'భీమ్లా నాయక్', 'ఉప్పెన', 'డీజే టిల్లు', 'జాంబిరెడ్డి', 'నాంది', .. గత రెండు సంవత్సరాలలో ఫిబ్రవరి నెల హిట్ ట్రాక్ ఇది. రవితేజ, అజిత్, పవన్ కల్యాణ్, మోహన్‌బాబు.. లాంటి అగ్ర నటుల సినిమాలన్నీ గతేడాది ఫిబ్రవరిలోనే విడుదలయ్యాయి. అన్ సీజన్ అయినా అదిరే వినోదాలు పంచిచ్చాయి. కాగా, ఈనెల ఆరంభంలో బాక్సాఫీస్ బరిలో నిలిచిన సినిమాల లిస్టు చూస్తే.. ఈసారీ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందనుకున్నారంతా. సమంత, ధనుష్, కల్యాణ్ రామ్ లాంటి తారలతో పాటు యువతరంలో క్రేజ్ ఉన్న విష్వక్ సేన్, సందీప్ కిషన్ లాంటి యువ కథానాయకుల చిత్రాలు కూడా రేసులో ఉండటమే దీనికి కారణం. కానీ, ఊహించని విధంగా సమంత నటించిన 'శాకుంతలం', విష్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ' లాంటి పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం వల్ల మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలినట్లైంది.
ఈ నెల మొదటి వారం సందీప్ కిషన్ 'మైఖేల్', సుహాస్ 'రైటర్ పద్మభూషణ్' చిత్రాలతో పాటు 'ప్రేమదేశం', 'రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం' అనే మరో రెండు చిన్న చిత్రాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ అన్ని చిత్రాల్లో 'రైటర్ పద్మభూషణ్' సినిమానే హిట్ టాక్ సంపాదించింది. ఈ మూవీతో సుహాస్ హీరోగా మరో మెట్టు పైకెక్కారు. 'మైఖేల్'తో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకోవాలన్న సందీప్‌కిషన్ ఆశలు నెరవేరలేదు. రంజిత్ జయకోడి తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. కాగా, 'బుట్టబొమ్మ' సినిమాతో చైల్డ్ ఆర్టిస్టు అనికా సురేంద్ర మరో మెట్టు ఎక్కింది. ఈ సినిమాలో సూర్య వశిష్ఠ, అనికా సురేంద్ర నాయకానాయికలుగా నటించారు. వీరితో పాటు శౌరి చంద్ర శేఖర్ రమేష్ దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాపై ట్రైలర్‌తోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా, ఫిబ్రవరి 4న రిలీజైన 'బుట్టబొమ్మ' వెండితెరపై పూర్తిగా తేలిపోయింది.