తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఇదీ భామల బ్రాండ్‌, హిట్లు తక్కువ అవకాశాలు ఎక్కువ - తమన్నా

చిత్రసీమలో హీరోయిన్ నటించిన​ వరుస రెండు సినిమాలు ఫ్లాప్​ అయితే చాలు. మళ్లీ హిట్​ కొడితే గానీ టాప్​ హీరోలు, అగ్ర దర్శకుల సినిమాల్లో ఆమెకు నటించే అవకాశం దొరకదు. కానీ ఈ మధ్యకాలంలో ట్రెండ్​ మారినట్టే కనిపిస్తోంది. భామల కెరీర్​పై పరాజయాల ప్రభావం అసలు కనిపించడం లేదు. నటించిన సినిమాలు వరుస ఫ్లాప్​లు అవుతున్నా కొందరు హీరోయిన్లకు పిలిచి అవకాశాలిస్తున్నారు దర్శకనిర్మాతలు.

tollywood heriones
tollywood heriones

By

Published : Aug 21, 2022, 7:01 AM IST

Updated : Aug 21, 2022, 12:29 PM IST

Tollywood Heriones: నాలుగు పరాజయాలు పలకరించినా వచ్చిన ఇబ్బందేం లేదు.. కెరీర్‌ ఢోకా ఉండదు. ఇదీ టాలీవుడ్‌లో కథానాయకుడి వరస. అదే హీరోయిన్‌ విషయానికొస్తే రెండు ఫట్లు వస్తే ఏకంగా ఫేట్‌ మారిపోతుంది. ఫ్లాప్‌ కథానాయిక అనే ముద్ర పడిపోతుంది. మళ్లీ హిట్టు కొడితేగానీ టాప్‌ హీరోలు, అగ్ర దర్శకుల సినిమాల్లో నటించే అవకాశం దొరకదు. అలా కనుమరుగైన కథానాయికలు చాలామందే. కానీ ఈ మధ్యకాలంలో ట్రెండు మారినట్టే కనిపిస్తోంది. వాళ్ల కెరీర్‌పై పరాజయాల ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. వరుస ఫెయిల్యూర్‌లు మూటగట్టుకున్నా.. పిలిచి అవకాశాలిస్తున్నారు. ఎందుకిలా? అంటే 'కథానాయికల కొరత' అన్నది సమాధానం. ఇక సీనియర్‌ భామలైతే వాళ్లకున్న అనుభవం, క్రేజ్‌తో కొత్త ప్రాజెక్టులు కొల్లగొడుతున్నారు.

సాయిపల్లవి, కృతిశెట్టి, రాశీఖన్నా తదితర కథానాయికలు ఈమధ్య తెలుగులో చేసిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. అయినా సరే, క్రమం తప్పకుండా అవకాశాల్ని అందుకుంటూనే ఉన్నారు. 'ఉప్పెన'తో ఆకట్టుకున్న కృతిశెట్టికి తర్వాత ఆ స్థాయి విజయమే దక్కలేదు. అయినా ఆమె తెలుగు, తమిళ భాషల్లో బిజీ బిజీగా ఉంది. ఇక సాయిపల్లవి సినిమా ఒప్పుకొంటే చాలన్నట్టుగా ఎదురు చూస్తుంటారు దర్శకనిర్మాతలు. ఆమెకి అంత క్రేజ్‌.

రాశీఖన్నాని పరాజయాలు పలకరిస్తున్నకొద్దీ ఆమె తన కెరీర్‌ని మరింతగా పరుగులు పెట్టిస్తోంది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం భాషలపై దృష్టిపెట్టి వరుసగా సినిమాలు చేస్తోంది. అనుపమ పరమేశ్వరన్‌కి కొంతకాలంగా చెప్పుకోదగ్గ విజయం లేకపోయినా, అవకాశాల్ని అందుకుని 'కార్తికేయ2'తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. నవతరం భామలు ఫలితాలతో సంబంధం లేకుండా తమదైన ప్రభావం చూపిస్తూనే ఉన్నారు.

జోరు సాగనీ...
అటు నటనతోనూ... ఇటు అందం పరంగా ప్రభావం చూపించిన తారల కెరీర్‌కి ఎప్పటికీ తిరుగుండదు. జయాపజయాలతో సంబంధం లేకుండా వాళ్ల ప్రయాణం కొనసాగడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు తెలుగులో నటిస్తున్న సీనియర్‌ భామల్లో ఎక్కువశాతం అలాంటివాళ్లే. 'ఓ బేబీ' తర్వాత తెలుగులో సమంతకి చెప్పుకోదగ్గర సినిమా లేదు. అయినా వరుసగా సినిమాలు చేస్తూ, 'పుష్ప'తో వచ్చిన ప్రత్యేక గీతం అవకాశం తర్వాత మళ్లీ జోరు చూపించడం మొదలుపెట్టింది. 'శాకుంతలం' సినిమాని పూర్తి చేసిన ఆమె 'యశోద', 'ఖుషి'ల్లో నటిస్తోంది. మరికొన్నింటిలోనూ ఆమె పేరు వినిపిస్తోంది.

.

అనుష్క తొలినాళ్లల్లో అందంపైనే దృష్టిపెట్టినా, 'అరుంధతి'తో ఆమె తనలోని మరో కోణాన్ని చూపించింది. అప్పట్నుంచి క్రమం తప్పకుండా నటనకి ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ వస్తోంది. 'బాహుబలి' చిత్రాల తర్వాత ఆమె కెరీర్‌లో వేగం తగ్గినప్పటికీ, 'నిశ్శబ్దం' వంటి పరాజయం ఎదురైనప్పటికీ ఆమెకి కథలు వినిపించేందుకు దర్శకనిర్మాతలు వరుస కట్టారు. అయినా ఆచితూచి ముందడుగు వేస్తోంది. ఆమెకున్న బ్రాండ్‌ అలాంటిది. ఇటీవలే నవీన్‌ పోలిశెట్టితో కలిసి ఓ చిత్రం కోసం రంగంలోకి దిగింది.

.

'పుష్ప' సినిమాతో నటిగా సత్తా చాటిన రష్మిక మందన్న, 'ఆడవాళ్లూ మీకు జోహార్లు'తో పరాజయాన్ని చవిచూసింది. అయినా సరే, ఆమె జోరు తగ్గలేదు. హిందీలోనూ, తమిళంలోనూ వరుసగా అవకాశాల్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు 'సీతారామం'తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. 'వారసుడు'లో నటిస్తూ, 'పుష్ప2' కోసం మరోసారి శ్రీవల్లిగా రంగంలోకి దిగేందుకు సన్నద్ధమవుతోంది. తమన్నాకి ఆమె అనుభవమే ఓ బ్రాండ్‌. ఎంత పోటీ ఎదురైనా, పరాజయాలతో ఆటుపోట్లు ఎదురైనా ఆమెని ఎప్పటికప్పుడు అగ్ర పథాన నిలబెడుతోంది అనుభవమే. వాణిజ్య ప్రధానమైన సినిమాలకి ఆమె కేరాఫ్‌ ఇప్పుడు. చిరంజీవితో కలిసి 'భోళాశంకర్‌'లో నటిస్తోంది. త్వరలోనే 'గుర్తుందా శీతాకాలం'తో సందడి చేయబోతోంది.

.

భారీ విజయాలతో జోరు చూపించి...
భారీ విజయాలతో జోరు చూపించిన పూజాహెగ్డే, కీర్తిసురేష్‌లు ఈమధ్య పరాజయాల్ని చవిచూశారు. 'రాధేశ్యామ్‌', 'ఆచార్య', 'బీస్ట్‌'... ఇలా కొనసాగింది పూజా పరాజయాల పరంపర. అయినా ఇవేవీ ఆమె కెరీర్‌పై ప్రభావం చూపలేదంటే పూజాకి ఉన్న క్రేజ్‌ అర్థమవుతుంది. ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు చేస్తున్న ఆమె త్వరలోనే మహేష్‌బాబుతో కలిసి కొత్త చిత్రం మొదలుపెట్టనుంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో 'జనగణమన' చేస్తోంది.

.

కీర్తిసురేష్‌ 'మహానటి' తర్వాత మళ్లీ అంతగా ప్రభావం చూపించిన సినిమా చేయలేదు. కథానాయిక ప్రాధాన్యమున్నవి చేసినా పరాజయాలే పలకరించాయి.అయినా సరే, మళ్లీ వాణిజ్య ప్రధానమైన సినిమాల్లో అవకాశాలు ఆమెని వరించాయి. ఇప్పుడు నానితో కలిసి 'దసరా'లో నటిస్తోంది.చిరంజీవి చిత్రం 'భోళాశంకర్‌'లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్‌ నుంచి కథానాయికలు దిగుమతి అవుతున్నా సీనియర్లు మొదలుకొని, కొత్తతరం వరకు అందరికీ అవకాశాలు దక్కుతుండడం కథానాయికలకి కలిసొస్తున్న మరో అంశం.

.

ఇవీ చదవండి:సిల్వర్​ కలర్​ డ్రెస్​లో శార్వరీ వా అందాల ఖజానా

హీరోయిన్ రోజా కూతురిని చూశారా, సినిమాల్లో ఎంట్రీకి రంగం సిద్ధం

Last Updated : Aug 21, 2022, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details