంలో ఓ లిరికల్ వీడియోను అభిమానుల కోసం అప్లోడ్ చేసింది. 'నీ సాయం సదా మేమున్నాం' అంటూ సాగే ఈ పాట మనసును హత్తుకునేలా ఉంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీన దీనికి సంబంధించిన ఆడియో సాంగ్‌ను హనుమంతుని పోస్టర్ పెట్టి హిందీలో రిలీజ్ చేశారు.
అయితే ఇప్పుడు ఇదే పాటను లిరికల్ వీడియో రూపంలో మలిచి.. సినిమా రిలీజవుతున్న అన్ని భాషల్లోనూ విడుదల చేశారు. వీడియో ఆఖరిలో శ్రీ రాముని కొత్త పోస్టర్‌ను రివీల్ చేసింది మూవీ టీమ్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటకు బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ కాంబో అజయ్.. అతుల్ సంగీతాన్ని సమకూర్చారు.
రామాయణ మహాకావ్యం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీ రామునిగా పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతమ్మ తల్లి పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు. లక్ష్మణుని పాత్రలో బాలీవుడ్ హీరో సన్నీ సింగ్ నటించారు. హనుమంతుని పాత్రలో దేవదత్త్ నాగే నటించారు. ఇక లంకేశుని పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.