తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Tollywood: వెండితెరపై కార్మిక జెండా - Bhoomiki pachani song

Tollywood May Day songs and movies: శ్రమైకజీవులెందరో అలుపెరుగని పోరాటంతో తమ హక్కులు సాధించుకున్న సుదినమే మేడే. సమాజ నిర్మాణంలో కీలకమైన ఈ కార్మికుల కథాంశంతో ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాల్లో కార్మికుల పాత్రలకు తగ్గట్లు పాటల రచయితలు కలం ఎత్తితే.. గాయకులు బలంగా గళం వినిపించారు. అటువంటి కొన్ని పాటల్ని ఈ కార్మిక దినోత్సవాన ఓ సారి గుర్తు చేసుకుందాం.

Tollywood May Day songs and movies
వెండితెరపై కార్మిక జెండా

By

Published : May 1, 2022, 6:32 AM IST

Tollywood May Day songs and movies: జలశక్తి... విద్యుత్తు శక్తిగా మారితే మన జీవితాలను వెలిగిస్తుంది. సృజన శక్తి... శ్రామిక శక్తితో కలిస్తేనే వెండితెరపై రంగుల చిత్రం వెలుస్తుంది. థియేటర్లో మనల్ని ఆనందపరచడానికి వేల మంది సినీ కార్మికులు నిత్యం స్వేదంతో సావాసం చేస్తూనే ఉంటారు. సెట్‌ బాయ్‌ నుంచి... కెమెరా ఆపరేటర్‌ దాకా, డ్రైవర్ల నుంచి ట్రాలీ కార్మికుల దాకా... అంతా ఒక్కటై దర్శకుడి కలను.. కళగా మార్చడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి శ్రమైకజీవులెందరో అలుపెరుగని పోరాటంతో తమ హక్కులు సాధించుకున్న సుదినమే మేడే. సమాజ నిర్మాణంలో కీలకమైన ఈ కార్మికుల కథాంశంతో ఎన్నో తెలుగు చిత్రాలు వచ్చాయి. కథానాయకులు కార్మికుల పాత్రల్లో స్వేదం చిందించారు. వీరి పాత్రలకు తగ్గట్లు పాటల రచయితలు వాళ్ల తరపున కలం ఎత్తితే.. గాయకులు బలంగా గళం వినిపించారు. అటువంటి కొన్ని పాటల్ని ఈ కార్మిక దినోత్సవాన గుర్తు చేసుకుందాం.

నందమూరి తారక రామారావు బ్లాక్‌ అండ్‌ వైట్‌ రోజుల్లోనే కార్మిక జెండా అందుకున్నారు. 'శెభాష్‌ రాముడు'లో.. ఘంటసాల గళంతో 'జయమ్ము నిశ్చయమ్మురా.. జంకు గొంకు లేక నువ్వు సాగిపొమ్మురా'.. అంటూ కార్మికుల పక్షాన కదం తొక్కారు. ఇందులో ఆయన రిక్షా కార్మికుడిగా కనిపించారు.

'అన్యాయం.. అక్రమాలు.. దోపిడీలు.. దురంతాలు.. ఎన్నాళ్లని ఎన్నేళ్లని నిలదీసినదీ రోజే మేడే..' అంటూ కార్మిక దినోత్సవానికి సిసలైన అర్థం చెబుతూ సాగుతుంది 'ఎర్రమల్లెలు' చిత్రంలో పాట. కార్మిక నాయకుడిగా, పీడితుల పక్షాన పోరాడే వ్యక్తిగా.. మురళీమోహన్‌ ఇందులో నటించి మెప్పించారు.

ప్రస్తుతం మాస్‌ కథాంశంతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న బాలయ్య అప్పట్లో సింగరేణి కార్మికుడిగా నటించారు. 'రండి కదలి రండి.. నిదుర లెండి.. కలసి రండి...' అంటూ కణకణలాడే నిప్పు కణికలా ‘నిప్పురవ్వ’లో కనిపించారు.

‘భూమికీ పచ్చాని రంగేసినట్టే ఓయమ్మా లాలో..’ అనే పాట ప్రతి కార్మిక దినోత్సవాన శ్రమను నమ్ముకున్న ప్రతి ఒక్కరి గుండె తడుతూనే ఉంటుంది. కేజే ఏసుదాస్‌ గళం నుంచి జాలు వారిన ఈ గీతం కర్షకుల కష్టం గురించి చెబుతూ సాగుతుంది. ‘శ్రీరాములయ్య’ చిత్రంలోని ఈ పాట ఎందరినో అలరించింది.

మేడే అంటే సినీ ప్రియులకు వెంటనే గుర్తొచ్చే పేరు పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి. ఆయన పాట, పాత్ర.. ఎప్పుడూ పీడితుల పక్షమే.. శ్రమ జీవుల హక్కుల కోసమే. నారాయణమూర్తి పాత్రకు వందేమాతరం శ్రీనివాస్‌ గళం తోడై కదం తొక్కిన పాటలెన్నో. ‘ఎర్ర సైన్యం’లో ‘బంజారే బంజో.. వోనారే బంజా...’, ‘ఒరేయ్‌ రిక్షా’లో నా రక్తంతో నడుపుతాను రిక్షాను...’ ‘చీమలదండు’లో ‘ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నీయాళ్లో.. ఎర్రెర్రనిదీ జెండెన్నీయల్లో...’ అప్పట్లో జనాన్ని ఉర్రూతలూగించాయి. సింగన్న చిత్రంలో .. ‘ఆయారే మేడే.. ఆయుధమై నేడే..’ అంటూ హోరెత్తిన పాటలు బూర్జువా, పెట్టుబడిదారి, భూస్వాముల గుండెల్లో మర ఫిరంగుల్లా పేలాయి.

కునారిల్లిపోతున్న పల్లె వృత్తుల వెతల్ని కళ్లకు కట్టేలా గోరటి వెంకన్న అల్లిన పాట ‘పల్లె కన్నీరు పెడుతుందో..’. కుబుసం సినిమాలో శ్రీహరి తన ఈ పాట, పాత్రకు ఎర్రదనం అద్దాడు. ఇలా ఎన్నో గీతాలు కార్మికుల జీవితాన్ని, పోరాటాన్ని వెండితెరపై ఆవిష్కరించాయి.

శ్రమైక సినీ సౌందర్యం..తెరపై హీరో, హీరోయిన్‌ తళుకుబెళుకులు మాత్రమే కనిపించొచ్చు. సినిమా విడుదలయ్యాక ఒకరిద్దరికే గుర్తింపు రావొచ్చు. లాభ నష్టాలు పంచుకునేది కొద్దిమందే కావొచ్చు. కానీ కష్టం అందరిదీ! 24 కళలు కలిసి సమష్టిగా శ్రమిస్తేనే సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. లైట్‌బాయ్‌ సెట్లో లైటెత్తితేనే సినీ సీమకి వెలుగు. కెమెరా క్రేన్‌ ముందుకు కదిలితేనే వెండితెరపై ఫ్రేమ్‌ పడుతుంది. లొకేషన్‌లో మేకప్‌ నుంచి ప్యాకప్‌ దాకా అన్నీ పక్కానో కాదో ప్రొడక్షన్‌ విభాగం చూసుకుంటేనే బండి ముందుకు కదిలేది. సంగీతం, కళ, కూర్పు, పోరాటాలు, ఛాయాగ్రహణం, నృత్యం, రచన... ఇలా 24 విభాగాలూ శక్తికి మించి శ్రమిస్తుంటాయి. ప్రతీ విభాగంలోనూ శ్రమైక జీవన సౌందర్యం వెల్లివిరిస్తుంటుంది. రాళ్లెత్తిన కూలీల్లాగే.. సినీ సీమలోనూ రంగుల కళ కోసం చెమటోడుస్తున్న శ్రామికులు ఎంతోమంది. ‘సినిమా’ అనే తపనే వాళ్లని ముందుకు నడిపించేది. ఆ సినిమా కోసం ఎన్ని కష్టాలైనా పడతారు, ఎన్ని కన్నీళ్లైనా దిగమింగుతారు. ఈ చిత్రసీమలో ప్రత్యక్షంగా 24 వేల మంది, పరోక్షంగా 10 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వీళ్లలో 4 వేల మంది మహిళలు. 10 వేల మంది రోజువారీ కార్మికులు. కరోనాతో పని లేక, పస్తులతో అలమటించిన కార్మికుల్ని చిత్రసీమే కాపాడుకుంది. సినీ ప్రముఖులు తలోచేయి వేశారు. ఇప్పుడిప్పుడే చిత్రీకరణలు ఊపందుకోవడంతో పరిశ్రమ మళ్లీ గాడిన పడినట్టైంది. చాలామంది కార్మికులకి ఆరోగ్య భద్రత లేదని, మేడే సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సినీ కార్మికోత్సవంలో ఇ.ఎస్‌.ఐ. సదుపాయ కల్పనతోపాటు, పలు డిమాండ్లని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళుతున్నట్టుసినీ కార్మిక వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: అభిమానుల మది దోచేస్తున్న అందాల భామలు

ABOUT THE AUTHOR

...view details