అశేష అభిమానుల కన్నీళ్ల నడుమ విలక్షణ నటుడు శరత్ బాబు అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని గిండి ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లోని శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన శరత్‌బాబును రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకూ ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచారు. అక్కడికి వచ్చిన పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో ఆయన్ను చెన్నైలోని నివాసానికి తరలించారు.
అభిమానుల సందర్శనార్థం త్యాగరాయ నగర్‌లోని నివాసంలో మధ్యాహ్నం వరకు ఉంచారు. ఇక ఆయన్ను కడసారి చూసేందుకు పలువురు సినీ ప్రముఖలు తరలి వచ్చారు. శరత్‌బాబు పార్థివదేహానికి నివాళులు అర్పించి పుష్పాంజలి ఘటించారు. నటి సుహాసిని, రజనీకాంత్, రాధిక, శరత్‌కుమార్, సూర్య, రాంగోపాల్ వర్మ.. తదితరులు ఆయన నివాసానికి చేరుకుని సంతాపం తెలిపారు.
రజనీకాంత్ మాట్లాడుతూ.. శరత్‌బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. "శరత్‌బాబుతో నాకు చాలా ఏళ్ల నుంచి మంచి అనుబంధం ఉంది. యాక్టర్ కాకముందు నుంచే ఆయన నాకు బాగా తెలుసు. ఆయన చాలా మంచి వారు. ఎప్పుడూ చిరునవ్వుతోనే కనిపిస్తారు. ఆయన ముఖంలో నాకు కోపం ఎప్పుడూ కనిపించలేదు. అద్భుతమైన పాత్రల్లో యాక్ట్ చేశారు. మేమిద్దరం కలిసి చాలా చిత్రాల్లో నటించాం. ఆయనకు నేనంటే ఎంతో ఇష్టం. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తారు. గతంలో ఓ సందర్భంలో నేను సిగరెట్ కాల్చడం చూసి.. మానేయాలంటూ మందలించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని రజనీకాంత్ తెలిపారు.