తెలంగాణ

telangana

By

Published : Jul 10, 2022, 7:07 AM IST

ETV Bharat / entertainment

'విలువలు లేకపోతే మనకీ జంతువులకీ తేడా ఏముంది'

Krishna Vamsi rangamarthanda movie: టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ ఫ్యామిలీ ఎంటర్​టైనర్లు​ సినిమాలు తీయడంలో దిట్ట. మురారి, గోవిందుడు అందరివాడేలే, నిన్నే పెళ్లాడతా వంటి సినిమాలతో ప్రేక్షకుల గుండెల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా కృష్ణవంశీ 'రంగమార్తాండ' సినిమాను తెరకెక్కించారు. ప్రకాశ్​రాజ్​, రమ్యకృష్ణ ఇందులో ప్రధాన పాత్రదారులు. ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఈనాడు సినిమాతో కృష్ణవంశీ ముచ్చటించారు.

krishna vamsi rangamarthanda movie
కృష్ణవంశీ

Krishna Vamsi rangamarthanda movie: హిట్‌.. ఫ్లాప్‌..... సినిమా పరిభాషలో ఎక్కువగా వినిపించే మాటలు ఈ రెండే! కానీ 'గుర్తుండిపోయే సినిమాలు' అంటూ మూడో మాట అప్పుడప్పుడూ వినిపిస్తుంటుంది. అలాంటి చిత్రాలకు పెట్టింది పేరు.. కృష్ణవంశీ. ఎప్పుడు చూసినా కొత్తగా అనిపించే ఈయన సినిమాల్ని జయాపజయాలతో ముడిపెట్టలేం. తన మార్క్‌ మేకింగ్‌తో తెలుగు చిత్రపరిశ్రమపై ప్రత్యేకమైన ముద్ర వేసిన కృష్ణవంశీ ఇటీవల 'రంగమార్తాండ' తెరకెక్కించారు. ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఆ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కృష్ణవంశీ 'ఈనాడు సినిమాతో ముచ్చటించారు.

ఓటీటీల రాకతో ఏ భాషకి చెందిన చిత్రాలనైనా అందరూ చూసేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు రీమేక్‌ చేయడానికి కారణం?
మరీ రీమేక్‌లు ఇప్పుడే ఎక్కువగా తెరకెక్కుతున్నాయి కదా! (నవ్వుతూ). ఇదివరకు పొరుగు భాషల్ని ఎంతో నిశితంగా గమనిస్తూ బాగుందని టాక్‌ వచ్చాక ఆయా రాష్ట్రాలకి వెళ్లి, చూసి, బాగుందనిపిస్తే అప్పుడు రీమేక్‌ కోసం హక్కుల్ని తెచ్చేవాళ్లు. ఇప్పుడు అన్నీ ఇంట్లో కూర్చునే చూస్తున్నాం. బాగుందనిపిస్తే వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు మనవాళ్లు. 'రంగమార్తాండ' మరాఠీ సినిమా 'నటసామ్రాట్‌'కి రీమేక్‌. 1970ల్లో రాసిన నాటకం ఆధారంగా రూపొందిన చిత్రమిది. 2020లో తీస్తున్నప్పుడు ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్టుగా తీస్తాం కదా. నిజానికి దీని హక్కుల్ని ప్రకాశ్‌రాజ్‌ తీసుకున్నాడు. నేను వేరే స్క్రిప్ట్‌ని తయారు చేసుకుని చేసే ప్రయత్నాల్లో ఉండగా, తనొచ్చి 'ఈ సినిమాని చూసి స్క్రీన్‌ప్లే పరంగా ఏమైనా సాయం చేయరా' అన్నాడు. చేస్తానని చెప్పా. అప్పుడు ప్రకాశ్‌రాజ్‌ 'లేదు, నువ్వే దర్శకత్వం చేయాల'న్నాడు. అలా అవకాశం దక్కింది.

