తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పోలీస్‌ కథలు.. యాక్షన్‌ మొదలు.. సత్తా చాటేందుకు స్టార్​ హీరోలు రెడీ! - cinema

నిఖార్సైన హీరోయిజానికి నెలవు పోలీస్‌ కథలు. అందుకే అభిమాన కథానాయకులు యూనిఫామ్‌ తొడిగి.. లాఠీతో స్టైల్‌గా నడిచొస్తే చాలు 'ఆ కిక్కే వేరప్పా' అని మురిసిపోతారు సినీప్రియులు. ఇక రివాల్వర్‌ చేతబట్టి.. శత్రువుల వేటకు బరిలో దిగితే థియేటర్‌ మొత్తం విజిల్స్‌తో మోతెక్కిపోవాల్సిందే. బాక్సాఫీస్‌ కాసులతో నిండిపోవాల్సిందే. ఈ కారణంగానే మంచి కథలు దొరికినప్పుడల్లా పోలీస్‌ పాత్రలతో అలరించే ప్రయత్నం చేస్తుంటారు తెలుగు హీరోలు. ప్రస్తుతం ఇలా ఖాకీ సింహాల్లా బాక్సాఫీస్‌ ముందు కాసులు కురిపించేందుకు పలువురు కథానాయకులు సిద్ధమవుతున్నారు. మరి వారెవరు? ఆ చిత్ర విశేషాలేంటి? తెలుసుకుందాం పదండి..

tollywood heros in policeman roles in their upcoming movies
Etv tollywood heros in policeman roles in their upcoming movies

By

Published : Oct 16, 2022, 6:46 AM IST

పోలీస్‌ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు కథానాయకుడు రవితేజ. ఈతరం తెలుగు హీరోల్లో అందరి కంటే ఎక్కువసార్లు పోలీస్‌ నటించింది ఆయనే. 'విక్రమార్కుడు', 'ఖతర్నాక్‌', 'మిరపకాయ్‌', 'పవర్‌', 'టచ్‌ చేసి చూడు', 'క్రాక్‌'.. ఇలా ఆయన చేసిన పోలీస్‌ కథల జాబితా చాలా పెద్దదే. 'ఇడియట్‌', 'వెంకీ', 'కిక్‌' తదితర చిత్రాల్లోనూ ఆయన ఆఖరికి ఖాకీ చొక్కా తొడిగినట్లు చూపిస్తారు. ఇప్పుడాయన చిరంజీవి చిత్రం కోసం మరోసారి పోలీస్‌ అవతారమెత్తారని సమాచారం. ప్రస్తుతం చిరు కథానాయకుడిగా బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. 'మెగా154' అనే వర్కింగ్‌ టైటిల్‌తో సెట్స్‌పై ముస్తాబవుతున్న ఈ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అది శక్తిమంతమైన పోలీస్‌ పాత్రని తెలిసింది. ఇందులో ఆయన.. చిరు సవతి సోదరుడిగా కనిపించనున్నారని ప్రచారం వినిపిస్తోంది. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా.. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

రవితేజ
ప్రభాస్​

ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు కథానాయకుడు ప్రభాస్‌. ఇప్పుడాయన చేసిన 'ఆదిపురుష్‌' విడుదలకు సిద్ధమవుతుండగా.. 'సలార్‌', 'ప్రాజెక్ట్‌ కె' చిత్రాలు సెట్స్‌పై ముస్తాబవుతున్నాయి. వీటితో పాటు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్‌' అనే చిత్రం కూడా చేయాల్సి ఉంది. విభిన్నమైన యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్‌ పోలీస్‌గా కనువిందు చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత భూషణ్‌ కుమార్‌ గతంలోనే ప్రకటించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో పోలీస్‌గా ప్రభాస్‌ సరికొత్తగా కనిపించబోతున్నారట.

నాగచైతన్య

నాగచైతన్య కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వెంకట్‌ ప్రభు దర్శకుడు. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో తెరకెక్కుతోంది. ఇందులో చైతన్య శక్తిమంతమైన పోలీస్‌ పాత్రలో సందడి చేయనున్నారని సమాచారం. అయితే ఆయనది పోలీస్‌ పాత్రయినా యూనిఫాంలో కనిపించేది చాలా తక్కువేనని తెలుస్తోంది. ఆయన సన్నివేశాలు ఎక్కువగా గ్యాంగ్‌స్టర్స్‌తోనే ఉంటాయని కోలీవుడ్‌ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి '302' అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది.

ఇటీవలే 'పొన్నియిన్‌ సెల్వన్‌'తో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు కార్తి. ఇప్పుడు 'సర్దార్‌'తో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు. పి.ఎస్‌.మిత్రన్‌ తెరకెక్కించిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. ఇందులో కార్తి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ పాత్రలో సర్దార్‌ అనే స్పైగా.. మరో పాత్రలో విజయ్‌ ప్రకాష్‌ అనే ఇన్‌స్పెక్టర్‌గా యాక్షన్‌ హంగామా రుచి చూపించనున్నారు. ఇందులో ఆయన దాదాపు ఆరుకు పైగా గెటప్పుల్లో కనువిందు చేయనున్నట్లు ప్రచార చిత్రాల్ని బట్టి అర్థమవుతోంది. ఈ సినిమా దీపావళి సందర్భంగా ఈనెల 21న విడుదల కానుంది.

యువహీరోలు

యువతరం పోలీసులు
'మేజర్‌'లో ఆర్మీ అధికారిగా కనిపించి మెప్పించారు కథానాయకుడు అడివి శేష్‌. ఇప్పుడాయన 'హిట్‌2' కోసం యూనీఫాం వేసుకున్నారు. శైలేష్‌ కొలను తెరకెక్కించిన చిత్రమిది. 'హిట్‌'కు కొనసాగింపుగా రూపొందింది. క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా ముస్తాబైన ఈ చిత్రంలో కృష్ణ దేవ్‌ అనే పోలీస్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబరు 2న విడుదల కానుంది. 'వీరభోగ వసంతరాయలు', 'వి' చిత్రాల్లో ఖాకీ దుస్తుల్లో సందడి చేశారు సుధీర్‌బాబు. ఇప్పుడు 'హంట్‌' కోసం మరోసారి పోలీస్‌గా మారారు. మహేష్‌ తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. శ్రీకాంత్‌, భరత్‌ కీలక పాత్రలు పోషించారు. ఇందులో సుధీర్‌ పోలీస్‌గా రెండు కోణాలున్న పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం..త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి:ఆస్కార్​ చిత్రం 'ఛెల్లో షో' కథ ఎక్కడి నుంచి వచ్చిందంటే..

ప్రభాస్ ఫ్యాన్స్​కు డబుల్ బొనాంజా... ఆ చిత్రంలో హీరోయిన్లు ఖరారు.. సలార్ కొత్త అప్డేట్

ABOUT THE AUTHOR

...view details