Tiger Nageswara Rao Renu Desai : మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబరు 20న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. దాదాపు 18 ఏళ్ల విరామం తర్వాత నటి రేణూదేశాయ్ ఈ సినిమాతో వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఆమె గుర్రం జాషువా కుమార్తె, సామాజికవేత్త 'హేమలత లవణం'గా కనిపించారు. ఇలాంటి పాత్రలో నటించడంపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నటి రేణూదేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"కథ, దర్శక-నిర్మాతల వల్లే నేను టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నా. హేమలత లవణం పాత్రలో నటించడానికి మొదట చాలా భయపడ్డాను. ఆ పాత్రకు 100 శాతం న్యాయం చేయగలనా? లేదా? అని ఆలోచించా. దర్శకుడు వంశీ, టీమ్ సపోర్ట్ చేయడం వల్ల ఆ పాత్రలో నటించా. ఏదో జన్మలో చేసిన పుణ్యఫలం వల్లే ఈ పాత్ర పోషించే అవకాశం నాకు దక్కింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా పోస్టర్ చూసిన తర్వాత నా కుమారుడు అకీరా ఎంతో సంతోషించాడు. 'చాలా మంది నటీమణులు వాళ్ల వయసుకు తగ్గ పాత్రల్లో నటించడానికి ఆసక్తి కనబరచడం లేదు. స్క్రీన్‌పై యంగ్‌గా కనిపించాలనుకుంటున్నారు. కానీ, నువ్వు నీ వయసుకు తగ్గ పాత్ర చేశావు. అందుకు నేను ఎంతో గర్వపడుతున్నా' అని ఆద్య చెప్పింది. హేమలత లవణం పాత్ర నాలో చాలా మార్పు తెచ్చింది. రవితేజతో కలిసి వర్క్ చేయడాన్ని ఎప్పటికీ మర్చిపోను. ఆయన మంచి వ్యక్తి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన గురించి ఎన్నో విషయాలు చెబుతా. నా నిర్మాతలు నన్ను కుటుంబసభ్యురాలిగా చూసుకున్నారు." అని రేణూదేశాయ్ తెలిపారు.
అలాగే అకీరా నందన్ అరంగేట్రంపై స్పందించారు రేణూదేశాయ్. మ్యూజిక్, ఫిల్మ్ ప్రొడక్షన్ కోర్సులతోపాటు స్క్రిప్ట్ రైటింగ్‌పై ప్రస్తుతానికి అకీరా ఫోకస్ చేస్తున్నాడని తెలిపారు. నటనవైపు అడుగువేయాలని అకీరా అనుకోవట్లదని అన్నారు. అలాగే తాను కానీ, పవన్‌కల్యాణ్ కానీ యాక్టర్‌గా మారమని అకీరాను బలవంతం చేయడం లేదని చెప్పారు. 'అకీరా చూడటానికి అందంగా ఉంటాడు. ఒక నటుడికి కావాల్సిన అన్ని లక్షణాలు అకీరాలో ఉన్నాయి. నేను ఒక నటిని. వాళ్ల నాన్న, పెదనాన్న యాక్టర్స్. నా కుమారుడిని వెండితెరపై చూడాలని నాకు ఆశగా ఉంది. అయితే హీరో కావాలని ముందు అకీరాకి అనిపించాలి' అని రేణు తెలిపారు.