మిమ్మల్ని అంతగా కదిలించిన అంశాలు ఈ కథలో ఏమున్నాయి?
మనలో దిగజారిపోతున్న విలువల గురించి పాతతరం ఎలా బాధపడుతోందనే విషయం నన్ను కదిలించింది. తల్లిదండ్రుల్ని మనం ఎలా చూస్తున్నాం? డబ్బు, విజయం మనుషుల్ని ఎంతగా ఒంటరిని చేస్తోందనే విషయాలు ఆలోచన రేకెత్తిస్తాయి. రంగస్థలంపై రకరకాల పాత్రలు పోషించి మెప్పించిన ఓ నటుడు.. ఆ వృత్తిని పక్కనపెట్టి తన నిజ జీవిత పాత్ర పోషించే క్రమంలో చుట్టూ మనుషులంతా నటుల్లాగా కనిపిస్తారు. వీళ్ల మధ్య ఎలా బతకాలనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రతి మనిషికీ ఎదురవుతున్న సమస్య ఇది. ఆ సంఘర్షణ చుట్టూ సాగే కథే ఇది.

ఈసారి చాలా ఎక్కువ సమయమే తీసుకున్నారు. ట్రెండ్‌ని పరిశీలించి అడుగులు వేస్తున్నారా?
ట్రెండ్‌ అనేది ఎప్పుడూ ఉండేదే. నేను సినిమా చేస్తున్న సమయానికీ ఉంది, నాకంటే ముందూ ఉంది. ప్రతీ ఐదేళ్లకి ఓ తరం మారుతుంది. అయినా అందరూ ఇళ్లల్లోనే బతుకుతున్నాం. అవే కుటుంబ విలువలు, అదే విద్య, అదే ఆహారమే. రంగు, తయారయ్యే విధానం మారుతుందంతే.

నా పని సక్సెస్‌ అవ్వొచ్చు, ఫెయిల్‌ అవ్వొచ్చు తప్ప వ్యక్తిగతంగా ఫెయిల్‌ అవ్వడం అంటూ ఉండదు. ఒక సినిమా ఫ్లాప్‌ కావడానికి చాలా కారణాలు ఉంటాయి. అది నా ఒక్కడికీ జరగలేదు. చాలామంది ఉద్ధండులకీ, కొత్తవాళ్లకీ జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని అంత సీరియస్‌గా తీసుకుని కుమిలిపోయి నమ్మిన విలువల్ని, నడవడికని మార్చుకునేంత బలహీనుణ్ని కాదు.

అన్నిటికంటే మిమ్మల్ని విలువలు ఎక్కువగా ఆకర్షిస్తుంటాయేమో కదా?
నా సినిమాలు చూస్తే అది అర్థమవుతుంది. విలువలు లేకపోతే మనకీ జంతువులకీ తేడా ఏముంటుంది? కొట్టుకు చచ్చిపోతాం. ఎట్టిపరిస్థితుల్లోనూ మనందరం విలువలతో కూడిన వ్యవస్థలో ఉండాలి. అదే మన భారతదేశం వేల ఏళ్లుగా చెబుతోంది, అనుసరిస్తోంది. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల మధ్య కూడా సమాజంలో శాంతి కనిపిస్తుందంటే అది మన పెద్దలు మనకు నేర్పిన విలువల పాఠం సారాంశమే.

కె.విశ్వనాథ్‌, బాపు, జేమ్స్‌ కామెరూన్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ, సంజయ్‌ లీలా భన్సాలీ, కె.రాఘవేంద్రరావు, భారతీరాజా, బాలచందర్‌, కోడి రామకృష్ణ.. ఇలా చాలా మందే విలువలు చెప్పిన వారు ఉన్నారు. అంత పెద్ద హీరోని ఒప్పించి, చాలా మంది వద్దంటున్నా సరే కె.రాఘవేంద్రరావు 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' తీశారు. ఆయన మన కథల్ని చెప్పడానికి ప్రయత్నించారు. మన పూర్వీకులు ఎంత గొప్ప విలువలతో బతికారో చెప్పారు. మంచి, విలువలు చెబితే ఎవరు చూస్తారనే అభిప్రాయాలు వ్యక్తం కావొచ్చు. ఇది ప్రజాస్వామ్యం ఎవరి ఉద్దేశాలు వారికుంటాయి. ఆలోచించుకునేవాడు ఆలోచించుకుంటాడు.

'అన్నం' సినిమాని ప్రకటించారు. మీ కలల ప్రాజెక్ట్‌ 'వందేమాతరం' కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయా? వెబ్‌ సిరీస్‌ చేస్తారనే మాట వినిపించింది?
‘వందేమాతరం’ సినిమానా? ఏమో సందేహమే! తదుపరి నేను చేయనున్నది 'అన్నం' చిత్రమే. ఫుడ్‌ మాఫియా నేపథ్యంలో సాగే కథ ఇది. దాని గురించి మాట్లాడుకోవడానికి చాలా సమయం ఉంది.

వచ్చే ఏడాది వెబ్‌ సిరీస్‌ని పట్టాలెక్కిస్తా. దానికి సంబంధించి పరిశోధన జరుగుతోంది. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ఒకొక్కటి యాభై నిమిషాల చొప్పున, యాభై ఎపిసోడ్స్‌ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో 1942 నుంచి 56 వరకు గొప్ప పౌర పోరాటం జరిగింది. అది తెరపైకి రావాలి.

"మేకింగ్‌లో సహజత్వం అనేది ఎప్పట్నుంచో ఉన్నదే. ఈమధ్య ఎక్కువ మంది ఆ తరహాలో తీస్తున్నారు. కమర్షియల్‌, సహజమైన సినిమాలు.. ఈ రెండూ ఎప్పుడూ కలిసే ముందుకు సాగుతుంటాయి. ప్రతిచోటా మనిషి తనకంటే గొప్పగా కనిపించేవాడినే హీరోలా చూడటానికి ఇష్టపడతాడు. పది మందిని కొట్టాలి, హీరోయిన్‌ని ఆటపట్టించాలి, డ్యాన్స్‌ చేయాలి, పాటలు పాడాలి, కామెడీ చేయాలి. అందుకే అక్కడ సూపర్‌మేన్‌, బ్యాట్‌మేన్‌, ఇక్కడ మన హీరోల చిత్రాలు. అది ఫ్రెంచ్‌ సినిమా కావొచ్చు, ఇంగ్లిష్‌, ఆస్ట్రేలియన్‌, ఇరానియన్‌ సినిమా కావొచ్చు. దీనికి సమాంతరంగా వాస్తవికతతో కూడిన సహజమైన చిత్రాలూ వస్తుంటాయి".

"మనిషికి ఈ విశ్వం ఇచ్చిన ఒక అద్భుతమైన వరం సంగీతం, సాహిత్యం. అన్నిచోట్లా సంగీతం ఉంది. అది అందరికీ అబ్బదు. పూర్వ జన్మలో చేసుకున్న అద్భుతమైన పుణ్యాలవల్ల కొంతమందిని 'వెళ్లండ్రా.. వెళ్లి సమాజాన్ని జాగృతం చేయండ'ని పంపిస్తారేమో. అలాంటి వ్యక్తులే ఇళయరాజా, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. వాళ్ల సాహిత్యం, సంగీతంతో మనతో మాట్లాడి మనొకక ఆలోచనా విధానం, ఒక సాంఘిక అవగాహన ఏర్పరిచారు. యండమూరి వీరేంద్రనాథ్‌, మా బాస్‌ రామ్‌ గోపాల్‌ వర్మ.. వీళ్లంతా అద్భుతాలు. వీళ్ల మధ్య గడుపుతూ, రాసుకు పూసుకు తిరిగాననే సంతోషం నాకెప్పటికీ ఉంటుంది".

ఇవీ చదవండి:'నాకు ఆ ఆలోచన ఉంటే.. అన్ని సినిమాలు సూపర్​ హిట్​ అయ్యేవి'

తనికెళ్ల భరణి ఎన్నాళ్లకు.. మణిరత్నం ప్రతిష్టాత్మక సినిమాకు మాటలు..

ABOUT THE AUTHOR

...view details