తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సినిమా షూటింగ్‌ల బంద్‌పై.. నిర్మాతలు ఏం నిర్ణయించారంటే? - ఓటీటీ విడదలపై మీటింగ్​

టికెట్ ధరల తగ్గింపు, నిర్మాణ వ్యయాలు, ఓటీటీలో సినిమాల విడుదలపై తాజాగా తెలుగు నిర్మాతల మండలి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియో ఓనర్లు పాల్గొని తమ అభిప్రాయాల్ని వెల్లడించారు.

Tollywood producers meeting
టాలీవుడ్ నిర్మాతల బంద్​

By

Published : Jul 25, 2022, 6:07 PM IST

Updated : Jul 25, 2022, 6:20 PM IST

తాజా సమావేశంలో సినిమా షూటింగ్‌ల బంద్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నిర్మాత సి.కల్యాణ్‌ అన్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేయాలని ఇటీవలే నిర్మాతల మండలి నిర్ణయించింది. ఈ క్రమంలో సోమవారం తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరిగింది. సినిమా షూటింగ్‌ల నిలుపుదల, టికెట్‌ ధరలపై కూలంకషంగా చర్చించారు. షూటింగ్‌ల బంద్‌పై ఈ సందర్భంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం. ఇదే విషయమై సమావేశం అనంతరం నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ.. సినిమా షూటింగ్‌ల నిలుపుదలపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సినిమా రంగ సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈనెల 27న కమిటీ భేటీ అవుతుందని తెలిపారు. తమ మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని ప్రకటించారు. కమిటీ నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు.

ఓటీటీ విడుదలపైనా కుదరని ఏకాభిప్రాయం!..నిర్మాణ వ్యయం, ఓటీటీల్లో సినిమాల విడుదలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ముఖ్యంగా ఓటీటీల్లో సినిమా విడుదలపై ఎవరి అభిప్రాయాలను వాళ్లు వెల్లడించారు తప్ప, అందరూ ఏకాభిప్రాయానికి రాలేదని తెలుస్తోంది. దీనిపై కూడా మరోసారి చర్చించే అవకాశం ఉంది. అలాగే స్పెషల్‌ కమిటీలో ఎవరెవరు ఉండాలి? ఏ విభాగాల నుంచి ఎంతమందిని తీసుకోవాలి? ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి?అనే విషయాలను చర్చించారు. ఈ క్రమంలో తమ అభిప్రాయాలు చెప్పి నిర్మాతలు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, సుప్రియ తదితరులు సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. తుది నిర్ణయాన్ని కమిటీకి వదిలేశారు. నిర్మాతల మండలి సమావేశానికి దిల్ రాజు, సి.కళ్యాణ్ , సునీల్ నారంగ్ , స్రవంతి రవికిశోర్, సుప్రియ, దర్శకుడు తేజ, వైవీఎస్ చౌదరి, అశోక్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

ఏపీలో సినీ ఇండస్ట్రీ సర్వనాశనమైంది!..మరోవైపు ఆంధ్రాలో సినిమా పరిశ్రమ సర్వనాశనమైందని ఏపీ ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యదర్శి ముత్యాల రమేశ్‌ ఆరోపించారు. ఎగ్జిబిటర్స్‌, డిస్ట్రిబ్యూటర్స్‌ తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఓటీటీల వల్ల థియేటర్‌లకు నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. సినిమా విడుదలైన ఎనిమిది వారాల తర్వాత పెద్ద సినిమా, నాలుగు వారాల తర్వాత చిన్న సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేసుకోవచ్చని సమావేశంలో తీర్మానం చేశామని చెప్పారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని నిర్మాతల సంఘానికి తెలియజేస్తామన్నారు. సినిమా కలెక్షన్ల విషయంలో తప్పుడు లెక్కలు చూపించటం వల్ల హీరోలు బాగుపడుతున్నారే తప్ప, ఎగ్జిబిటర్స్‌, డిస్ట్రిబ్యూటర్స్‌ నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: ఈ సీరియల్​ స్టార్​కు ఎంత క్రేజో.. కేవలం ఆ ఒక్క విషయంతో!

Last Updated : Jul 25, 2022, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details