కొత్తదనానికి చిరునామాగా నిలుస్తుంటారు నవతరం దర్శకులు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా వైవిధ్యభరితమైన కథలతో వినోదాలు పంచడంలో వారెప్పుడూ ముందుంటారు. అందుకే తెరపై కొత్త ప్రతిభ మెరుస్తుందంటే చాలు.. సినీప్రియులంతా ఆవైపు ఓ కన్నేస్తుంటారు. గతేడాదిలాగే ఈ ఏడాదీ తెలుగు తెరపై పలువురు కొత్త దర్శకులు అదృష్టం పరీక్షించుకున్నారు. వారిలో కొందరు తొలి అడుగులోనే మెప్పించగా.. మరికొందరి ప్రయత్నాలకు ప్రశంసలు దక్కాయి. మరి ఈ ఏడాది తెరపై మెరిసిన ఆ కొత్త కెప్టెన్లు ఎవరు? వారి చిత్ర విశేషాలేంటి? తెలుసుకుందాం పదండి..
ఈ ఏడాది తెలుగులో చిన్న, మీడియం రేంజ్ చిత్రాల మెరుపులు బాగా కనిపించాయి. 'డీజే టిల్లు', 'అశోకవనంలో అర్జున కల్యాణం', 'ఒకే ఒక జీవితం', 'స్వాతిముత్యం', 'మసూద' ఇలాంటి చిత్రాలన్నీ ప్రేక్షకుల్ని కట్టి పడేశాయి. ఎన్నో రూ.కోట్లు పోసి తీసిన భారీ చిత్రాలకంటే మిన్నగా ఆకట్టుకున్నాయి. 'సినిమా తీయాలంటే భారీతనం కాదు.. సరికొత్త ఆలోచనలు ముఖ్యమ'ని ఈ చిత్రాలే నిరూపించాయి.
వీటిని నడిపించిన దర్శకులంతా తొలిసారి కెప్టెన్ కుర్చీలో కూర్చున్నవారే. అనుభవం లేకపోయినా.. వాళ్లలో ఉన్న ఉత్సాహం, సాధించాలన్న తపనే ఇంతటి విజయాలు దక్కించుకునేలా చేసింది. ఫిబ్రవరిలో వచ్చిన 'డీజే టిల్లు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు విమల్ కృష్ణ. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించారు. ఒక సింపుల్ ప్రేమకథకు ఓ క్రైమ్ ఎలిమెంట్‌ను జోడిస్తూ వినోదాత్మకంగా కథనం నడిపిన తీరు సినీప్రియుల్ని అలరించింది.
ముఖ్యంగా టిల్లు పాత్రను తీర్చిదిద్దుకున్న తీరు.. ఆ పాత్రలో సిద్ధు ఒదిగిన విధానం చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. రాధిక పాత్రలో నాయిక నేహా శెట్టి ఆకట్టుకుంది. పెళ్లి, లాక్‌డౌన్.. ఈ రెండింటినీ ముడిపెడుతూ విద్యా సాగర్ చింతా తెరకెక్కించిన చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. విష్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు చక్కటి విజయాన్నే అందుకొంది. తెలంగాణ అబ్బాయి, ఆంధ్రా అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లి పెళ్లి చేసుకోవాలనుకోవడం..లాక్‌డౌన్ వల్ల వాళ్లు అదే ఇంట్లో ఇరుక్కుపోవడం.. ఆ తర్వాత జరిగే రకరకాల పరిణామాలు, రెండు కుటుంబాల మధ్య మొదలైన అలకలు, చిర్రుబుర్రులు.. ఇలాంటి అంశాలతో సరదాగా సాగే ప్రయాణమిది.