Tiatnic Tourist Submarine : హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ గురంచి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 'అవతార్', 'అవతార్2' లాంటి విజువల్ వండర్స్‌ను తెరకెక్కించి ఆయన సుప్రసిద్ధులయ్యారు. ఇక ఆయన రూపొందించిన 'టైటానిక్' ఓ మాస్టర్ పీస్. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ఓ ఓడ.. గమ్యానికి చేరుకునే దారిలో ప్రమాదానికి గురై ఎలా సముద్రగర్భంలో కలిసిపోయిందో అనే విషయాన్ని కామెరూన్ భావోద్వేగభరితంగా చూపించారు. సాహసాలపై మక్కువ చూపే కామెరూన్.. సముద్రంలో మునిగిపోయిన ఆ 'టైటానిక్' షిప్ ప్రాంతాన్ని ఇప్పటివరకూ 33సార్లు సందర్శించారు. 13వేల అడుగుల లోతున ఉండిపోయిన ఈ చరిత్ర సజీవ సాక్ష్యాలను ఆయన డాక్యుమెంటరీ రూపంలోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఇటీవలే సముద్రగర్భంలో ఆచూకీ లభించకుండా పోయి విషాదాన్ని నింపిన 'టైటాన్' కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి గాలించారు. అయినా టైటాన్ ఆచూకీ లభించకపోవడం వల్ల రెస్క్యూ ఆపరేషన్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగింది. ఈ క్రమంలో టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని అనేకసార్లు సందర్శించిన కామెరూన్.. ఆ సాహస యాత్ర గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 'ఈ భూమ్మీద అత్యంత క్రూరమైన ప్రదేశాల్లో అది కూడా ఒకటి' అని టైటానిక్ మునిగిపోయిన ప్రాంతం గురించి ఒక్క ముక్కలో చెప్పేశారు. మనుషులు ఎప్పుడూ చూడని ప్రదేశాలను చూడటమంటే తనకెంతో ఆసక్తి అని, అందుకే ఆ ప్రాంతానికి వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాదు సముద్రగర్భం ఇతివృత్తంగా 'ఎక్స్‌పెడిషన్: బిస్‌మర్క్', 'ఘోస్ట్స్ ఆఫ్ ది అబేస్ అండ్ ఏలియన్స్ ఆఫ్ ది డీప్' అనే రెండు డ్యాకుమెంటరీల చిత్రాలను కూడా ఆయన తెరకెక్కించారు.
Titanic James Cameron : ఇక ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకున్న 'టైటానిక్' మూవీ తీయడం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని జేమ్స్ కామెరూన్ చెప్పుకొచ్చారు. ''ఓడ మునిగిపోయిన ప్రాంతాన్ని చూడాలన్న ఆకాంక్షతోనే 'టైటానిక్' తెరకెక్కించాను. అంతేకానీ ప్రత్యేకంగా దాన్నొక సినిమాగా తీయాలన్న ఉద్దేశమైతే నాకు లేదు. ఆ కారణం వల్లనే సబ్‌మెరైన్‌లో సముద్ర గర్భంలో ప్రయాణించాను. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతి పెద్ద ఓడ ప్రమాదాల్లో టైటానిక్.. ఓ ఎవరెస్ట్ లాంటిది. ఒక డైవర్‌గా దాన్ని మరింత బాగా చూపించాలనుకున్నా. అందుకే చాలాసార్లు ఆ ప్రాంతాన్ని సందర్శించాను. ఇక సినిమా నిర్మాణాన్ని నేను సాహసయాత్రగా భావిస్తాను. ఇలాంటి సినిమాల నిర్మాణాల కోసం నిరంతరం కృషిచేస్తుంటాను'' అని కామెరూన్ చెప్పుకొచ్చారు.