తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మార్కెట్లో మన సినిమా పేరు మార్మోగిపోవాలా.. సరికొత్త ప్రచారంతో దుమ్మురేపుతున్న టాలీవుడ్‌ - టాలీవుడ్‌ పాటలతో పూనకాలు న్యూస్

ఓటీటీలో సినిమాను చూసేద్దాంలే అనుకున్న ప్రేక్షకులను థియేటర్ల దాకా రప్పించేందుకు మన టాలీవుడ్ కొత్త స్ట్రాటజీతో ముందుకొచ్చింది. మరి అవేంటో తెలుసుకుందాం రండి..

tollywood ciniema latest news
టాలీవుడ్‌

By

Published : Jan 17, 2023, 8:17 AM IST

సినిమానే కాదు బాస్‌.. సినిమా ప్రచారమూ కొత్తగా ఉండాలి. ఇదీ ప్రస్తుతం మన చిత్రసీమ జపిస్తున్న మంత్రం. కాస్త ఆగి ఓటీటీలో చూసేద్దాంలే అనుకొనే ప్రేక్షకులను తొలిరోజే థియేటర్లకు పరుగులు పెట్టించాలంటే సరికొత్త ప్రచారంతో ఆసక్తి పెంచాల్సిందే. ఇదివరకటిలా రిలీజ్‌ డేట్‌ ప్రకటనల పోస్టర్లు, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్లు, టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలు మాత్రమే సరిపోవడం లేదు. అంతకుమించిన కంటెంట్‌ను ఎప్పటికప్పుడు సినీ ప్రియులకు వేడివేడిగా వడ్డిస్తూ ఉండాల్సిందే. లేకపోతే అభిమానులు ఊరుకోవడం లేదు. 'అన్నా మన సినిమా అప్‌డేట్లు రావడం లేదేంటి..' అని మొహమాటం లేకుండా ట్విట్టర్‌లో అడిగేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఇంటర్వ్యూలు కాస్తా తుంటర్వ్యూలు, 'ఫన్‌'టర్వ్యూలుగా మారిపోయాయి. అసలు పాటలను తలదన్నే స్థాయిలో కవరు సాంగులు దుమ్మురేపుతున్నాయి. మేకింగ్‌ వీడియోలు యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్నాయి. హీరోలే లీకువీరులై కొన్ని సీన్లను రివీల్‌ చేస్తూ అసలు సినిమా ముందుంది అంటూ ఊరిస్తున్నారు. ఇలా ప్రచారపర్వం రోజురోజుకూ కొత్త పోకడలు పోతోంది.

ప్రమోషన్‌కు కథ వేరే ఉంటుంది..
సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేసేందుకు చిత్రబృందాలు తెగ శ్రమిస్తున్నాయి. సినిమాకే కాదు.. వాటి ప్రమోషన్లకూ పక్కా స్క్రిప్టులు రాస్తున్నాయి. దీంతో ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. అసలా మాటకు వస్తే సినిమా ప్రచారమన్నది విడుదలకు కాస్త ముందు చేసే హంగామా ఎంతమాత్రమూ కాదిప్పుడు. సినిమాకు క్లాప్‌ కొట్టకముందు నుంచే జనాల నోళ్లలో నానాలి. పేరు పెట్టకముందే వార్తల్లో నిలవాలి.

అందుకోసమే కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ మొదలుకొని ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణుల పేర్లను వెల్లడించడం వరకూ సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారు. ఫలానా హీరో ఫలానా దర్శకుడితో సినిమా చేస్తున్నాడహో అంటూ మొక్కుబడి ప్రకటనలు విడుదల చేయకుండా కాన్సెప్టులు అల్లుకొని మరీ ప్రత్యేక వీడియోలు రూపొందిస్తున్నారు.

నాని

ఈమధ్య నాని 30వ చిత్రానికి సంబంధించిన ప్రకటన ఇదే కోవలో సాగింది. నాని, అతడి కుమార్తె పాత్రధారి మధ్య జరిగే సరదా సంభాషణతో ఈ వీడియోను రూపొందించారు. 'నాన్నా నీ గడ్డం నాకు నచ్చలేదు' అని పాప అంటే, దీన్ని 'దసరా'(నాని నటిస్తున్న ప్రస్తుత చిత్రం) కోసం పెంచాను. ఆ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. మన సినిమాలో ఉండదులే' అని నాని సమాధానమిస్తాడు. 'మీసాలు కూడా ఉండవా' అని కూతురు అడిగితే, 'ఉండవు' అని చెబుతాడు. 'జుత్తును మాత్రం తీసేయకు నాన్నా' అని ఆ చిన్నారి గారాబంగా అడుగుతుంది.

'నీ కోరిక తప్పకుండా తీరుస్తా' అని నాని చెబుతాడు. అలాగే 'ఈ సినిమాకు నువ్వు కోరుకున్న కథానాయిక, దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులనే ఎంపిక చేస్తా' అని మాట ఇస్తుండగా, ఈ సినిమా చిత్రబృంద వివరాలు ప్రత్యక్షమవుతాయి. దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఈ వీడియో ద్వారా అటు 'దసరా' సినిమా ప్రచారం, ఇటు నాని కొత్త సినిమా కబుర్లను ప్రేక్షకులతో పంచుకున్నారు. అలాగే కొత్త సినిమా తండ్రీకూతుళ్ల అనుబంధంతో సాగే కథ అని చెప్పకనే చెప్పారు.

షూటింగ్‌లోనూ అప్‌డేట్స్‌ తగ్గేదేలే..
సినిమా సెట్స్‌పైకి వెళ్లిన తర్వాత కూడా షూటింగ్‌ ప్రోగ్రెస్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను సరికొత్తగా పంచుకుంటున్నారు. 'వాల్తేర్‌ వీరయ్య'లో రవితేజ తొలిసారి సెట్స్‌లో అడుగుపెట్టిన విషయాన్ని పంచుకుంటూ చిత్రబృందం విడుదల చేసిన వీడియో కూడా ఇలాంటిదే. అందులో రవితేజ కారులో నుంచి స్టైల్‌గా దిగి ఓ క్యారవాన్‌ దగ్గరకు వెళ్లి తలుపు తడితే, లోపల్నుంచి చిరంజీవి చేయి బయటకు అందిస్తాడు. ఇద్దరూ షేక్‌ హ్యాండ్‌ చేసుకొన్న వెంటనే రవితేజ తనదైన శైలిలో ప్రేక్షకులకు కన్నుగీటి నవ్వుతాడు.

'మాస్‌ఫోర్స్‌ జాయిన్స్‌ మెగాస్టార్‌' అన్న క్యాప్షన్‌తో విడుదల చేసిన ఈ వీడియోకు మంచి స్పందన వచ్చింది. అలాగే ప్రత్యేక గీతాల్లో నటించే నాయికలు సెట్‌కు వచ్చిన సందర్భాల్లోనూ స్పెషల్‌ ఫొటోలు, గ్లింప్స్‌తో ఆసక్తి రేపుతున్నారు. ప్రభాస్‌తో నాగ్‌ అశ్విన్‌ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భారీస్థాయిలో తెరకెక్కిస్తున్న 'ప్రాజెక్టు కె' నుంచి విడుదల చేసిన మేకింగ్‌ వీడియో కూడా చర్చనీయాంశమైంది. ఓ చిన్న చక్రాన్ని సరికొత్తగా రూపొందించేందుకు చిత్రబృందం ఎంతలా శ్రమిస్తోందన్న విషయాన్ని అందులో చూపారు. దీన్నిచూశాక ప్రేక్షకులు ఇక సినిమా ఏ రేంజులో ఉండబోతోందో అంటూ చర్చించుకుంటున్నారు.

చిరంజీవి, రవితేజ

పాటలతో పూనకాలు లోడవ్వాలి..
పాటలు బాగుంటే సినిమా సగం విజయం సాధించినట్లే అన్నది పరిశ్రమవర్గాల విశ్వాసం. అందుకే తమ సినిమా పాటలు జనాలకు చేరువ కావడం కోసం ఆడియో రిలీజ్‌ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించి అదేరోజున పాటలన్నింటినీ విడుదల చేసేవారు. ఆ సంప్రదాయం కాలగర్భంలో కలసిపోయింది. ఒక్కో పాటను ఒక్కోసారి వదులుతూ సినిమాపై క్రమక్రమంగా అంచనాలు పెంచుకుంటూ పోవడం ఇప్పటి ట్రెండ్‌.

అయితే పాటను లిరికల్‌ వెర్షన్‌ రూపంలో విడుదల చేయడం కూడా ఇప్పుడు పాతబడిపోయింది. కొత్తగా కవర్‌ సాంగులు పుట్టుకొచ్చాయి. ఖర్చుకు వెనకాడకుండా భారీ హంగులతో వీటిని చిత్రీకరిస్తున్నారు. వీటిలో సంగీత దర్శకులు హీరోలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రత్యేక కాస్ట్యూమ్స్‌ ధరించి జోరుగా స్టెప్పులేస్తూ జోష్‌ నింపుతున్నారు. అంతేకాదు.. గాయకులు, ఆర్కెస్ట్రా బృందం కూడా వీటిలో మెరుస్తున్నారు. ఇటీవల 'వీరసింహారెడ్డి'లోని 'జై బాలయ్య..' పాటలో తమన్‌, 'వాల్తేర్‌ వీరయ్య'లోని 'బాస్‌ పార్టీ' పాటలో దేవిశ్రీప్రసాద్‌ ఇలాగే సందడి చేసి ప్రేక్షకులకు పూనకాలు తెప్పించారు.

ఇంటర్వ్యూలో ప్రశ్నలు తక్కువ.. పంచులు ఎక్కువఇక సినిమా విడుదలకు ముందు ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణులు మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూల తీరుతెన్నులు కూడా మారిపోయాయి. యాంకరు ప్రశ్నలు అడగడం, తారలు గంభీరంగా జవాబులు ఇవ్వడం ఓ మూసగా మారింది. అందుకే ఇంటర్వ్యూలనూ కొత్త బాట పట్టిస్తున్నారు. సినిమాలో నటించిన హీరోను ఆ చిత్ర దర్శకుడో, హాస్య నటుడో, హీరోతో అనుబంధమున్న మరో దర్శకుడో, నటుడో ఇంటర్వ్యూ చేస్తున్నారు.

