ప్రతి సీజన్‌కు ఒకటి చొప్పున ఏడాది మొత్తం సినిమాల్లో నటిస్తూ తమ జోరు చూపిస్తుంటారు హీరోయిన్లు. అనుష్క, తమన్నా, రకుల్, రష్మిక, పూజాహెగ్డే తదితరులంతా ఇలా వరుసగా సందడి చేసిన వాళ్లే. అయితే ఇప్పుడు వారంతా తమ స్పీడ్ తగ్గించేశారు. బాలీవుడ్ వైపు దృష్టి సారించి కొందరు.. ఆచితూచి కథలు ఎంచుకోవాలన్న ఆలోచనతో మరికొందరు.. తెలుగులో సినిమాలు చేయడం తగ్గించారు.
రకుల్.. జోరంతా హిందీలోనే
తెలుగులో స్టార్ నాయికల్లో ఒకరిగా వరుస సినిమాలతో జోరు చూపించింది నటి రకుల్ ప్రీత్ సింగ్. మహేష్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడిన ఈ నాయిక ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ సినిమాలతోనే బిజీగా గడిపేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనకు పైగా చిత్రాలుండగా.. అందులో ఒక్కటీ తెలుగు సినిమా లేదు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు2' చిత్రంలో నటిస్తున్నా.. అదీ కొత్తగా ఒప్పుకున్నదేమీ కాదు. కొన్నేళ్ల క్రితం సంతకాలు చేసిన చిత్రమే. తెలుగులో ఓ క్రీడాకారిణి జీవితకథలో నటించనున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చినా.. అదీ కార్యరూపంలోకి రాలేదు. మరి ఆమె నుంచి మరో తెలుగు కబురు ఎప్పుడు అందుతుందో వేచి చూడాలి. రకుల్ ప్రస్తుతం హిందీలో 'డాక్టర్ జి', 'థ్యాంక్ గాడ్', 'ఛత్రీవాలి' తదితర చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.
'నిశ్శబ్దం' తర్వాత రెండేళ్లకు..
'అరుంధతి', 'భాగమతి' సినిమాలతో నాయికా ప్రాధాన్య చిత్రాలకు చిరునామాగా మారింది నటి అనుష్క. అయితే 'బాహుబలి' ముందు వరకు వరుస సినిమాలతో జోరు చూపించిన ఈ అమ్మడు ఆ తర్వాత నుంచి పూర్తిగా జోరు తగ్గించేసింది. ఓ చిత్రం చేయడం.. కొన్నాళ్లు విరామం తీసుకోవడం.. ఇదే పంథాలో అతి నెమ్మదిగా సినీ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. 'నిశ్శబ్దం' సినిమా తర్వాత రెండేళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్న ఆమె.. ఆచితూచి ఓ కథకు పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఏకైక చిత్రం ఇదొక్కటే. అనుష్క, నవీన్ పొలిశెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్‌బాబు తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. వినూత్నమైన ప్రేమకథతో రూపొందుతోన్న ఈ చిత్రం.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి
కొన్నాళ్ల క్రితం వరకు భారీ విజయాలతో జోరు చూపించిన పూజా హెగ్డే.. ఈ ఏడాది వరుస పరాజయాలు అందుకొంది. భారీ అంచనాలతో వచ్చిన 'రాధేశ్యామ్', 'బీస్ట్', 'ఆచార్య' ఆమెకు చేదు ఫలితాల్ని అందించాయి. అయినా సినిమాల పరంగా ఆమె జోరు ఏమాత్రం తగ్గలేదు. అయితే ఇటు తెలుగు సినిమాల్ని.. అటు హిందీ చిత్రాల్నీ సమంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాలన్న ఆమె కోరిక నెరవేరలేదు. ముఖ్యంగా కొత్తగా ఒప్పుకున్న తెలుగు సినిమాల విషయంలో ఆమె ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్లో మొదలైన 'జనగణమన' అర్ధంతరంగా ఆగిపోగా.. పవన్ - హరీష్ శంకర్ల కలయికలో చేయాల్సిన 'భవదీయుడు భగత్‌సింగ్' ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందన్నది తేలడం లేదు. ఒకరకంగా ఇప్పుడామె చేతిలో ఉన్న ఏకైక తెలుగు ప్రాజెక్ట్.. మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో రూపొందనున్న హ్యాట్రిక్ చిత్రమే. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా.. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక ఆమె హిందీలో రణ్వీర్ సింగ్‌తో కలిసి 'సర్కస్', సల్మాన్ ఖాన్‌కు జోడీగా 'కిసీ కా భాయ్.. కిసీ కి జాన్' చిత్రాల్లో నటిస్తోంది.