Vijayendra Prasad : ఫోర్త్ ఫారం చదివే రోజుల్లో తన ఫస్ట్ క్రష్ చేసిన పనికి గుండె ఝల్లుమన్నంత పనైందని ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ అన్నారు. 'ఓ సాథియా' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఓ చిట్‌చాట్ కార్యక్రమంలో చిత్ర బృందంతో మాట్లాడుతున్న సమయంలో ఆయన తన చిన్నప్పటి ఫస్ట్ క్రష్ జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.
'ఈ సినిమా ఫస్ట్‌లవ్ నేపథ్యంలో తెరకెక్కింది. అయితే మీ జీవితంలో ఫస్ట్‌లవ్ గురించి ఏమైన చెబుతారా..? అని మూవీ టీమ్ విజయేంద్ర ప్రసాద్‌ను సరదాగా అడిగింది. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 'సాధారణంగా దాన్ని లవ్ అని అంటుంటాం. కానీ, అది లవ్ కాదు క్రష్. అయితే నా ఫస్ట్‌క్రష్ పేరు రాధ. నేను ఫోర్త్ ఫారం చదివే రోజులవి. అప్పుడు నా వయసు సుమారు 11 ఏళ్లు. ఆమె నాకంటే కాస్త పెద్దది. చాలా అందంగా ఉండేది. దీంతో ట్యూషన్ క్లాస్‌లో ఆమెను అలానే చూస్తూ ఉండేవాణ్ని. దాన్ని గమనించిన ఆమె మాస్టర్ దగ్గరకు వెళ్లి నాపై కంప్లైంట్ చేసింది. అప్పుడు ఆమె చేసిన పనికి నా గుండె ఝల్లుమంది. అయితే నేనంటే ఆ సర్‌కు ఇష్టం. అప్పుడు మాస్టార్.. 'ప్రసాద్ నీ వైపు చూస్తున్నాడని నీకెలా తెలుసు?' అని రాధను ప్రశ్నించారు. 'ఆయన చూడటం నేను చూశాను' అని తాను సమాధానం చెప్పడంతో.. 'మరి ప్రసాద్‌ను నువ్వెందుకు చూశావ్' అని ఆయన తిరిగి ప్రశ్నించారు' అని ట్యూషన్ క్లాస్‌లో జరిగిన సరదా సన్నివేశాన్ని విజయేంద్ర ప్రసాద్ పంచుకున్నారు.