దీనివల్ల అవి ఫక్తు ఇంటర్వ్యూల్లా కాకుండా పాత జ్ఞాపకాల కలబోతలా, అనుబంధాల ఆవిష్కరణలా సరదాగా సాగుతూ వీక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. ఇటీవల ‘ధమాకా’ విడుదలకు ముందు కూడా ఇలాంటి ఇంటర్వ్యూలతో చిత్రబృందం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. రవితేజతో గతంలో సినిమాలు తీసిన దర్శకులు అనిల్‌ రావిపూడి, బాబీ, గోపీచంద్‌ మలినేని కలిసి రవితేజను ఇంటర్వ్యూ చేశారు. దీనివల్ల ఈ దర్శకులు ప్రస్తుతం చేస్తున్న సినిమాల విశేషాలు కూడా ప్రస్తావనకు వస్తాయి కాబట్టి ఆ సినిమాలకూ ఉచిత ప్రచారం జరుగుతుందన్నమాట. అలాగే రవితేజతో పలు చిత్రాల్లో నటించిన తనికెళ్ల భరణి కూడా ఆయనతో ఆత్మీయ సంభాషణ జరిపారు.

వెన్నెల కిషోర్‌, సునీల్‌ లాంటి హాస్య నటులతో కొన్ని చిత్రబృందాలు తమ హీరో, హీరోయిన్లను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయిస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాల్లో అనుకోకుండానో లేదా కావాలనో చిత్రబృందం వదిలే లీకులు కూడా ఓ రకమైన ప్రచారంగా మారాయి. చిరంజీవి ఈమధ్య ఇలాంటి లీకులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు. ఆమధ్య ఆచార్య, ఇప్పుడు రాబోతున్న ‘వాల్తేర్‌ వీరయ్య’కు సంబంధించి చిరంజీవి లీక్‌ చేసిన విషయాలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రశ్నాజవాబుల రొటీన్‌ ఇంటర్వ్యూలతో పోలిస్తే సరదా పంచులు, కౌంటర్లతో ఇవే ప్రేక్షకులకు ఎక్కువగా చేరువవుతూ సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి.

అభిమానులతో నేరుగా కనెక్టయ్యేలా..
సినిమాల్లో 'బ్రేకింగ్‌ ఫోర్త్‌ వాల్‌' అనే ఓ టెక్నిక్కుంటుంది. అంటే సినిమాలో కథానాయకుడు కెమెరా వైపు చూస్తూ అభిమానులనుద్దేశించి డైలాగులు చెప్పడమన్నమాట. ఇలాంటి సీన్లతో ఫ్యాన్సుకు కలిగే అనుభూతే వేరు. హీరో తమతోనే నేరుగా మాట్లాడినట్లు భావించి వారు ఆనందపడతారు. అలాంటిది నిజంగానే హీరోలు తమతో మాట్లాడితే.. తమ ప్రశ్నలకు ఓపిగ్గా జవాబిస్తే.. తాము క్రియేట్‌ చేసిన మీమ్స్‌ను ఆస్వాదిస్తే.. వారికి ఇంకెంత ఆనందంగా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి అనుభూతినే ఫ్యాన్స్‌కు అందిస్తున్నారు హీరోహీరోయిన్లు.

సినిమా విడుదలకు ముందు అభిమానులతో ట్విట్టర్‌లో ముచ్చటిస్తున్నారు. కళాశాలలకు వెళ్లి కబుర్లు చెబుతున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రచారం సమయంలో అభిమానులు రూపొందించిన మీమ్స్‌నూ భాగం చేశారు. రాజమౌళి ఒక్కో సినిమాను ఏళ్ల తరబడి చెక్కడం, పలుమార్లు విడుదల తేదీలు మార్చడం లాంటి విషయాలపై సరదాగా క్రియేట్‌ చేసిన మీమ్స్‌ను ఓ ఇంటర్వ్యూలో ప్రదర్శించగా, చిత్రబృందం వాటిని వీక్షిస్తూ కడుపుబ్బా నవ్వుకుంది.

ఇవేకాదు.. యూట్యూబ్‌లో ఆదరణ పొందిన ప్రముఖ చానళ్ల భాగస్వామ్యంతో నటీనటులు ప్రత్యేక వీడియోలు చేస్తున్నారు. ప్రాంక్‌ వీడియోలు, షార్ట్‌ ఫిలింలు, కుకింగ్‌, ఫుడ్‌ చానళ్లలో కనిపిస్తున్నారు. అయితే అవి తమ సినిమా థీమ్‌కు అనుగుణంగా ఉండేలా చూసుకుంటున్నారు. కాదేదీ ప్రచారానికి అనర్హం అంటూ ప్రతి సందర్భాన్నీ, ప్రతి అవకాశాన్నీ, ప్రతి వేదికనూ ఉపయోగించుకుంటూ తమ సినిమాకు ఎలాగైనా ప్రేక్షకులను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details