Tiger Nageswara Rao Release :టాలీవుడ్లో ఏ భాష సినిమాకైనా కొంచెం పాజిటివ్ టాక్ వస్తే ఆదరణ లభిస్తుంది. తెలుగు ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలను ప్రోత్సహిస్తారు. ఇతర భాషల సినిమాలు తెలుగులో సాధించిన కలెక్షన్లు మరే ఇండస్ట్రీలో రాబట్టలేవు. కానీ తెలుగు సినిమా స్థాయి పాన్ఇండియా వరకు వెళ్లినా.. కొన్ని ఇండస్ట్రీల్లో సరైన ఆదరణ లభించడం లేదు. కేవలం 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప' వంటి సినిమాలు మినహా.. ఇతర చిత్రాలకు తగినంత సపోర్ట్ రావడం లేదు. అయితే ఇప్పుడు తాజాగా 'టైగర్ నాగేశ్వరరావు'సినిమాకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతున్నట్లు టాక్.
టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజకొత్త చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. ఈ సినిమాను డైరెక్టర్ వంశీ కృష్ణ.. పాన్ఇండియా రేంజ్లో తెరకెక్కించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అభిషేక్ రూపొందించారు. రీసెంట్గా ట్రైలర్ విడుదల చేసిన చిత్రబృందం.. దసరా కానుకగా అక్టోబర్ 20న గ్రాండ్‌గా సినిమాను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో సినిమాకు బాలీవుడ్లో మంచి సపోర్ట్‌తోపాటు.. పెద్ద ఎత్తున థియేటర్లు కూడా లభిస్తున్నాయి. కానీ తమిళ ఇండస్ట్రీ కోలీవుడ్‌లో మాత్రం.. టైగర్ నాగేశ్వర రావుకు సరైన మద్ధతు కరవైనట్లు తెలుస్తోంది.
తమిళ్లో కూడా విడుదలౌతున్న ఈ సినిమాకు అక్కడ థియేటర్లు లభించడం సమస్యగా మారిందట. డిస్ట్రిబ్యూట్ చేయడానికి బడా సంస్థల సపోర్ట్ దక్కడం లేదని టాక్. అయితే ఈ సినిమా కంటే ఒకరోజు ముందు విజయ్ 'లియో' రావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అక్కడ మెజారిటీ థియేటర్లలో 'లియో' నే ప్రదర్శితం కానుందట. దీంతో తమిళ్లో నామమాత్రంగానే విడుదల కావచ్చునని సినీ విశ్లేషకులు అంటున్నారు.