Gopichand Ramabanam Movie Review : సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబోలు ప్రేక్షకుల్లో తెగ ఆసక్తిని రేకెత్తిస్తాయి. గోపీచంద్ - శ్రీవాస్ కలయిక కూడా అలాంటిదే. 'లక్ష్యం', 'లౌక్యం' తర్వాత ఈ స్టార్ కాంబో కలవడమే ఆ అంచనాలకు కారణం. ఎన్నో హిట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చిన ఆ కలయికలో రూపొందిన మూడో చిత్రం 'రామబాణం'. ఈ సినిమా మొదటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే..
స్టోరీ ఏంటంటే.. రాజారామ్ (జగపతిబాబు) తన ఊరిలో సుఖీభవ అనే పేరుతో ఓ హోటల్‌ను నడుపుతుంటాడు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని భావించే ఆయన.. సంప్రదాయ వంటకాల్ని తయారు చేయిస్తూ తక్కువ ధరలకే అందుబాటులో ఉంచుతుంటాడు. వ్యాపారంలో పోటీదారులకు అది కంటగింపుగా మారుతుంది. దీంతో జీకే (తరుణ్ అరోరా), అతని మామ (నాజర్) సుఖీభవ హోటల్‌పై దౌర్జన్యానికి పాల్పడి లైసెన్స్‌ను తీసుకెళ్లిపోతారు. ఇక రాజారామ్ తమ్ముడైన విక్కీ (గోపీచంద్) రాత్రికి రాత్రే వాళ్ల ఇంటిపై దాడిచేసి లైసెన్స్‌ను తిరిగి తీసుకొస్తాడు. అయితే నీతి నిజాయతీగా మెలిగే రాజారామ్ ఏదైనా సరే చట్ట పరిధిలోనే చేయాలని భావిస్తుంటాడు. దీంతో తన తమ్ముడు విక్కీ చేసిన పని నచ్చని రాజారామ్.. ఇలాంటివి చేస్తే జీవితంలో ఉన్నతంగా ఎదగలేమని చెబుతూ అతన్ని పోలీసులకు అప్పజెప్పేందుకు బయలదేరతాడు. ఇంతలో విక్కీ తాను ఎప్పటికైనా ఉన్నతంగా ఎదిగి తిరిగొస్తానంటూ తప్పించుకుని కోల్‌కతా వెళ్లిపోతాడు. అక్కడికి వెళ్లిన విక్కీ ఏం చేశాడు? పదిహేనేళ్ల తర్వాత తిరిగి రావల్సిన అవసరం ఆయనకు ఎందుకొచ్చింది? తిరిగి వచ్చాక ఏం జరిగిందనేదే అసలు కథ.
ఎలా ఉందంటే:
Gopichand movie Ramabanam Review : పాత కథల్ని కూడా కొత్తగా చెబుతున్న ట్రెండ్ ఇది. స్టోరీ అదే అయినా కూడా దానికి కొత్త నేపథ్యాల్ని మేళవించి, విభిన్నమైన పాత్రీకరణలతోనూ, కథనాలతోనూ మేజిక్ చేస్తూ ఇప్పటి ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుటుంబ కథలు ఇప్పుడు రావడం లేదు కదా అని.. దశాబ్దాల కిందటే చూసేసిన కథల్ని అదే ఫార్ములాతో ఇప్పుడు తెరపైకి తీసుకొస్తామంటే కుదరని పని. కానీ, రామబాణం విషయంలోనూ జరిగింది అదే.
సేంద్రియ ఉత్పత్తులు, సంప్రదాయ ఆహారం అంటూ ఓ కొత్త నేపథ్యాన్ని ఎంచుకున్నారు. తగిన తారాగణం, కావల్సినంత బడ్జెట్ ఉందని తెరపైన హంగులే చెబుతున్నాయి. కానీ సినిమాను మలిచిన విధానం మాత్రం పేలవంగా ఉంది. మొదటి నుంచి చివరి వరకు ఒక్క సన్నివేశంలోనూ కొత్తదనం కనపడలేదు. ప్రేమ, కుటుంబ అనుబంధాలు, డ్రామా, ఆలోచన రేకెత్తించగలిగే నేపథ్యం.. ఇలా అన్నీ ఉన్న కథే అది. అయినప్పటికీ మనసుల్ని హత్తుకునే భావోద్వేగాలు కానీ, కాసింత హాస్యం పంచే సన్నివేశాలు కానీ మచ్చుకైనా కనిపించవంటే ఈ స్క్రిప్ట్, దర్శకత్వం ఎంత పేలవమో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు.