తెలంగాణ

telangana

By

Published : Jul 10, 2022, 8:35 AM IST

ETV Bharat / entertainment

సినిమాలే కాదు.. వ్యాపారంలోనూ వీరు సూపర్​ హిట్!

Tollywood Actors Business: నటీనటులు అనగానే సినిమాలు చేస్తూ సంపాదిస్తారనుకుంటారు అందరూ. కానీ కొందరు నటీనటులు సినిమాలే కాకుండా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. విభిన్న వ్యాపారాల్లో రాణిస్తున్నారు. ఎవరెవరు ఏ వ్యాపారం చేస్తున్నారంటే?

tollywood celebrities in business
tollywood celebrities in business

Tollywood Actors Business: కొందరు నటీనటులు కేవలం సినిమాలకే పరిమితం కావడంలేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారం దిశగానూ అడుగులు వేస్తూ అక్కడా తమని తామునిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ స్టార్‌... ఏ వ్యాపారంలో ఉన్నారంటే...

నాగచైతన్య

క్లౌడ్‌కిచెన్‌ని ప్రారంభించి..: సినీ ప్రముఖులు ఆహార రంగంలోకి రావడం కొత్తేమీ కాదు. అలాంటి వారి జాబితాలో తాజాగా నాగచైతన్య కూడా చేరాడు. ఈ మధ్యే 'షోయూ'పేరుతో క్లౌడ్‌కిచెన్‌ను ఆరంభించి స్విగ్గీతో ఒప్పందం కుదుర్చుకుని ఆ విషయాన్ని తన ఇన్‌స్టా అకౌంట్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'స్వతహాగా నేను ఆహారప్రియుడిని. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నోరకాల వంటకాలను రుచిచూశా. వాటన్నింట్లో ఆసియా వంటకాలను ఎక్కువగా ఇష్టపడతా. ఆ రుచులను అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ క్లౌడ్‌కిచెన్‌ను ఏర్పాటుచేశా'నని చెబుతాడు నాగచైతన్య.

సమంత

సామాన్యులకూ డిజైనర్‌వేర్‌..:సినిమాలతో క్షణం తీరిక లేకపోయినా సేవకూ, తనకు ఇష్టమైన పనులు చేసేందుకూ సమయం కేటాయించే సమంత కొన్నాళ్ల క్రితం 'సాకీ' పేరుతో ఆన్‌లైన్‌లో డిజైనర్‌ దుస్తుల సంస్థను ప్రారంభించింది. 'ఇప్పుడంటే ఓ నటిగా పెద్దపెద్ద ఫ్యాషన్‌ డిజైనర్లు రూపొందించిన దుస్తులను వేసుకుంటున్నా కానీ.. చదువుకునేటప్పుడు నా దగ్గర ఒక్క డిజైనర్‌ వేర్‌ కూడా లేదు. దాంతో ఎప్పటికైనా ఓ డిజైనర్‌స్టోర్‌ని ఏర్పాటు చేయాలనుకున్నా. ఆ ఆలోచన నుంచే సాకీ వచ్చింద'ని చెప్పే సమంత ఈ మధ్య 'ఏకమ్‌' అనే కిండెర్‌గార్డెన్‌ పాఠశాలలోనూ భాగస్వామి అయ్యింది.

కీర్తి సురేశ్​

సౌందర్య ఉత్పత్తుల తయారీలో..: కీర్తి సురేష్‌... ఈ మధ్య చర్మ, కేశ సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తుల తయారీలో అడుగుపెట్టింది. ప్రముఖ డిజైనర్‌ శిల్పారెడ్డితో కలిసి 'భూమిత్ర' పేరుతో ప్రారంభించిన ఈ ఆన్‌లైన్‌ స్టోర్‌లో రసాయనాలు లేని సీరమ్‌లు, నూనెలు, ఫేస్‌ప్యాక్‌లు... ఇలా చాలానే ఉన్నాయి. 'మా బామ్మ చర్మం, జుట్టూ ఇప్పటికీ చాలా ఆరోగ్యంగానే కనిపిస్తాయి. తాను పసుపు, సెనగపిండి, చందనం, నిమ్మకాయ, ఉసిరికాయ, మెంతులు, మందారాల్లాంటివే ఎక్కువగా వాడుతుంది. ఆ సౌందర్య చిట్కాలను సామాన్యులకూ పరిచయం చేయాలనే ఆలోచనతోనే ఎన్నో ప్రయోగాలు చేసి మరీ భూమిత్రను ప్రారంభించా...'మని చెబుతుంది కీర్తిసురేష్‌.

విజయ్​ దేవరకొండ

దుస్తులతోపాటూ సినిమా హాలూ..: ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఆ క్రేజ్‌ను పెంచుకుంటున్న విజయ్‌ దేవరకొండ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లోనే 'రౌడీవేర్‌' పేరుతో దుస్తుల బ్రాండ్‌ను అందుబాటులోకి తెచ్చాడు. ఆ తరవాత 'మీకు మాత్రమే చెప్తా' సినిమాతో నిర్మాతగానూ మారాడు. అక్కడితోనే ఆగిపోకుండా మహబూబ్‌నగర్‌లో 'ఏషియన్‌ విజయ్‌దేవరకొండ సినిమాస్‌' పేరుతో మల్టీప్లెక్స్‌ను కూడా నిర్మించాడు. 'ఓ సాధారణ యువకుడిగా సినిమాల్లోకి రావడానికీ, ఇక్కడకు వచ్చాక నిలదొక్కుకోవడానికీ చాలా కష్టాలు పడ్డా. ఇప్పుడు హీరోగా నాకంటూ గుర్తింపు తెచ్చుకున్న నేను ఇక్కడితోనే ఆగిపోకూడదనుకున్నా. అందుకే దుస్తుల వ్యాపారం, నిర్మాణరంగంలోకి వచ్చా. ఇప్పుడు సినిమా హాలు కట్టించుకోవాలనుకున్న కోరికా తీరింద..'ని అంటాడు విజయ్‌.

రానా దగ్గుబాటి

విభిన్న వ్యాపారాల్లో.: సినిమాల్లోకి రాకముందే విజువల్‌ ఎఫెక్ట్స్‌ సంస్థను ప్రారంభించిన రానా.. ఆ తరువాత క్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, యాంట్‌హిల్‌ వెంచెర్స్‌, అమరచిత్ర కథ వంటి సంస్థల్లో భాగస్వామిగా మారాడు. కొన్నాళ్లక్రితమే ఆర్ట్స్‌, డిజైనింగ్‌ లైఫ్‌స్కిల్స్‌, ఫొటోగ్రఫీ, వేదిక్‌సైన్స్‌ వంటివి నేర్పించేందుకు అమరచిత్రకథ అలైవ్‌ పేరుతో ఓ లెర్నింగ్‌ సెంటర్‌నూ ప్రారంభించాడు. తాజాగా డిక్రాఫ్‌ పేరుతో పురుషులకు అవసరమైన రకరకాల గ్రూమింగ్‌ ఉత్పత్తుల్ని ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించడం మొదలుపెట్టాడు.

ఇదీ చదవండి:'విలువలు లేకపోతే మనకీ జంతువులకీ తేడా ఏముంది'

ABOUT THE AUTHOR

...view details