సహాయనటిగా దాదాపు 800లకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు సీనియర్ నటి సుధ. ఎన్టీఆర్, కృష్ణ వంటి అగ్ర హీరోల నుంచి రామ్‌చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ వరకూ ఎంతోమంది నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇదే విషయంపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'ఇప్పుడు తల్లిగా నటించాలంటే మనసు ఒప్పుకోవట్లేదు.. అందుకే చాలా సినిమాలు..' - actress sudha latest interview
తెలుగు వెండితెరపై సీనియర్ నటి సుధ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఒకప్పుడు తల్లి పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. అవి ఆమె మాటల్లోనే..
''తల్లి పాత్రలు చేయడానికి నేను ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. ప్రతి పాత్రను ఇష్టపడే నటించా. అయితే తల్లి పాత్రలు చేయడం ప్రారంభించిన సమయంలో నా తోటి నటీమణులు.. 'సుధా నువ్వెందుకు తల్లి పాత్రలు చేస్తున్నావు. నువ్విలా చేస్తే రేపు మమ్మల్ని కూడా ఆ పాత్రలకు అడుగుతారు' అని ప్రశ్నించారు. ప్రముఖ దర్శకుడు బాలచందర్ వల్లే ఇన్నేళ్లపాటు నటిగా కొనసాగి.. ఈ స్థాయిలో నిలబడగలిగాను. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే. నేను నటించిన మొదటి మూడు చిత్రాలు మిశ్రమ స్పందనలకే పరిమితమైనప్పుడు బాలచందర్ నన్ను కలిశారు. 'నీ మొహం గ్లామర్ రోల్స్‌కు సెట్ కాదు. హీరోయిన్‌గా పనికి రావు. కాబట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తే బాగుంటుంది. నీకు ఓకే అయితే నా సినిమాలో హీరోయిన్ సోదరి పాత్ర ఉంది' అని చెప్పారు. అలా సహాయనటిగా నా ప్రయాణం మొదలుపెట్టా. ఆయనిచ్చిన సలహా వినబట్టే నేనింకా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా''
''ఇప్పుడు కొంతమంది తల్లి పాత్రలు పోషిస్తున్నారు. వాళ్లు పోషించిన ఏ పాత్రా అంతగా నచ్చడం లేదు. నటిగా నాకున్న రికార్డులు వేరు. ఈవీవీ సత్యనారాయణతో 17, రాఘవేంద్రరావుతో 15 సినిమాలు చేశా. పెద్దాచిన్నా అనే తేడా లేకుండా ప్రతి హీరోతో వర్క్ చేశా. కానీ, ఇప్పటి వాళ్లు అలా కాదు. రికార్డులు కాదు కదా.. ఎన్ని సినిమాల్లో నటిస్తారో కూడా తెలియదు. ఇప్పుడు వస్తోన్న చిత్రాల్లో తల్లి పాత్ర పూర్తిస్థాయిలో ఉండటం లేదు. సరైన డైలాగ్‌లు కూడా లేకుండా కేవలం స్క్రీన్‌పై అలా చూపిస్తున్నారు. ఒకప్పుడు తల్లిగా అద్భుతమైన పాత్రలు పోషించిన నేను ఇప్పుడు ఇలా స్క్రీన్‌పై కనిపించాలంటే మనసు అంగీకరించడం లేదు. ఆత్మసంతృప్తి లేదు. అందుకే ఈ మధ్య చాలా సినిమాలు వదులుకున్నా'' అని సుధ వివరించారు.