ఇంకో రోజులో బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. భారీ బడ్జెట్‌తో రూపొంది.. ఏ మాత్రం సంబంధం లేని రెండు జానర్ల సినిమాలు ఏప్రిల్ 28న థియేటర్లలో సందడి చేయనున్నాయి. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఒకటి టాలీవుడ్ నుంచి రానుండగా.. మరొకటి కోలివుడ్ నుంచి రాబోతుంది. అవే స్పై యాక్షన్ థ్రిల్లర్ అఖిల్ 'ఏజెంట్'- హిస్టారికల్ ఎపిక్ మణిరత్నం మల్టీస్టారర్ 'పొన్నియిన్ సెల్వన్-2'. ఇప్పటికే ఈ రెండు చిత్రాల మూవీటీమ్స్.. గత కొద్ది రోజులుగా వినూత్నంగా జోరుగా ప్రమోషన్స్ చేస్తూ ఆడియెన్స్‌లో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పైగా టాలీవుడ్లో ఈ రెండు చిత్రాలకు పెద్దగా పోటీకూడా ఏమీ లేవు. రీసెంట్గా వచ్చిన సాయి తేజ్ సూపర్ హిట్ చిత్రం 'విరూపాక్ష' ఒక్కటి మాత్రమే ఉంది. ఈ రెండు చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. 'విరూపాక్ష' వీటికి పెద్ద అడ్డేమి కాదు. మంచి కలెక్షన్లతో దూసుకెళ్తాయి.
అఖిల్ ఏజెంట్ విషయానికొస్తే.. దాదాపు రూ.80కోట్లతో రూపొందిన ఈ సినిమా.. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో కాస్త జోరు చూపించినట్లు తెలిసింది. రూ.36.20 కోట్లు బిజినెస్ జరిగిందట. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.37కోట్లు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్ర పోస్టర్, టీజర్, ట్రైలర్.. ముఖ్యంగా అఖిల్ సిక్స్ ప్యాక్ స్టైలిష్ లుక్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించడం వంటి అంశాలు సినిమాపై అంచనాలను పెంచాయి. అయితే ఈ సినిమా మొదటగా పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రస్తుతానికి టాలీవుడ్, మాలీవుడ్‌లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. బుక్కింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. ఓపెనింగ్స్ ఎలా ఉన్నా.. కాస్త హిట్ టాక్ తెచ్చుకుంటే.. రానున్న రోజుల్లో మంచి వసూళ్లను అందుకోవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రం అటు అఖిల్‌తో పాటు దర్శకుడు సురేందర్ రెడ్డికి ఎంతో కీలకం.