నందమూరి నట వారసుల్లో ఒకరైన తారకరత్న శనివారం బెంగళూరులో చికిత్స పొందుతూ కన్నుముశారు. దీంతో సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, వెంకయ్య నాయుడుతో పాటు చిరంజీవి, రామ్ చరణ్ లాంటి ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
'తారకరత్న మృతి నన్ను ఎంతో బాధించింది'
టాలీవుడ్ హీరో, తెదేపా నేత నందమూరి తారకరత్న మృతి ఎంతో బాధించిందని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ట్విట్టర్ వేదికగా తారకరత్నకు సంతాపం తెలిపారు. "సినిమాలు, ఎంటర్‌టైన్మెంట్ రంగంలో తారకరత్న తనదైన ముద్రవేశారు. ఆయన మృతి నన్ను ఎంతో బాధించింది. తారకరత్న కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓంశాంతి" అని ప్రధాని ట్వీట్ చేశారు.
'ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకబు చేస్తునే ఉన్నాను'
"ప్రముఖ నటుడు శ్రీ నందమూరి తారకరత్న పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. ఆయన గుండెపోటుకు గురైన నాటి నుంచి ఎప్పటికప్పుడు తన ఆరోగ్యపరిస్థితి గురించి వాకబు చేస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యంతో మనందరి మధ్యకు తిరిగి వస్తారని భావించాను. ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి రావడం విచారకరం. చిన్న వయసులో తారకరత్న పరమపదించటం వారి కుటుంబానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.
'ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను'
'తారకరత్న భౌతికంగా మా మధ్యలేకపోయినా వారి ప్రేమ, అనురాగం మా హృదయాల్లో ఎల్లప్పుడూ చిరస్థాయిగా ఉంటాయి. తన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను' అని తన సంతాప సందేశంలో తారకరత్న బాబాయి నందమూరి రామకృష్ణ పేర్కొన్నారు.
'చిన్న వయసులోనే మనల్ని వీడి వెళ్లడం నిజంగా బాధాకరం'
తారకరత్న మరణవార్త విని షాకయ్యానని సినీ నటుడు మహేశ్‌బాబు అన్నారు. ఇంత చిన్న వయసులోనే ఆయన మనల్ని వీడి వెళ్లడం నిజంగా బాధాకరమన్నారు. తారకరత్న కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు.
'దయగల స్వభావం కలగిన ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు'
మృత్యువుతో పోరాడి తారకరత్న మరణించారనే విషాద వార్త తెలిసి చాలా బాధపడ్డానని రవితేజ ట్వీట్ చేశారు. ఇతరులపట్ల దయగల స్వభావం కలిగిన ఆయన ఎప్పటికీ గుర్తిండిపోతారని ట్వీట్ చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానూభూతి తెలిపారు. ఈమేరకు రవితేజ ట్వీట్ చేశారు. వీరితో పాటు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
'ఆయనొక డైనమిక్ పర్సన్'
"చిన్న వయసులోనే నందమూరి తారకరత్న కన్నుమూయడం నిజంగా బాధాకరం. ఆయనొక డైనమిక్ పర్సన్. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా" అని వెంకటేశ్ సంతాపం తెలిపారు. తారకరత్న మృతి పట్ల కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ విచారం వ్యక్తం చేశారు.
కర్నాటక హెల్త్ మినిస్టర్ సంతాపం బెంగళూరులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సినీనటుడు తారకరత్న భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. బంధువులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం రంగారెడ్డి మోకిలలోని ఆయన నివాసంలో పార్థివదేహాన్ని ఉంచారు. తారకరత్నను చూసిన, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ముఖ్యంగా ఆయన కుమార్తె 'నాన్నా.. నాన్నా' అంటూ కన్నీటిపర్యంతమవుతుంటే, కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.
కాగా, తారకరత్న అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకూ తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ప్రజల సందర్శనార్థం తారకరత్న పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 5గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుపుతారు.