Hero NTR New Look: ప్రతి సినిమాకీ ఎన్టీఆర్ స్టైల్ మారుతోంది. పాత్రకి తగ్గట్టుగా తన లుక్ మారుస్తుంటారు. అందుకోసం ఎంతైనా శ్రమిస్తుంటారు. కొన్నిసార్లు కండలు కరిగిస్తుంటారు, పెంచుతుంటారు. ఆ ప్రభావం తెరపై స్పష్టంగా కనిపిస్తుంటుంది. అభిమానుల్ని మరింతగా అలరిస్తోంది. త్వరలోనే పట్టాలెక్కనున్న కొత్త సినిమా కోసం కూడా ఆయన కసరత్తులు మొదలుపెట్టారు. ఇప్పటికే కొంత బరువు తగ్గిన ఆయన... మరింత నాజూగ్గా మారే పనిలో ఉన్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలో కండలు పెంచి, బలంగా కనిపించిన ఎన్టీఆర్... కొత్త సినిమా కోసం కొన్ని కిలోల బరువు తగ్గే పనిలో ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. వచ్చే నెలలో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. 'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో అందుకు తగ్గ కథ, కథనాల్ని దర్శకుడు సిద్ధం చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు.
చైతూ కొత్త సినిమా షురూ!
'విరాటపర్వం' సినిమాతో హృదయాల్ని కదిలించారు దర్శకుడు వేణు ఊడుగుల. తొలి సినిమా నుంచే కథ, కథనాలపై తనదైన ముద్ర వేస్తున్న దర్శకుడాయన. తదుపరి సినిమా కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. నాగచైతన్య కోసం ఓ కథని సిద్ధం చేసి వినిపించినట్టు తెలిసింది. ఇద్దరి మధ్య కథా చర్చలు జరుగుతున్నట్టు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. నాగచైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పలువురు యువ దర్శకులు ఆయన కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. అందులో వేణు ఊడుగుల కథ ఒకటి. అన్నీ కుదిరితే ఈ కలయికలో సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.