తెలుగు ప్రముఖ నిర్మాత బన్నీ వాసు టాలీవుడ్ సినిమా పెద్దలపై ఘాటైన కామెంట్స్ చేశారు. సినిమా విడుదల తేదీల విషయంలో కొత్త వారికీ వెసులుబాటు ఇవ్వాలని కోరారు. ముఖ్యమైన తేదీలను చిన్న సినిమాలకు వదిలిపెట్టాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్రాజును కలిసిన ఆయన శాకుంతలం సినిమా విడుదల తేదీపై పునరాలోచించాలని అడిగారు.
బన్నీ వాసు కామెంట్స్..
'తెలుగు సినీ పరిశ్రమకు సంక్రాంతి ఓ పెద్ద పండుగ. మన సినిమాలు పాన్ ఇండియా స్థాయికి వెళ్లగలుగుతున్నాయి. తెలుగు సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలనేది సరైన నిర్ణయమే. కానీ పెద్ద సినిమాల నిర్మాతలు చిన్న సినిమాల గురించి కూడా కాస్త ఆలోచించాలి. కొత్త నిర్మాతలు, దర్శకులకు సినిమాల విడుదల తేదీలు చాలా ముఖ్యం. గతంలో కొత్తవాళ్లకు కూడా ఒక అవకాశం ఉండేది. కానీ కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రత్యేక సందర్భం, సెలవులు ఉంటే తప్ప చిన్న సినిమాలకు ఆదాయం రావడం లేదు. వందల సినిమాలు విడుదల చేస్తే అందలో పది మాత్రమే హిట్ అవుతున్నాయి. రిలీజ్ అవుతున్న వాటిలో యావరేజ్ సినిమాలే ఎక్కువగా ఉంటున్నాయి. యావరేజ్ సినిమాలు తీసే వాళ్లలో కొత్తవాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. చిన్న సినిమాల విడుదల కోసం కొత్త వాళ్లకు మూడు సెలవులు వదిలేస్తే గొప్ప సహాయం చేసినవాళ్లం అవుతాం. ఈ విధంగా కొత్తవాళ్లను ప్రోత్సహిస్తేనే సినీ పరిశ్రమ భవిష్యత్ బాగుంటుంది. దీంతో తెలుగు సినిమా కొత్త ఒరవడికి నాంది పలకాలని కోరుకుంటున్నాను' అని బన్నీ వాసు పేర్కొన్నారు.