ప్రముఖ సినీ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం చెన్నైలోని తన స్వగృహంలోని తుది శ్వాస విడిచారు. విజయనగరం జిల్లా లక్కవరపు కోటకు చెందిన కృష్ణ.. కోడి రామకృష్ణ దర్శకత్వంలోని 'భారత్ బంద్' చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత విలన్, సహాయ పాత్రల్లో నటించి మెప్పించారు. అంతే కాకుండా చాలా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా పనిచేశారు. సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు పొందిన కాస్ట్యూమ్స్ కృష్ణ అసలు పేరు మాదాసు కృష్ణ.
1980ల్లో వచ్చిన ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి లాంటి అగ్ర నటీనటులకు కాస్ట్యూమ్స్ అందించారు. నిర్మాతగానూ తన అదృష్టం పరీక్షించుకున్న కాస్ట్యూమ్స్ కృష్ణ.. ఇప్పటి వరకు 8 చిత్రాలను నిర్మించారు. దీంతో పాటు 'అల్లరి మొగుడు', 'దేవుళ్లు', 'విలన్; 'మా ఆయన బంగారం', 'శాంభవి ఐపీఎస్', 'పుట్టింటికి రా చెల్లి' లాంటి హిట్ సినిమాల్లో నటించారు కాస్ట్యూమ్స్ కృష్ణ. కాగా, పెళ్లిపందిరి చిత్రం తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు కాస్ట్యూమ్స్ కృష్ణ.
కాస్ట్యూమ్ డిజైనర్‌గా బిజీగా ఉన్న కృష్ణలో ఓ నటుడిని చూశారు దివంగత సీనియర్ దర్శకుడు కోడిరామకృష్ణ. ఆయనకు నటించాలనే ఆసక్తి లేకపోయినప్పటికీ ఎలాగో ఒప్పించారు. అలా కాస్ట్యూమ్స్ కృష్ణ భారత్ బంద్ సినిమాలో విలన్‌గా నటించారు. తొలి చిత్రంలోనే తనదైన విలనిజంతో ఆయన ఆకట్టుకున్నారు. తర్వాత నటుడిగా మళ్లీ ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. నటుడిగా ఉన్న సమయంలోనే నిర్మాతగానూ మారారు. కృష్ణతో అశ్వథ్థామ, అరుంధతి (పాత ఇసనిమా), పెళ్లి పందిరి వంటి సినిమాలను నిర్మించారు.
కాస్ట్యూమ్స్ కృష్ణ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కాస్ట్యూమ్స్ కృష్ణ మరణ వార్త విని బాధ కలిగిందని.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానంటూ నిర్మాత దిల్ రాజు ట్వీట్ చేశారు.
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. ఇటీవల మలయాళ నటుడు ఇన్నోసెంట్(75) కన్నుమూశారు. మార్చి 3వ తేదీ నుంచి కేరళ.. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కరోనా ఇన్ఫెక్షన్, శ్వాసకోశ వ్యాధులు, వివిధ అవయవాల వైఫల్యం వల్ల ఇన్నోసెంట్ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. అంతకుముందు.. ఫిబ్రవరి 2న తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజ దర్శకుడు, కళా తపస్వి కె విశ్వనాథ్ కన్నుమూశారు.