Tollywood Heriones: నిత్యామేనన్, నివేదా థామస్, నివేదా పేతురాజ్, రెజీనా, రీతూ వర్మ.. అటు అందంతోనూ, ఇటు నటనతోనూ కట్టి పడేసే ఈ ముద్దుగుమ్మలంతా తరచూ సందడి చేస్తుంటే తెరకి అదో నిండుదనం. నిధి అగర్వాల్, ఈషా రెబ్బా, నభా నటేష్... వీళ్లంతా వరుసగా మూడు నాలుగు సినిమాలతో సందడి చేసినవాళ్లే. స్టార్ భామలకి దీటుగా కనిపించారు. ఇప్పుడూ చిత్రాలు చేస్తున్నారు. కానీ కొత్త అవకాశాల విషయంలోనే కాస్త వెనకబడినట్టు కనిపిస్తున్నారు. కొద్దిమంది పొరుగు భాషల్లోనూ.. మరికొంతమంది వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తూ కెరీర్‌ని కొనసాగిస్తున్నారు.
నివేదా థామస్ ఒకప్పుడు కథానాయికగా వరుసగా అవకాశాలు అందుకుంది. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, నాని తదితర కథానాయకులతో ఆడిపాడిన ఆమె, 'వి' తర్వాత మరో అవకాశం అందుకోలేదు. 'వకీల్‌సాబ్'లో మెరిసింది. చాలా కాలం కిందట చేసిన 'శాకిని ఢాకిని' విడుదల కావల్సి ఉంది. కొత్తగా ఆమె తెలుగులో ఒప్పుకొన్నవి లేవు. 'భీమ్లానాయక్' తర్వాత నిత్యమేనన్ మరో సినిమా చేయలేదు. తమిళం, మలయాళంతోపాటు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తోంది.
నివేదా పేతురాజ్ అటు అందంతోనూ, ఇటు నటనతోనూ ఆకట్టుకునే భామ. ఇటీవల విడుదలైన 'విరాటపర్వం'లో ఓ చిన్న పాత్రలో మెరిసింది. గతేడాది విడుదలైన 'రెడ్', 'పాగల్' చిత్రాల తర్వాత తెలుగులో ఆమె కథానాయికగా ఒప్పుకొన్న చిత్రాలేవీ లేవు. 'బ్లడీ మేరీ' సిరీస్‌లో నటించింది. రెజీనా ఒకప్పుడు తెలుగులో వరుస అవకాశాలతో సత్తా చాటింది. 'ఆచార్య'లో ప్రత్యేక గీతం చేసిన ఆమె 'శాకిని ఢాకిని'లో నివేదా థామస్‌తో కలిసి నటించింది. తమిళంలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తోంది. తెలుగమ్మాయి రీతూవర్మ సినిమాల జాబితాలో కొత్త ప్రాజెక్టులు లేవు. ద్విభాషా చిత్రం 'ఒకే ఒక జీవితం' విడుదల కావల్సి ఉంది. ఇటీవల 'మోడర్న్ లవ్ హైదరాబాద్' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. మరో తెలుగమ్మాయి ఈషా రెబ్బా తమిళం, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తోంది. మరోవైపు సిరీస్‌ల్లో నటిస్తోంది.