ఎన్నో అపురూప చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ కన్నుమూశారు. కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న 92 ఏళ్ల కె. విశ్వనాథ్ గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కె.విశ్వనాథ్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఇది అత్యంత విషాదకరమైన రోజు: చిరంజీవి
కె.విశ్వనాథ్ మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు."పితృ సమానులు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌గారు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన గొప్పతనం గురించి మాటలు చాలవు. పండితులని పామరులనీ కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైంది. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిల్మ్స్‌ని కూడా బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా మలిచిన దర్శకుడు బహుశా ఇంకొకరు లేరు. తెలుగు జాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన మహా దర్శకుడు. ఆయన దర్శకత్వంలో 'శుభలేఖ', 'స్వయంకృషి', 'ఆపద్బాంధవుడు' చిత్రాల్లో నటించే అవకాశం నాకు లభించింది. నాకు వ్యక్తిగతంగా ఆయనతో ఉన్నది గురు శిష్యుల సంబంధం. అంతకుమించి తండ్రీ కొడుకుల అనుబంధం. ఆయనతో గడిపిన సమయం నాకు అత్యంత విలువైంది. ప్రతి నటుడికీ ఆయనతో పని చేయటం ఒక ఎడ్యుకేషన్‌లాంటిది. ఆయన చిత్రాలు భావి దర్శకులకి ఒక గైడ్‌లాంటివి. 43 సంవత్సరాల క్రితం, ఆ మహనీయుడి ఐకానిక్ చిత్రం 'శంకరాభరణం' విడుదలైన రోజునే బహుశా ఆ శంకరుడికి ఆభరణంగా, ఆయన కైలాసానికి ఏతెంచారు. ఆయన చిత్రాలు, ఆయన చిత్రాల సంగీతం, ఆయన కీర్తి అజరామరమైనది. ఆయన లేని లోటు భారతీయ చిత్ర పరిశ్రమకు, తెలుగువారికి ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా"
కళాతపస్వి విశ్వనాథ్ తెలుగుజాతి ముద్దుబిడ్డ : బాలకృష్ణ
"కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు కన్నుమూయడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు.. భారతీయ సంస్కృతీ సంప్రదాయలు మరీ ముఖ్యంగా మన తెలుగుదనాన్ని అణువణువున ప్రతిబింబించేలా ఆయన తీసిన అత్యద్భుత చిత్రాలు తెలుగు సినిమాకే గర్వ కారణం. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చి ప్రతి తెలుగు వాడు గర్వించేలా చేసిన దిగ్గజ దర్శకుడి మరణం తీవ్రవిచారానికి గురిచేసింది. కళా తపస్వి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను" -నందమూరి బాలకృష్ణ3
ఆయన ఓ బహుముఖ దర్శకుడు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
"శ్రీ కె విశ్వనాథ్ గారు మరణించినందుకు విచారం వ్యక్తం చేశారు. ఆయన సినీ ప్రపంచానికి ఒక సృజనాత్మక, బహుముఖ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన సినిమాలు దశాబ్దాలుగా వివిధ శైలులను కవర్ చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి."