Tiger 3 Review :చిత్రం: 'టైగర్ 3'; నటీనటులు: సల్మాన్‌ఖాన్, కత్రినాకైఫ్, ఇమ్రాన్ హష్మీ, రేవతి, రిద్ధి డోగ్రా, కుముద్ మిశ్రా, సిమ్రాన్ తదితరులు; కథ: ఆదిత్య చోప్రా; మాటలు: అంకుర్ చౌదరి; సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామి; ఎడిటింగ్: రామేశ్వర్ ఎస్.భగత్; సంగీతం: ప్రీతమ్; నేపథ్య సంగీతం: తనూజ్ టీకు; స్క్రీన్‌ప్లే: శ‌్రీధర్ రాఘవన్; నిర్మాణం: ఆదిత్య చోప్రా; దర్శకత్వం: మనీష్ శర్మ; సంస్థ: యశ్‌రాజ్ స్పై యూనివర్స్; విడుదల: 12-11-2023.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ - కత్రినాకైఫ్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన సినిమా 'టైగర్ 3'. యశ్‌రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్లు షారూఖ్, హృతిక్ రోషన్ అతిథి పాత్రల్లో మెరిశారు. దర్శకుడు మనీశ్ శర్మ తెరకెక్కించిన ఈ సినిమా.. దీపావళి సందర్భంగా నవంబర్ 12 ఆదివారం గ్రాండ్‌గా రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే.
కథేంటంటే : విద్వేషపు ఆలోచనల్లో ఉన్న మాజీ ఐఎస్ఐ ఏజెంట్ అతీష్ రెహ్మాన్ (ఇమ్రాన్ హష్మీ), పాకిస్థాన్ ప్రధాన మంత్రి నస్రీన్ ఇరానీ (సిమ్రాన్)ని హత్య చేసి, ఆ నేరాన్ని ఇండియా ఏజెంట్ టైగర్ (సల్మాన్‌ఖాన్) పై వేయాలని ప్లాన్ చేస్తాడు. నస్రీన్ ఇరానీ చేస్తున్న శాంతి ప్రయత్నాలు నచ్చని అతీష్.. పాకిస్థాన్ దేశ సైన్యాధికారుల్ని రెచ్చగొట్టి మరీ ఇందుకోసం వ్యూహం రచిస్తాడు. టైగర్ (సల్మాన్‌ఖాన్), అతని భార్య జోయా (కత్రినాకైఫ్) పర్సనల్ లైఫ్‌లోకి వెళ్లి.. వారిని ఓ ఆపరేషన్‌కోసం వాడుకుంటాడు. ఆ ఆపరేషన్‌తో దంపతులిద్దర్నీ ప్రపంచం ముందు దేశద్రోహులుగా నిలబెట్టాలని ప్రయత్నిస్తాడు. మరి అతీష్ అనుకున్నది జరిగిందా? అతడి విద్వేషపు ప్రయత్నాల్ని టైగర్ ఎలా తిప్పికొట్టాడనేదే సినిమా అసలు కథ.
ఎలా ఉందంటే : స్పై యూనివర్స్‌లో ఇదివరకు వచ్చినట్టే ఈ సినిమాలో కూడా దేశభక్తి ప్రధాన అంశం. సీక్రెట్ ఆపరేషన్‌లో ఉన్న రా ఏజెంట్ టైగర్ స్టంట్స్‌తో స్టోరీ స్టార్ట్ అవుతుంది. కేవలం ఏజెంట్ డ్రామాగానే కాకుండా.. టైగర్ ఫ్యామిలీ స్టోరీ, రివెంజ్ అంశాల్ని జోడించడం కథ ప్రత్యేకత. తొలి రెండు సినిమాల్లో జోడీగా కనిపించిన సల్మాన్ - కత్రినా.. ఈ సినిమాలో తల్లిదండ్రులుగా చూపించారు. ఈ నిర్మాణ సంస్థలోంచి ఇదివరకు వచ్చిన సినిమాల్లోగే.. టైగర్ 3 కూడా భారీ బడ్జెట్‌తోనే రూపొందింది. కానీ, ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాని కథ, పేలవమైన ఎమోషనల్స్ సీన్స్.. కొత్తదనం లేని యాక్షన్ సన్నివేశాలతో సినిమా పెద్దగా మెప్పించదు. కథ సాగే విధానాన్ని ప్రేక్షకులు ముందుగానే ఊహించవచ్చు.
సల్మాన్, కత్రినా జోడీ చేసిన యాక్షన్.. వాళ్ల నటన, భారీ హంగులు తప్పితే సినిమాలో చెప్పుకునేది లేదు. అయితే ఇస్తాంబుల్‌లో టైగర్, అతడి బృందం కలిసి చేసే ఓ ఆపరేషన్ ఆకట్టుకుంటుంది. టైగర్‌తో పఠాన్ కలిసి చేసే స్టంట్స్.. సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో షారూఖ్.. అల్లరి, ఇద్దరి మధ్య మాటలు అలరిస్తాయి. పతాక సన్నివేశాలు మెప్పిస్తాయి. దేశ అధ్యక్షురాలు టైగర్‌కి బహుమానంగా జాతీయ గీతం వినిపించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చివర్లో మరో అతిథి పాత్రలో హృతిక్ రోషన్ మెరుస్తారు.
ఎవరెలా చేశారంటే: సల్మాన్‌ఖాన్, కత్రినాకైఫ్ యాక్షన్ సీన్స్ సినిమాకు బలం చేకూర్చాయి. వీరి జోడి మరోసారి తెరపై చూడముచ్చటగా ఉంటుంది. కణం కణం పాటలో ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ పండింది. ముందు నుంచి ట్రెండింగ్‌లో ఉన్న కత్రినా కైఫ్ టవల్ సీన్.. ఆకట్టుకుంటుంది. ఇమ్రాన్‌హష్మీ విలన్‌గా మెప్పించారు. కానీ ఆ పాత్రకు పెద్దగా ఇంపాక్ట్ లేదు. సిమ్రాన్ పాకిస్థాన్ ప్రధానిగా మంచి నటనని ప్రదర్శించారు. షారూఖ్‌ఖాన్ అతిథి పాత్ర సినిమాకి హైలైట్. కానీ, ఆ సన్నివేశాలు ఫ్యాన్స్‌కి కిక్కివ్వడంలో దర్శకుడు విఫలమయ్యారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్, విజువల్స్, భారీ హంగులు సినిమా రేంజ్‌ను పెంచుతాయి. అనయ్ గోస్వామి కెమెరా పనితనం బాగుంది. ప్రతీ సన్నివేశం విజువల్‌గా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్‌లో లోపాలు కనిపిస్తాయి. పాటలు కూడా అంతలా ఆకట్టుకోలేదు. దర్శకుడు మనీష్ శర్మ కొన్ని సన్నివేశాలపై మాత్రమే ఇంపాక్ట్ చూపించారు.