పిలుస్తున్న బాలీవుడ్.. హిందీ చిత్రసీమలో తెలుగు దర్శకుల హవా!
తెలుగు చిత్రసీమ ఇప్పుడు జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ ఓ వెలుగు వెలుగుతోంది. మన కథలు అందరికీ నచ్చుతున్నాయి. ప్రాంతీయ.. భాషా సరిహద్దులు చెరిపేస్తూ ప్రతి ఒక్కరి మనసుల్ని హత్తుకుంటున్నాయి. పసందైన వినోదాల్ని పంచిస్తున్నాయి. అందుకే మన దర్శకులు తయారు చేస్తున్న కథలపై బాలీవుడ్ స్టార్లు, నిర్మాతలు మనసుపడుతున్నారు. వారితో కలిసి సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఉత్సాహం చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్‌కు వరుస కడుతున్న తెలుగు దర్శకుల జాబితా అంతకంతకు రెట్టింపవుతోంది.
TOLLYWOOD DIRECTORS IN HINDI
By
Published : Aug 8, 2022, 7:19 AM IST
పాన్ ఇండియా సంస్కృతి వల్ల సినీ పరిశ్రమల ముఖ చిత్రమే మారిపోయింది. దర్శకుల్నైనా.. హీరోలనైనా ఇదివరకటిలా ఒక భాషకే పరిమితం చేసి చూసే రోజులు పోయాయి. ప్రతిభ ఉందని తెలిస్తే చాలు.. అన్ని చిత్రసీమలు ఎర్రతివాచీ పరచి అవకాశాలతో స్వాగతం పలుకుతున్నాయి. ఫలితంగానే ఎవరూ ఊహించని కొత్త కలయికలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈ తరహా కలయికల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. వీటిలో తెలుగు దర్శకుల నుంచి రానున్న చిత్రాలే అరడజనుకు పైగా ఉన్నాయి.
'అర్జున్ రెడ్డి' చిత్రంతో తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని అందుకొని చిత్రసీమ దృష్టిని ఆకర్షించారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇదే సినిమాని హిందీలో 'కబీర్ సింగ్'గా రీమేక్ చేసి.. అక్కడా అదే రీతిలో విజయ ఢంకా మోగించారు. ఇప్పుడాయన హిందీలో రెండో సినిమాగా 'యానిమల్'ను పట్టాలెక్కించారు. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. రష్మిక కథానాయిక. వినూత్నమైన యాక్షన్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో రణ్‌బీర్ ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయన లుక్, క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటాయని తెలిసింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం.. హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ వచ్చే ఏడాది విడుదల కానుంది.
హను.. హిందీలో తొలి అడుగు ప్రేమకథల్ని తెర కెక్కించడంలో దర్శకుడు హను రాఘవపూడిది అందెవేసిన చెయ్యి. 'అందాల రాక్షసి' నుంచి 'సీతారామం' వరకు ఆయన నుంచి వచ్చిన ప్రతి ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేసింది. ఇప్పుడాయన బాలీవుడ్‌లో తొలి అడుగు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఇటీవల ఆయనే స్వయంగా వెల్లడించారు. తన శైలికి భిన్నమైన సరికొత్త యాక్షన్ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందని, ఇందులో సన్నీ డియోల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటిస్తారని తెలిపారు. ఇది త్వరలో పట్టాలెక్కనుంది. దీంతో పాటు హను.. అమెజాన్ ప్రైమ్ కోసం ఓ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించనున్నారు.
తేజ.. 'జఖ్మీ' యువతరం మెచ్చే కొత్తదనం నిండిన ప్రేమకథలకు చిరునామా దర్శకుడు తేజ. ప్రస్తుతం ఆయన దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'అహింస' అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన వెంటనే ఆయన బాలీవుడ్‌లో రెండు ప్రాజెక్ట్‌లు చేయనున్నారు. ఇందులో ఒకటి 'జఖ్మీ' అనే సినిమా కాగా.. మరొకటి 'తస్కరి' అనే వెబ్‌సిరీస్. వీటిని టైమ్స్ ఫిల్మ్స్, ఎన్.హెచ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. 'జఖ్మీ' కశ్మీర్ నేపథ్యంలో సాగే చిత్రమని, ఇందులో ఇద్దరు కథానాయకులు నటిస్తారని ఇప్పటికే ప్రకటించారు. త్వరలో ఇది సెట్స్‌పైకి వెళ్లనుంది.
హిరాణీ నిర్మాణంలో అజయ్ భూపతి 'ఆర్‌ఎక్స్ 100' సినిమాతో తొలి అడుగులోనే యువతరం దృష్టిని ఆకర్షించారు దర్శకుడు అజయ్ భూపతి. రెండో ప్రయత్నంగా 'మహాసముద్రం' తెరకెక్కించగా.. అది బాక్సాఫీస్ ముందు చేదు ఫలితాన్ని అందుకుంది. ఇప్పుడాయన హిందీలో తొలి సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి నిర్మించనున్నట్లు సమాచారం. దీనికి ఆయనే స్వయంగా కథ అందించనున్నారని, ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని ప్రచారం వినిపిస్తోంది. హిరాణి ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో 'డంకీ' అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు.
వినాయక్.. 'ఛత్రపతి' ప్రభాస్ - రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన హిట్ సినిమా 'ఛత్రపతి'ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు వి.వి.వినాయక్ తెరకెక్కిస్తున్నారు. ఈ ఇద్దరికీ ఇదే తొలి హిందీ సినిమా. నుష్రత్ బరుచా కథానాయిక. తెలుగు వెర్షన్‌కు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ హిందీ చిత్రానికీ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ సినిమా.. త్వరలో విడుదల కానుంది.
సంకల్ప్.. 'ఐబీ71' 'ఘాజి' చిత్రంతో తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఇప్పుడాయన 'ఐబీ71'తో బాలీవుడ్‌లో తొలి అడుగు వేసేందుకు సిద్ధమయ్యారు. విద్యుత్ జమ్వాల్ హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మిస్తున్న చిత్రమిది. విభిన్నమైన యాక్షన్ కథాంశంతో రూపొందుతోంది.